సాహిత్యపు సంబురంరచయితలకు అందలం

- ఉత్సాహంగా కథల పోటీల బహుమతుల ప్రదానోత్సవం
- ప్రత్యేక ఆకర్షణగా సినీనటుడు సంపూర్ణేశ్‌బాబు
- ఉర్రూతలూగించిన ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
- నమస్తే తెలంగాణ, ప్రజా గ్రంథాలయ కథల పోటీలు విజయవంతం
- పోటీకి వచ్చిన కథలు 800లకు పైనే
వరంగల్ సబర్బన్/ఎల్కతుర్తి, ఫిబ్రవరి 21 : వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు ప్రజా గ్రంథాలయంలో ఆదివారం సెలవు దినాన సాహిత్యపు పరిమళాలు వెదజల్లాయి. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో నమస్తే తెలంగాణ దినపత్రిక, ముల్కనూరు ప్రజా గ్రంథాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన 2020 సంవత్సరం జాతీయస్థాయి కథల పోటీల్లో విజేతలకు బహుమతుల కార్యక్రమం రచయితలు, గాయకుల కోలాహలం మధ్య వైభవంగా జరిగింది. ఉదయాన్నే పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన రచయితలతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రథమ బహుమతి సాధించిన ఆనందాచార్యులు తాను రాసిన గస్సాల్ కథకు ప్రేరణగా నిలిచిన కుటుంబం గురించి వివరించి అటు కథతోనే కాకుండా, ఇటు మాటలతో కూడా కన్నీళ్లు తెప్పించాడు. రెండో బహుమతి విజేత సలీం సమావేశానికి రాకపోయినా ఆ కథను చదివిన వారు అత్యంత ఆర్ధ్రంగా వివరించడంతో ఆహూతుల కళ్లు చెమర్చాయి. వచ్చిన వారిని ప్రత్యేకమైన రీతిలో ఆహ్వానిస్తూ రచయితల మాటలకు తనదైన శైలిలో స్థానిక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కొమ్మిడి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానం ఆకట్టుకుంది. వేదికపైన ఎమ్మెల్సీ, ప్రజాకవి గోరటి వెంకన్న తనదైన శైలిలో సభ ప్రాంగణాన్ని ఉర్రూతలూగించారు. ‘సంతా.. మా ఊరి సంతా’ పాటకు ఒక్కొక్క వ్యాఖ్యానికి తమ గ్రామంలో పలు వృత్తులు చేసుకునే వారు ఎలా ప్రేరణగా నిలిచారో వివరిస్తూ గేయాన్ని ఆలపించడంతో సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. సెల్లును బొంద పెడితేనే సమాజం సక్కగా నడుస్తదని ఆయన సూటిగా చెప్పారు. నల్లతుమ్మ చెట్టు మొదలుకొని తెల్లకొంగ వరకు కథలు రాసేందుకు అనేక మార్గాలు ఉంటాయని వివరించారు. పాశ్చాత్య పోకడలో మరుగున పడుతున్న సాహిత్యపు సౌరభాలను వెలికితీసేందుకు నమస్తే తెలంగాణ కృషిని సభికులందరు కొనియాడారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచిన పత్రిక ఇప్పుడు మనం మర్చిపోతున్న సాహిత్యపు విలువల్ని ఎత్తిచూపే బాధ్యతను భుజాన వేసుకుందని పలువురు కితాబునిచ్చారు. ఈ తరుణంలో పలువురు తమ గేయాలతో అలరించగా, శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు చేసిన మిమిక్రీ ఆకట్టుకుంది. నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి చెప్పిన కథను ఆసక్తిగా విన్నారు. “ఒక చోట కండలు తిరిగిన ఇద్దరు బలవంతులు కొట్టుకుంటున్నారు.. ఇంతలో అటు ఓ బక్క పలుచని వ్యక్తి వెళ్లాడు, కొట్టుకుంటున్న వారిని చూసి వాళ్ల మధ్యకు వెళ్తే నా బొక్కలు విరగడం ఖాయం అనుకున్న అతను వాళ్లను తప్పించుకొని దూరంగా వెళ్లబోయాడు. ఇంతలో తగువులాడుకుంటున్న బలవంతుల్లో ఒక్కడు ఈ బక్క పలుచని వ్యక్తిని పిలిచి ఏం అలా వెళ్తున్నావ్, ఇక్కడ ఇద్దరు మనుషులు గొడవ పడుతున్నారు, వీళ్ల పంచాయితీ ఏందో తెలుసుకొని సర్దిచెప్పే బాధ్యత నీకు లేదా అంటూ ప్రశ్నించాడు. అయితే బక్క పలుచని వ్యక్తి మీరు ఎందుకు గొడవ పడుతున్నారని ఆరా తీశాడు. ప్రతిగా గొడవకు దిగిన ఇద్దరు బలవంతుల్లో ఒక్కడు సమాధానం ఇస్తూ ఇప్పుడు ఇక్కడ పగలు ఉందని నేను, లేదు రాత్రి ఉందని అతను అంటున్నాడు. ఇందులో ఏది నిజమో నువ్వే చెప్పు అంటూ బక్క పలుచని వ్యక్తిని అడిగాడు. దీంతో బిత్తరపోయిన సదరు బక్క వ్యక్తి బుర్ర గోక్కొని నాది ఈ ఊరు కాదంటూ లౌక్యంగా ఓ ముచ్చట చెప్పేసి అక్కడ్నుంచి జారుకున్నాడు.” ఈ కథ సభికుల్లో కాసేపు సరదాను నింపింది. మొత్తానికి సభ ఆద్యంతం ఉద్వేగం, ఉత్సాహం, ఆనందభరితంగా సాగింది. ఔత్సాహిక రచయితలందరికి సరికొత్త ఊపునిచ్చిట్లయ్యింది.
