శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Warangal-city - Feb 23, 2021 , 02:02:29

భద్రకాళికి కొత్త సొబగులు

భద్రకాళికి కొత్త సొబగులు

  • వరంగల్‌ నిట్‌ ఆధ్వర్యంలో డిజైన్‌
  • ఆలయంలో వాహన సేవలకు మాడవీధులు
  • రూ.5కోట్లతో ఆవరణ అభివృద్ధి 
  • ప్రధాన ద్వారం వద్ద గోపురం
  • తెప్పోత్సవానికి అనుగుణంగా కొలను నిర్మాణం
  • ఉత్సవాల సమయంలో భక్తులకు మరింత సౌకర్యం
  • జీడబ్ల్యూఎంసీ నిధులతో పనులు
  • వరంగల్‌ నిట్‌ ఆధ్వర్యంలో డిజైన్‌

వరంగల్‌ ఉమ్మడి జిల్లాకు తలమానికమైన భద్రకాళీ ఆలయానికి మరిన్ని సొబగులు అద్దేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు చేపట్టింది. ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఇక్కడ జరిగే ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించేలా ప్రణాళికలు వేసింది. రూ.5కోట్లతో ఆలయ ఆవరణలో మాడవీధులు, తెప్పోత్సవం కోసం కొలను నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని భావిస్తున్నది. తొలిదశ కింద రూ.3కోట్లు కేటాయిస్తూ ఇటీవలే గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీడబ్ల్యూఎంసీ) పాలకమండలి తీర్మానించగా, నగరంలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) ఆధ్వర్యంలో డిజైన్‌ సిద్ధమవుతున్నది.

వరంగల్‌, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతి నిధి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రకాళి ఆలయాన్ని మరిం త అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆలయంలో ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు పలు అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రణాళికలు వేసింది. ఆలయానికి ప్రతి శుక్రవారం భక్తు ల రద్దీ ఎక్కువగా ఉంటున్నది. నవరాత్రులతోపాటు మిగిలిన ఉత్సవాల సందర్భంలోనూ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఉత్సవాల సమయంలో ఇప్పటివరకు వాహన సేవలను గుడిలోనే నిర్వహిస్తున్నారు. ఎక్కువ మంది భక్తులకు ఉత్సవాలను వీక్షించే అవకాశం లేకుండాపోతున్నది. ఈ పరిస్థితిని నివారిం చి, వీలైనంత ఎక్కువ మంది ఉత్సవాలను వీక్షించేలా దేవాదాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ప్రధాన ఆలయం చుట్టూ మాడవీథులు నిర్మించాలని నిర్ణయించింది. దీంతో వాహన సేవలు ఇకనుంచి ఆలయ ఆవరణలో నిర్వహించే వీలు కలుగుతుంది. ఎక్కువ మంది భక్తులు సేవలను వీక్షించే అవకాశం ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారం వద్ద గోపు రం నిర్మించడంతోపాటు తెప్పోత్సవానికి అనుగుణంగా కొలనును నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. మాడవీధులు, గోపురం, తెప్పోత్సవానికి కొలనుతో భద్రకాళీ ఆలయం కొత్తరూపును సంతరించుకోనుంది. ఈ మేరకు చేపట్టే అభివృద్ధి పనుల కోసం రూ.5కోట్లు అవుతాయని అంచనా వేశారు. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాలకమండలి తొలిదశలో రూ.3 కోట్లు కేటాయిస్తూ ఇటీవలే తీర్మానించిం ది. ఆలయ అభివృద్ధి ప్లాన్‌, డిజైన్‌ను నిట్‌ ఆధ్వర్యంలో రూపొందిస్తున్నారు. తుదిరూపు రాగానే ఆలయ అభివృద్ధి పనులు మొదలుకానున్నాయి. వచ్చే నవరాత్రి ఉత్సవాల వరకు భద్రకాళి గుడికి కొత్త రూపు రానుంది. 

దేశంలోనే ప్రసిద్ధ ఆలయం

వరంగల్‌ నగరంలోని భద్రకాళీ ఆలయం దేశంలోనే ప్రాచీన ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. తెలంగాణలోని దుర్గామాత ఆలయాల్లో ఇది ప్రముఖమైనదిగా గుర్తింపు పొందింది. చాళుక్యులు, కాకతీయుల హయాంలో భద్రకాళీ ఆలయం భద్రగిరిగా ఉండి, అమ్మవారు కాళీమాతగా పూజలందుకున్నది. 625 సంవత్సరంలో వేంగి చాళుక్యులపై విజయం సాధించిన పశ్చిమ చాళుక్య రాజు రెండో పులకేశి ఈ ఆలయాన్ని నిర్మించి, పూజులు మొదలుపెట్టినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. శక్తిని పూజించే కాకతీయులు భద్రకాళీ భక్తులుగా ఉన్నారు. కాకతీయులు ముఖ్యమైన కార్యక్రమాలు మొదలుపెట్టే ముందు భద్రకాళీ ఆలయంలో పూజలు చేసేవారని శాసనాలు పేర్కొంటున్నాయి. గణపతిదేవుడి హయాంలో హరి అనే మంత్రి ఆలయం పక్కన భద్రకాళీ చెరువును తవ్వించాడు. ఇక్కడి ఆలయంలోని అమ్మవారి విగ్రహం ఎనిమిది చేతులతో ఏకశిలపై ఉంటుంది. దేశంలోనే కూర్చుని ఉన్న అతిపెద్ద భద్రకాళీ విగ్రహం ఇక్కడే ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం తరుఫున సీఎం కేసీఆర్‌ భద్రకాళీ అమ్మవారికి 11.70 కిలోలతో బంగారు కిరీటం, జటామకుటాలు, కర్ణాభరణాలను సమర్పించారు. ఇప్పుడు ఆలయ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. 

VIDEOS

logo