రోడ్ల వెంటే చెత్త మోర్ల నిండా మురుగు

- ‘ప్రగతి’బాట పట్టని సీతంపేట
- ఊరంతా చెత్తాచెదారం..
- వినియోగంలోకి రాని డంపింగ్ యార్డు
- డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం
- పూర్తి కాని వైకుంఠధామం
- అలనాపాలనా కరువైన పల్లె ప్రకృతి వనం
పల్లె ప్రగతి పనుల్లో చాలా గ్రామాలు పోటీపడుతున్నాయి. అభివృద్ధి కోసం మెజార్టీ ఊర్లలో ప్రజాప్రతినిధులు, అధికారులు కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు. కానీ, వరంగల్ నగర సరిహద్దుకు కూత వేటు దూరంలో ఉన్న హసన్పర్తి మండలం సీతంపేటలో పారిశుధ్య పనులను ఇక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులు గాలికి వదిలేశారు. ఊరిలోకి ప్రవేశించక ముందే ఇక్కడ చెత్తకుప్పలు స్వాగతం పలుకుతాయి. మురుగు నిండిన రోడ్లు ముక్కు మూసుకుని పోయేలా చేస్తాయి. రోడ్లన్నీ మురుగు పారుతూ కంపుకొడుతుంటాయి.
- హసన్పర్తి, ఫిబ్రవరి18
2,887 మంది జనాభా ఉన్న ఈ ఊరిలో మొత్తం 9 మంది పారిశుధ్య సిబ్బంది ఉన్నారు. వీరిలో ఆరుగురు శాశ్వత పద్ధతిన, ముగ్గురు కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నారు. వీరిని సమర్థవంతంగా వినియోగించుకోకపోవడంతో ఊరిలో అపరిశుభ్రత రాజ్యమేలుతున్నది. ఏ వాడలో చూసినా మురుగు కాల్వలు నిండి మురుగంతా రోడ్లపై పారుతున్నది. రహదారులపైనే కుంటలు కట్టి దుర్వాసన వస్తున్నది. దోమలు, ఈగలు వ్యాప్తిచెంది ప్రజల ఆరోగ్యానికే ప్రమాదకరంగా పరిణమించింది. ఏకంగా పంచాయతీ కార్యాలయం ముందే భారీగా చెత్తకుప్పలు పేరుకుపోయాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పల్లె ప్రగతిలో భాగంగా ఈ గ్రామానికి ప్రతినెలా రూ.4.55 లక్షలు వస్తున్నా పనులు మాత్రం నత్తకు నడక నేర్పుతున్నాయి.
ప్రకృతి వనం నిర్వహణ గాలికి..
గ్రామ సమీపంలోని ఉన్నతపాఠశాల పక్కన ఉన్న స్థలంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. తీరొక్క మొక్కలు ఏపుగా పెరిగినా నిర్వహణ మాత్రం గాలికొదిలేశారు. కలుపు మొక్కలు నిండిపోయి ఉన్నా తొలగించడంలో అలసత్వం వహిస్తున్నారు. గ్రామస్తులెవరైనా అందులో సేదతీరుదామంటే మొత్తం చిత్తడిగా మారిపోయింది. ఇక హరితహారంలో భాగంగా వీధుల్లో నాటిన మొక్కలకు కనీసం నీరు పట్టేవారే కరువయ్యారు. దీంతో చాలా మొక్కలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది.
అసంపూర్తిగా వైకుంఠధామం
ఇక పలు కులాలవారికి శ్మశానవాటిక లేక వారి కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే చెరువు కట్టే దిక్కయ్యేది. ఊర్లోకి వచ్చే ప్రధాన రహదారి పక్కనే దహన సంస్కారాలు నిర్వహిస్తుండడంతో వచ్చేపోయేవారికి ఇబ్బందికరంగా మారేది. ఈ క్రమంలో అంతిమ కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠధామం నిర్మాణం కోసం రూ.12లక్షలు కేటాయించింది. ఈ నిధులతో పనులు చేపట్టినా నత్తకే నడక నేర్పేలా సాగుతున్నాయి. గ్రామంలో రూ.2.5లక్షలతో డంపింగ్యార్డు నిర్మించినా వినియోగంలోకి తేకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతున్నది. ఊరిలోని నర్సరీలో ఇటీవలే 11వేల మొక్కలకు విత్తనాలు వేశారు.