సోమవారం 01 మార్చి 2021
Warangal-city - Feb 12, 2021 , 01:48:54

‘పట్టభద్రుల’ నగారా మోగింది

‘పట్టభద్రుల’ నగారా మోగింది

 • గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ 
 • పోలింగ్‌ మార్చి 14న 
 • మొదలైన ఎన్నికల నియమావళి
 • ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా 
 • రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలే అండ
 • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్‌ 
 • నోటిఫికేషన్‌ జారీ : ఫిబ్రవరి 16
 • నామినేషన్ల దాఖలు మొదలు : 16
 • చివరి తేదీ : 23
 • పరిశీలన : 24
 • ఉపసంహరణ గడువు : 26
 • పోలింగ్‌ : మార్చి 14 
 • (ఉదయం 8 నుంచి 
 • సాయంత్రం 4 గంటల వరకు)
 • ఓట్ల లెక్కింపు, ఫలితాలు : 17
 • కోడ్‌ ముగింపు : 21

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియకు నగారా మోగింది. మార్చి 14న పోలింగ్‌, 17న కౌంటింగ్‌ ఉండనుండగా ఆ రోజే ఫలితం వెలువడనుంది. ఈ మేరకు షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. ఆ వెంటే నియమావళి మొదలవగా, ఈ నెల 16న నోటిఫికేషన్‌ రానుంది. కాగా ఈ స్థానంలో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ అయిన పల్లా రాజేశ్వర్‌రెడ్డినే టీఆర్‌ఎస్‌ మళ్లీ ఖరారు చేయగా, ఇప్పటికే ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు పోతున్నారు.

వరంగల్‌, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ షురువైంది. మార్చి 14న పోలింగ్‌, 17న కౌంటింగ్‌ అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. దీనికి అనుగుణంగా అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రకటన జారీ చేశారు. వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్‌ ఈ నెల 16న విడుదల కానుంది. అదేరోజు నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలవుతుంది. ఫిబ్రవరి 23 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశముంటుంది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం 26న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా వెల్లడిస్తారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందు వరకు ప్రచారానికి అనుమతి ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ నల్లగొండ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఉంటుంది. నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. గ్రాడ్యుయేట్స్‌ ఎన్నిక జరిగే ఆయా జిల్లాల కలెక్టర్లు ఎన్నికల నియమావళి అమలు అధికారులుగా వ్యవహరిస్తారు. 

మూడు సార్లు టీఆర్‌ఎస్‌ ఘన విజయం..

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్స్‌ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానం. ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2015లో జరిగిన ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారు. ఈ సారి ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి బరిలో దిగారు. ఇప్పటికే ఆయన ప్రచారంలో ముందున్నారు. జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలో సమావేశాలు పూర్తి చేశారు. గ్రామాల వారీగా ఓటర్లను కలిసే ప్రక్రియను పార్టీ చేపడుతున్నది. ఎన్నికల్లో ఘన విజయం కోసం టీఆర్‌ఎస్‌ పక్కా వ్యూహంతో ముందుకు పోతున్నది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌, చీఫ్‌విప్‌ దాస్యం వినయభాస్కర్‌తోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచార వ్యూహంలో ఉమ్మడిగా ముందుకు సాగుతున్నారు. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రధాన అస్ర్తాలుగా చేసుకుని టీఆర్‌ఎస్‌ ప్రచారం సాగుతున్నది. ప్రభుత్వ రంగంలో లక్షన్నర ఉద్యోగాల భర్తీ, ప్రైవేటు రంగంలో యువతకు ఉపాధి కల్పనపై అందరికీ వివరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌తోపాటు ప్రధాన పార్టీలు సైతం అభ్యర్థులను ఖరారు చేశాయి. రాములునాయక్‌ (కాంగ్రెస్‌), గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి (బీజేపీ), విజయసారథిరెడ్డి (సీపీఐ)తోపాటు పలువురు స్వతంత్రులు పోటీలో ఉంటున్నట్లు ప్రకటించారు. 

VIDEOS

logo