పీవీ సంకల్పానికి జీవం పోసిన కేసీఆర్
- హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పూర్తిగా మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్‌ను సస్యశ్యామలం చేసేందుకు వరద కాల్వను తీసుకురావాలని సంకల్పించి అనేక ప్రయత్నాలు చేశారని, అయితే ఇప్పుడు గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంతో పీవీ సంకల్పానికి సీఎం కేసీఆర్ జీవం పోశారని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. సెల్‌ఫోన్ మాయమైపోయిన ఈ తరుణంలో ముల్కనూరు ప్రజా గ్రంథాలయం, నమస్తే తెలంగాణ పత్రికలు సాహిత్యాన్ని ప్రోత్సహించడం మంచి పరిణామమని కీర్తించారు. జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్‌కుమార్ మాట్లాడుతూ.. పీవీ నర్సింహారావు నమస్తే తెలంగాణ పత్రిక మంచి కథనాలతో అరుదైన గౌరవాన్ని ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా సాహిత్యాన్ని ప్రోత్సహించే విషయంలో నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజా గ్రంథాలయం కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ధరణి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ శశిధర్, అడిషనల్ ఎస్పీ గిరిధర్, పారిశ్రామికవేత్త చిదురాల శ్యాంసుందర్, ఎంపీపీ జక్కుల అనిత, సర్పంచ్ మాడ్గుల కొమురయ్య, ఎంపీటీసీలు బొల్లంపల్లి రమేశ్, అప్పని పద్మ, ఉప సర్పంచ్ సుద్దాల రఘు, మూల శ్రీనివాస్, వీఎం సుందర్, పల్లా ప్రమోద్‌రెడ్డి, గొల్లపల్లి లక్ష్మయ్య, ఎదులాపురం తిరుపతి, అయిత కిషన్‌ప్రసాద్, తాళ్ల వీరేశం, మూల రాము, దుబ్బాక నాగరాజు, బొజ్జపూరి మురళీకృష్ణ పాల్గొన్నారు.కాగా, రీచ్ ఇండియా ఫార్మా కంపెనీ అధినేత చిదురాల శ్యాంసుందర్ రూ.10లక్షలు విలువైన డీ విటమన్‌ను సిరప్‌ను ములుకనూరులోని 11వేల మంది కోసం అందించారు.
‘నమస్తే’తో కథలకు ప్రాచుర్యం
నమస్తే తెలంగాణ పత్రికలో మంచి కథలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రచురిస్తుండడం వల్లే తెలంగాణ కథలకు ప్రాచుర్యం దక్కుతోంది. ప్రజా గ్రంథాలయం ద్వారా రచయితల్లో దాగి ఉన్న రచనా కౌశల్యాన్ని బయటకు తీసే ప్రయత్నం చేయడం సంతోషం. కథలు జీవితానికి వెలుగునిస్తాయి. సాంఘికంగా, సంక్షేమంగా దళిత, బహుజన సంస్కృతులు కథలతో వెలుగులోకి వస్తాయి. ఇప్పుడు తెలుగు కథల్లో తెలంగాణ కథలే శాసిస్తున్నాయి.
- కాల్వ మల్లయ్య, ద్వితీయ బహుమతి విజేత (కరీంనగర్)
మన కథలు ప్రపంచానికి తెలుస్తాయి
ఈ కథల పోటీల వల్ల తెలంగాణ సాహిత్య సరళి ప్రపంచానికి తెలుస్తుంది. ఇలాంటి గ్రంథాలయం కనీసం మండలానికి ఒక్కటైనా ఉండాలి. తద్వారా గ్రామాల్లో ఉండే పేద విద్యార్థులకు అపారమైన విజ్ఞానం ఉచితంగానే అందుతుంది. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు క్రమం తప్పకుండా గ్రంథాలయాన్ని సందర్శించేలా చూడాలి.
- కేవీ నరేందర్, తృతీయ బహుమతి విజేత (కరీంనగర్)
మంచి ప్రయత్నం
ముల్కనూరు ప్రజా గ్రంథాలయం, నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో సాహిత్యాన్ని వెలికితీసే ప్రయత్నం చేస్తుండడం మంచి పరిణామం. ముఖ్యంగా మేము రాసిన కథలు నమస్తే తెలంగాణలో ప్రచురితం కావడం సంతోషంగా ఉంది. మాకు మళ్లీ మళ్లీ రాయాలనే ఉత్సాహం కలుగుతుంది. నాడు ఉద్యమానికి దన్నుగా ఉన్న పత్రిక.. ఇప్పుడు మరుగునపడుతున్న చరిత్రను వెలికితీయడం గొప్ప విషయం. మొత్తానికి రెండు సంస్థలు కలిసి సాహిత్యానికి పునర్జీవం పోస్తున్నాయి.
- కట్కోజుల ఆనందచారి, ప్రథమ బహుమతి విజేత (ఖమ్మం)
తాజావార్తలు
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..
- కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి
- కరోనా వారియర్లు నిజమైన దేవుళ్లు
- దివ్యాంగ క్రీడాకారుల కోసం..
- నేటి నుంచి 60 ఏండ్లు పైబడిన వారికి టీకా
- అబద్ధాల బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి..
- పోలింగ్‌కు ముమ్మరంగా ఏర్పాట్లు
- వాణీదేవిలోనే పీవీని చూస్తున్నాం..
- విద్వేషాలు రగిల్చేవారికి విద్యావంతులు బుద్ధి చెప్పండి
- లక్ష చెప్పాం..35వేలు ఎక్కువే ఇచ్చాం