స్వచ్ఛ పల్లెల్లో భాగస్వాములై

- ‘పల్లె ప్రగతి’ పనుల కోసం వాహనాలిచ్చిన దాతలు
- నల్లబెల్లి మండలానికి 8 ట్రాక్టర్లు, 5 ట్రాలీలు, 3 ఆటో ట్రాలీలు, 5 ట్యాంకర్ల అందజేత
- పచ్చదనం, పారిశుధ్య పనుల కోసం వినియోగిస్తున్న పంచాయతీలు
- అత్యధిక వాహనాలు దానం చేసిన మండలంగా రికార్డు
- ఎంపీవో చొరవతో గ్రామాల అభివృద్ధికి చేయూత
‘పల్లె ప్రగతి’కి మేము సైతం అంటూ పలువురు దాతలు ముందుకొస్తున్నారు. ఊరు బాగుపడాలనే సంకల్పంతో పచ్చదనం, పారిశుధ్య పనుల కోసం స్వచ్ఛందంగా భాగస్వాములవుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని 13 గ్రామ పంచాయతీలకు 8 ట్రాక్టర్లు, 5 ట్రాలీలు, 3 ఆటో ట్రాలీలు, 5 ట్యాంకర్లు.. కలిపి మొత్తం 21 వాహనాలను సమకూర్చారు. పల్లె ప్రగతిలో అక్కడక్కడా స్థలాలు, నగదు ఇస్తున్నా ఇంత పెద్దసంఖ్యలో వాహనాలు దానం చేసిన మండలంగా రికార్డుల్లోకెక్కడమే గాక ప్రభుత్వం నుంచీ ప్రశంసలందుకుంది.
పల్లె ‘ప్రగతి’ కోసం వాహనాలిచ్చిన దాతలు
వరంగల్ రూరల్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : పల్లె ప్రగతి కార్యక్రమం ప్రజల్లో చైతన్యం తెచ్చింది. తమ ఊరు బాగుండాలనే సంకల్పంతో స్వచ్ఛందంగా పల్లె ప్రగతి వైపు అడుగులు వేయిస్తోంది. కొన్ని గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ కోసం పంచాయతీలకు వాహనాలు అప్పగించారు. మరికొన్ని గ్రామాల్లో రైతువేదిక, వైకుంఠధామం, డంపింగ్‌యార్డు నిర్మాణానికి స్థలం సమకూర్చారు. పలుచోట్ల గ్రామాల్లో పచ్చదనం కోసం మొక్కల కొనుగోలుకు విరాళాలు అందజేశారు. వీటన్నింటిలోనూ నల్లబెల్లి మండలం ముందంజలో ఉంది. ముఖ్యంగా దాతలు గ్రామ పంచాయతీలకు వాహనాలు దానం చేయడంలో రికార్డు సృష్టించింది. ఇక్కడ 13 గ్రామ పంచాయతీల్లో దాతలు 21 వాహనాలను అప్పగించారు. వాటిలో ఎనిమిది ట్రాక్టర్లు, ఐదు ట్రాలీలు, ఐదు ట్యాంకర్లు, మూడు ట్రాలీ ఆటోలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిని ఆయా గ్రామ పంచాయతీల సిబ్బంది పల్లె ప్రగతి పనుల కోసం వినియోగిస్తున్నారు. పరిశుభ్రత, పచ్చదనం కోసం వినియోగిస్తున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం అమల్లోకి వచ్చిన తర్వాత దాతల నుంచి వాహనాలు దానంగా పొందిన మండలంగా నల్లబెల్లి ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకుంది. మరే మండలంలోనూ లేనివిధంగా దాతలు ముందుకురావడంలో ఇక్కడి మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాశ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఒకటిరెండు కాదు ఏకంగా 13 గ్రామ పంచాయతీల్లో దాతలు వాహనాలు దానం చేయడంతో ఉన్నతాధికారులు ఆయన్ను అభినందించారు.
