నామినేషన్ల కోలాహలం

- వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి
- నాలుగో రోజు 10 మంది దాఖలు
- ఇప్పటివరకు వేసిన వారి సంఖ్య 22
- చివరి రెండ్రోజులు భారీగా పడే చాన్స్
- వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నాలుగో రోజు 10 మంది దాఖలు
వరంగల్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలో నామినేషన్ల కోలాహలం నెలకొంది. ఈ స్థానానికి భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య ఈ సారి గణనీయంగా ఉండే అవకాశం కనిపిస్తున్నది. ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న నల్లగొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ చాంబర్లోనే నామినేషన్ల స్వీకరణ కొనసాగుతున్నది. తొలిరోజు ఒక్క స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ మాత్రమే దాఖలైంది. రెండో రోజు బుధవారం ఒకటి కూడా రాలేదు. మూడోరోజు గురువారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 11 మంది నామినేషన్లు వేయగా ఇందులో ప్రధాన పార్టీల నుంచి స్వయంగా కొందరు అభ్యర్థులు నామినేషన్ వేయగా మరికొందరు ప్రతిపాదకులతో వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తరఫున ప్రతిపాదకులు ఒక నామినేషన్, కాంగ్రెస్, బీజేపీ, తెలంగాణ ఇంటిపార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీల వారు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన వారిలో ఉన్నారు. ఇక నాలుగో రోజు శుక్రవారం పది మంది నామినేషన్లు వేశారు. తెలంగాణ జన సమితి, జై స్వరాజ్ పార్టీ అభ్యర్థులు, మరో ఎనిమిది మంది స్వతంత్రులు దాఖలు చేశారు. దీంతో గత నాలుగు రోజుల్లో 22 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ వెల్లడించారు. ఇక ఆదివారం మినహాయిస్తే శని, సోమ, మంగళవారాల్లో మాత్రమే దాఖలుకు గడువుంది. సోమ, మంగళవారాల్లో భారీగా నామినేషన్లు దాఖలు కావచ్చని అంచనా వేస్తున్నారు. 22న బీజేపీ అభ్యర్థి మరో సెట్ నామినేషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 23న టీఆర్ఎస్ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అట్టహాసంగా నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గపరిధిలోని అన్ని జిల్లాల నుంచి పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యులు, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీతో పాటు సభ కూడా నిర్వహించే యోచనలో పార్టీ నేతలున్నారు. అదే రోజు సీపీఐ-సీపీఎం అభ్యర్థి కూడా నామినేషన్ వేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 23న మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగియనుంది. ఆ మర్నాడు పరిశీలన, 25,26 తేదీల్లో ఉపసంహరణ గడువు ఇచ్చారు. 26న మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అభ్యర్థుల తుదిజాబితా వెల్లడిస్తారు. మార్చి 14న పోలింగ్, 17న కౌంటింగ్ ఉంటుంది.
తాజావార్తలు
- బీట్రూట్ కబాబ్
- ఇక మహీంద్రా ఈవీతో అమెజాన్ ఉత్పత్తుల డెలివరీ
- డిజిటల్ పేమెంట్స్‌కు ఐసీఐసీఐ, యాక్సిస్‌లతో అమెజాన్ పొత్తు
- అల్లరి నరేష్‌కు దిల్ రాజు బంపర్ ఆఫర్
- ప్రేమోన్మాది ఘాతుకం..
- అధునాతన 5జీ సేవలకు గూగుల్క్లౌడ్తో జత కలిసిన ఇంటెల్
- బైక్‌ను ఢీకొట్టిన బొలెరో.. ఇద్దరు దుర్మరణం
- చిలీకి నౌకను నిర్మించిన భారత సంస్థ ఎల్ అండ్ టీ
- అనసూయను ఆశ్చర్యంలో ముంచేసిన అభిమాని
- రోహిత్ శర్మ అర్ధసెంచరీ