సోమవారం 01 మార్చి 2021
Warangal-city - Feb 24, 2021 , 01:41:36

లేటెస్టుగా నేత..!

లేటెస్టుగా నేత..!

  • ఫ్రేమ్‌ మగ్గాలపై నేత కార్మికులకు శిక్షణ
  • కొత్తవాడ, వీవర్స్‌కాలనీలో తర్ఫీదు 
  • త్వరలో ఓరుగల్లులో చేనేత సూటింగ్‌, షర్టింగ్‌ ఉత్పత్తులు

నగరంలోని చేనేత కార్మికులు లేటెస్టు వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు కొత్తవాడలో ఉత్పత్తి చేస్తున్న బెట్‌షీట్స్‌, కార్పెట్స్‌ స్థానంలో సూటింగ్‌, షర్టింగ్‌ ఉత్పత్తులు చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం పలు చేనేత సహకార సంఘాల్లో ఎంపిక చేసిన కార్మికులకు ఫ్రేమ్‌ మగ్గాలపై తగిన తర్ఫీదును ఇస్తున్నది. ప్రస్తుతం వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని కొత్తవాడ, వీవర్స్‌కాలనీతో పాటు సూరారం, వెంకటేశ్వరపల్లిలో చేనేత కార్మికులు ఆధునిక శిక్షణ పొందున్నారు. 

- పోచమ్మమైదాన్‌, ఫిబ్రవరి 23

చేనేత కార్మికులు పాతకాలం నాటి చేనేత ఉత్పత్తులతో పాటు సన్నరకం షర్టింగ్‌, సూటింగ్‌ వస్ర్తాల తయారీకి తగిన నైపుణ్యం సంపాదించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా పలు డిజైన్లలో ఉత్పత్తులను చేయించడానికి చేనేత జౌళి శాఖ అధికారులు కార్మికులకు శిక్షణ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఎంపిక చేసిన మహిళా, పురుష కార్మికులకు తగిన తర్ఫీదును ఇచ్చి, రానున్న కాలంలో కొత్తవాడలో షర్టింగ్‌, సూటింగ్‌, తాన్‌ వస్ర్తాలను తయారు చేసేలా తీర్చిదిద్దనున్నారు. వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో తొలుత వీవర్స్‌కాలనీలో ఫ్రేమ్‌ మగ్గాల ద్వారా ఆధునిక శిక్షణకు శ్రీకారం చుట్టారు. షతరంజి అండ్‌ నవార్‌ హెచ్‌డబ్ల్యూసీఎస్‌ లిమిటెడ్‌ ఎల్‌బీ నగర్‌ సంఘం నుంచి 10 మంది కార్మికులు, షతరంజి హెచ్‌డబ్ల్యూసీఎస్‌ లిమిటెడ్‌ సంఘం నుంచి 10 మంది కార్మికుల చొప్పున ఎంపిక చేశారు. వీరి కోసం వీవర్స్‌కాలనీలో నాలుగు ఫ్రేమ్‌ మగ్గాలను ఏర్పాటు చేసి, ఒక్కో  మగ్గంపై ఐదుగురు కార్మికుల చొప్పున శిక్షణ ఇస్తున్నారు. గత నెల 22న ఈ ట్రైనింగ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. దీంతో 20 మంది కార్మికులు 45 రోజుల పాటు షర్టింగ్‌ అండ్‌ సూటింగ్‌లో శిక్షణ పొందుతారు. అలాగే, కొత్తవాడలోని మట్టెవాడ షతరంజి చేనేత సహకార సంఘంలో ప్రత్యేకంగా 20 మంది మహిళా కార్మికులకు శిక్షణ కోసం ఈ నెల 4న ఒక కేంద్రాన్ని ప్రారంభించారు. దీంతో ఇక్కడ మహిళలు ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నారు. వీరికి కూడా 45 రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే, శిక్షణ పూర్తి చేసిన తర్వాత సర్టిఫికెట్లు ఇవ్వడంతో పాటు వారు తయారు చేసిన ఉత్పత్తులకు టెస్కో ద్వారా మార్కెటింగ్‌ సదుపాయం కల్పించనున్నారు.

కార్మికులకు ఉపకార వేతనం.. 

చేనేత కార్మికులకు షర్టింగ్‌, సూటింగ్‌పై  ఉచితంగా శిక్షణ ఇవ్వడమే కాకుండా వారికి రోజూ ఉపకార వేతనం చెల్లిస్తున్నారు. శిక్షణ పొందుతున్న ప్రతి కార్మికుడికి 45 రోజుల పాటు  రోజు రూ.210 చొప్పున ఇస్తున్నారు. అలాగే, ట్రైనింగ్‌ ఇస్తున్న మాస్టర్లకు రోజుకు రూ.600 చొప్పున, అసిస్టెంట్లకు రూ.200 చొప్పున ఇస్తున్నారు. అయితే అధికారులు శిక్షణ సమయంలో కచ్చితమైన నిబంధనలు పెట్టారు. ప్రతి ఒక్కరూ ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటలకు వెళ్లాల్సి ఉంటుంది. అటెండెంట్స్‌ కచ్చితంగా ఉండడానికి కార్మికులు ట్రైనింగ్‌ సెంటర్‌కు వచ్చినప్పుడు, వెళ్తున్నప్పుడు వీడియో కాల్‌ ద్వారా అధికారులకు చూపించాల్సి ఉంటుంది. 

సన్నరకం ఉత్పత్తులపై శిక్షణ పొందుతున్నాం 

గతంలో మేము దొడ్డురకం ఉత్పత్తులు చేశాం. ఇప్పుడు సన్నరకం ఉత్పత్తులు నేర్చుకునే అవకాశం వచ్చింది. పెద్ద పెద్ద షోరూంల్లోనే దొరికే షర్టింగ్‌, సూటింగ్‌ బట్టలను ఇక మేము కూడా తయారు చేస్తామనే ధీమా వచ్చింది. మా ఉత్పత్తులకు అధికారులే మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలి. అలాగే, చేతినిండా పని దొరికేలా చూడాలి.

- మాటేటి సమ్మయ్య, చేనేత కార్మికుడు

ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం సంతోషకరం 

మహిళల కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం సంతోషంగా ఉంది. మా కాళ్లమీద మేము నిలబడేలా మాకు  ప్రభుత్వం ఉచితంగా శిక్షణ ఇస్తూ రోజువారి ఉపకార వేతనం కూడా ఇస్తున్నది. శిక్షణ పూర్తి చేసిన తర్వాత కూడా మాకు ఉపాధి అవకాశాలు పెంచాలి. ఇక్కడ నేర్చుకున్న పనితనం ఆర్థికంగా ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

- కందగట్ల రజిత, చేనేత కార్మికురాలు

VIDEOS

logo