శుక్రవారం 05 మార్చి 2021
Warangal-city - Feb 22, 2021 , 02:03:28

అవయవదానం నిలుపుతుంది ప్రాణం

అవయవదానం నిలుపుతుంది ప్రాణం

  • ఆర్గాన్‌ డొనేట్‌పై పెరుగుతున్న అవగాహన
  • ముందుకు వస్తున్న దాతలు
  • బాధితుల్లో చిగురిస్తున్న ఆశలు 

మనిషి శరీరం విలువ వెలకట్టలేనిది. రూ.లక్షలు ఖర్చు చేసినా మనిషి అవయవాలను తయారు చేయడం కుదరదు. అలాంటి అవయవాలను మరణానికి ముందు, తర్వాత వృథా చేయకుండా ఆపదలో ఉన్న వారికి అందించడం వల్ల  మరో ప్రాణాన్ని నిలుపవచ్చు. ఈ మధ్య కాలంలో మానవ శరీర, అవయవదానంపై పెరిగిన అవగాహనతో దాతల సంఖ్య పెరుగుతోంది. మనిషిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారు సైతం మానవత్వాన్ని చాటుకుంటూ బాధితులు, క్షతగాత్రులకు ప్రాణాలు పోస్తున్నారు.  స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సహకారంతో కొందరి జీవితాలను నిలబెడుతున్నారు. 

అవయవ దానం ఎవరు చేయవచ్చు.. 

క్యాన్సర్‌, హెచ్‌ఐవీ బాధితులు, రక్తంలో లేదా శరీర కణజాలంలో వ్యాధికారక బ్యాక్టీరియా ఉన్నవారు, అలాగే గుండె, మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారు మినహా ఆరోగ్యవంతులైన అందరూ అవయవాలను దానం చేయవచ్చు. జీవించి ఉన్నప్పుడు దానం చేసే అవయవాలతోపాటు మరణానంతరం దానం చేసే అవయవాలు కూడా ఉన్నాయి. కాగా, క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులు కూడా అవయవ దానం చేయవచ్చు. అయితే, ఇది క్యాన్సర్‌ రకం, దాని కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ క్యాన్సర్‌ బాధిత దాత నుంచి స్వీకరించిన అవయవాన్ని ఎవరికైనా అమర్చితే వారికి కూడా క్యాన్సర్‌ వచ్చే అవకాశాలుంటాయి. అందుకే దీనిపై వైద్యులు ఆసక్తి చూపరు. 

ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు నిత్యం ఎందరినో బలి తీసుకుంటున్నాయి. చాలా మంది వివిధ అవయవాలు పాడైపోయి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అయితే వారికి అవయవదానం పునర్జన్మనిస్తున్నది. ఎంత ఖర్చు చేసినా నిలవని ప్రాణం మరొకరి అవయవదానంతోనే నిలుస్తుంది. సామాన్యుడు సైతం మానవత్వంతో మరణం అంచుల్లో ఉన్న రోగికి మరో జీవితం ప్రసాదించవచ్చు.  దానం చేసినవారు సమాజంలో చిరస్మరణీయులవుతారు. అంతటి అద్భుత అవకాశం కేవలం అవయవ దానంతోనే సాధ్యపడుతుంది.

ఒక దానం.. ఎనిమిది మందికి ప్రాణం 

సాధారణ స్థితిలోగాని, ప్రమాదంలో బ్రెయిన్‌ డెడ్‌ సంభవించిన వ్యక్తి శరీరం నుంచి సేకరించిన అవయవాలతో ఎనిమిది మందికి ప్రాణం పోయవచ్చు. ప్రమాదంలో వ్యక్తి బ్రెయిన్‌ డెడ్‌ అయినా ఇతర శరీర అవయవాలకు రక్త ప్రసరణ జరుగుతూనే ఉంటుంది. కానీ, మెదడు నుంచి ఎలాంటి ఆదేశాలు అందకపోవడం వల్ల నాడీ వ్యవస్థ పనిచేయదు. దీంతో బాధితుడి శరీరం కొద్ది కొద్దిగా పనిచేయకుండాపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో అవయవదానం చేయడానికి చట్ట ప్రకారం రోగి తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి అంగీకారం తప్పనిసరి. సాధారణ మరణం లేదా బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తి నుంచి కాలేయం, రెండు ఊపిరితిత్తులు, రెండు మూత్రపిండాలు,  గుండె, ఫాంక్రియాస్‌, చిన్నపేగుతోపాటు చర్మం, కార్నియా, ఎముకల కణజాలం, గుండె కవాటాలు, రక్త నాళాలను తీసి, ఇతరులకు అమర్చవచ్చు. ఒక మనిషి శరీరంలోని అవయవాలు ఎనిమిది మందిని చావు నుంచి కాపాడుతాయి. దాత శరీరం నుంచి గుండె, ఊపిరితిత్తులను బయటకు తీస్తే దాని జీవిత కాలం సగటున నాలుగు గంటలు ఉంటుంది. అలాగే, మూత్రపిండాలు 30 గంటలు, లివర్‌, ఫాంక్రియాస్‌ 12 గంటల లోపు మరొకరికి అమర్చాల్సి ఉంటుంది. అయితే, అందరిలోనూ ఇదే నిర్ణీత సమయం ఉంటుందని చెప్పలేం. కాగా, ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేసిన రోగులకు వారి శరీరం కొత్త అవయవాన్ని తిరస్కరించకుండా ఉండేందుకు వైద్యులు రోగ నిరోధక మందులిస్తారు. 

దాతలు చిరస్మరణీయులవుతారు.. 

మనిషి శరీరంలోని అవయవాలకు ధనిక, పేద  తేడా ఉండదు.  ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు మనిషిని బలి తీసుకుంటున్న క్రమంలో మరణానంతరం శరీరంలోని అవయవాలను దానం చేసిన వారు సమాజంలో చిరస్మరణీయంగా మిగిలిపోతారు. మరణించిన మనిషి విలువైన అవయవాలను మట్టిలో కలిపే కంటే వాటిని సాటి మనిషికి దానం చేయడం వల్ల అతడు కొంతకాలం బతుకుతాడు. అవయవదానం చేసిన మనిషి భౌతికంగా లేకపోయినా మానసికంగా సమాజంలో బతికే ఉంటాడన్న నిజాన్ని గ్రహించాలి. ప్రతి ఒక్కరూ అవయవదానం చేయడం బాధ్యతగా స్వీకరించాలి.    

- కొండ్రెడ్డి మల్లారెడ్డి, తెలంగాణ నేత్ర, అవయవ, శరీరదాతల అసోసియేషన్‌ అధ్యక్షుడు


VIDEOS

logo