ఆ పంచాయతీలు ఇవే
నల్లబెల్లి మండలంలోని కొండాపూర్, కొండాయిపల్లి, నందిగామ, ముచ్చింపుల, ముచ్చింపులతండా, కన్నారావుపేట, బచ్చిరెడ్డిపల్లి, నారక్కపేట, నాగరాజుపల్లి, రాంపూర్, గుండ్లపహాడ్, బజ్జుతండా, శనిగరం గ్రామ పంచాయతీలకు పల్లె ప్రగతి అమలుకు దాతలు ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు, ట్రాలీ ఆటోలు దానంగా ఇచ్చారు. కొండాయిపల్లిలో దాత మామిండ్ల మోహన్‌రెడ్డి ట్రాక్టర్, ట్రేలర్, నందిగామలో ఎన్ అంకూస్ ట్రాక్టర్, ట్రాలీ, బుచ్చిరెడ్డిపల్లిలో లునావత్ బోజ్య ట్రాక్టర్, ట్యాంకర్, నాగరాజుపల్లిలో గోనె శ్రీదేవి ట్రాక్టర్, గోనె మనీశ్, వంశీకృష్ణారెడ్డి, మామిండ్ల సుశీల లింగారెడ్డి, ట్కాంకర్, గుండ్లపహడ్లో కోడూరి రాజయ్య ట్రాక్టర్, శనిగరంలో డ్యాగల రాజేశ్ ట్రాక్టర్, నిర్మల చారిటబుట్ ట్రస్టు, కూచన ప్రకాశ్ ట్యాంకర్ ఇచ్చారు. నారక్కపేటలో వక్కల మల్లయ్య ట్యాంకర్, రాంపూర్‌లో మార్తినేని రవీందర్రావు, గౌరిశంకర్ ట్రాలీ ఆటో, బజ్జుతండాలో జాటోతు భద్రునాయక్, మంగ్త్యా ట్రాలీ ఆటో, ముచ్చింపులతండాలో గుగులోతు రమ్యానాయక్ ట్రాలీఆటో, ముచ్చింపులో ఊడుగుల ప్రవీణ్, బొట్ల ఎల్లస్వామి ట్రాక్టర్, ట్రాలీ, కొండాపూర్‌లో సీహెచ్ సూర్యనారాయణ, గూబ రాజు, బీ మన్మోహన్రెడ్డి ట్రేలర్, కన్నారావుపేటలో తంగెళ్ల రవీందర్‌రెడ్డి, ఈ కృష్ణారెడ్డి ట్రాక్టర్, తండ రాజు, వేముల లక్ష్మి, కాసం మదన్‌మోహన్‌రెడ్డి, పులిగుజ్జుల కరుణ, సనుప నాగలక్ష్మి, తురుస అశోక్ ట్యాంకర్‌ను తమ గ్రామ పంచాయతీకి దానంగా అందజేశారు.
చాలా సంతోషంగా ఉంది..
పల్లె ప్రగతి మంచి కార్యక్రమం. సీఎం కేసీఆర్ బాగా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా ఇందులో భాగస్వాములు అవుతున్నరు. ఎన్నో ఖర్చు పెడుతున్నం. నావంతుగా ఏదో ఒకటి చేయాలనుకున్న. ట్రాక్టర్ దానం చేస్తే మంచిదనిపించింది. ఇప్పుడదే ట్రాక్టర్ ఊళ్లోని చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తోంది. ట్యాంకర్‌తో చెట్లకు నీళ్లు పోస్తుంది. ఏ పనిచేసినా ఇంత గుర్తింపొచ్చేది కాదు. - తంగెళ్ల రవీందర్‌రెడ్డి, దాత, కన్నారావుపేట
స్ఫూర్తినిచ్చా..
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి స్వగ్రామం నల్లబెల్లి. ఆయన మండలంలోని ఊరూరా పర్యటించారు. గ్రామాల్లో పల్లెనిద్ర చేశారు. పల్లె ప్రగతిలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దాతలకు స్ఫూర్తినిచ్చేందుకు మొదట నేను ఒక ట్యాంకర్ దానంగా ఇచ్చాను. దాతలు కూడా మా వంతు పల్లె ప్రగతికి తోడ్పడతామని ముందుకొచ్చారు. 13 గ్రామాల్లో ట్రాక్టర్లు, ట్రాక్టర్ ట్రాలీ, ట్యాంకరు, ట్రాలీ ఆటోలు దానంగా ఇవ్వడం సంతోషం. వెహికిల్స్ సమకూరడంతో పంచాయతీ నిధులు ఇతర అభివృద్ధి పనులకు ఉపయోగపడుతాయని దాతలు భావించారు.
- కూచన ప్రకాశ్, ఎంపీవో, నల్లబెల్లి