న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ విస్తరణపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్న వేళ ఇదే అంశంపై ఈ సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీలోని ప్రధాని నివాసంలో కీలక మంత్రులు, భాజపా జాతీయాధ్యక్షుడితో జరగాల్సిన సమావేశం రద్దయ్యింది. ఈ భేటీ రద్దుకు గల కారణాలు తెలియరాలేదు. ప్రధాని మోదీ మంగళవారం సాయంత్రం తన నివాసంలో కీలక మంత్రులు, బీజేపీ అధ్యక్షుడితో భేటీ కానున్నారని, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రదాన్, ప్రహ్లాద్ జోషీ, పీయూష్ గోయల్, నరేంద్రసింగ్ తోమర్‌తోపాటు భాజపా జాతీయాధ్యక్షడు జేపీ నడ్డా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఈ భేటీలో పాల్గొంటారని సోమవారం వార్తలు వెలువడ్డాయి.
కేంద్ర క్యాబినెట్ విస్తరణపై ఇటీవల ఊహాగానాలు జోరందుకున్నాయి. గత ఆదివారం ప్రధాని మోదీ, అమిత్ షా, బీఎల్ సంతోష్ సుదీర్ఘంగా సమావేశమవటం కూడా అందుకు బలం చేకూర్చింది. విస్తరణ జాబితాకు తుది మెరుగులద్దడానికే వీరు సమావేశమయ్యారని ప్రచారం జరిగింది. అయితే, దీనిపై అధికారిక సమాచారం లేకున్నా ఈ నెల 7 లేదా 8 తేదీల్లో క్యాబినెట్ విస్తరణ ఉండొచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
2019లో మోదీ రెండో దఫా ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. నిబంధనల ప్రకారం.. కేంద్ర మంత్రివర్గంలో గరిష్ఠంగా 81 మంది మంత్రులు ఉండొచ్చు. అయితే ప్రస్తుతం కేబినెట్లో 53 మంది మాత్రమే ఉన్నారు. చాలా మంది మంత్రుల వద్ద ఒకటికంటే ఎక్కువ మంత్రిత్వ శాఖలు ఉండగా.. కొన్ని శాఖలకు సహాయమంత్రులు లేరు. దీంతో మంత్రివర్గ విస్తరణపై కేంద్రం దృష్టిపెట్టింది.
ఈ నేపథ్యంలో పలువురు నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా, అసోం మాజీ ముఖ్యమంత్రి శర్వానంద్ సోనోవాల్, బీహార్ బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ, ఇటీవల ఎల్జేపీలో తిరుగుబావుటా ఎగురవేసిన పశుపతి పరాస్ తదితరులకు క్యాబినెట్ బెర్త్ దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతున్నది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, గోవా, మణిపూర్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ఓటర్లను దృష్టిపెట్టుకుని క్యాబినెట్లో బెర్తులు ఖాయం చేసే అవకాశం ఉన్నది.
ఇవి కూడా చదవండి..
ఇంటర్నెట్ తెచ్చిన తంటా.. చెట్టుపై నుంచి ఉపాధ్యాయుడి బోధన..!
చేపల కోసం వల వేస్తే కొండచిలువ చిక్కింది..!
అత్యంత అరుదు: ప్రత్యేక విమానంలో భారత్‌కు కిడ్నీ పేషెంట్..!
మాదీ అమీర్‌ఖాన్, కిరణ్‌రావు బంధం లాంటిదే..!
పేక మేడలా కూలి నదిలో మునిగిన ఇల్లు.. వీడియో