బుధవారం 03 మార్చి 2021
Warangal-city - Feb 11, 2021 , 01:52:57

రేషన్‌ బియ్యం పక్కదారి

రేషన్‌ బియ్యం పక్కదారి

  • గంపగుత్తగా కొనుగోలు చేస్తున్న దళారులు
  • రాత్రి వేళల్లో లారీల్లో తరలింపు

ఎల్కతుర్తి, ఫిబ్రవరి 10 : నిరుపేదలకు ప్రభుత్వం నెలనెలా రేషన్‌ షాపుల ద్వారా సరఫరా చేస్తున్న రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నాయి. కొంతమంది బడా వ్యాపారులు దళారులను ఏర్పాటు చేసుకుని మరీ లబ్ధిదారుల నుంచి బియ్యాన్ని సేకరిస్తున్నారు. దళారులు గ్రామాల్లో ఇండ్లకు వెళ్లి సేకరించిన బియ్యాన్ని దొంగచాటుగా తీసుకొచ్చి రహస్య ప్రదేశంలో టన్నుల కొద్దీ నిల్వ చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఆ బియ్యాన్ని లారీలు, వ్యాన్లలో వారు ఎంచుకున్న రైస్‌మిల్లులు, కోళ్ల ఫారాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో వివిధ గ్రామాలు, చుట్టు పక్క మండలాల నుంచి సేకరించిన రేషన్‌ బియ్యాన్ని దండేపల్లి గ్రామంలోని ఒక ప్రదేశంలో నిల్వ చేసి రాత్రి తరలించేందుకు సిద్ధపడగా, సమాచారం అందుకున్న తహసీల్దార్‌ గుజ్జుల రవీందర్‌రెడ్డి వాటిని సీజ్‌ చేశారు. అయినా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా దందా గుట్టుచప్పుడు కాకుండా జోరుగా సాగుతూనే ఉన్నది.

నిరంతరం సాగుతున్న దందా..

ఎల్కతుర్తి మండలంలో 19 గ్రామాలకు 22 రేషన్‌ షాపులు ఉండగా, 12,591 కార్డులకు 36,531మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి నెలనెలా 2347 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. అయితే లబ్ధిదారులు ఈ బియ్యాన్ని క్రమం తప్పకుండా కొనుగోలు చేస్తూ ఇండ్లల్లోనే నిల్వ చేసుకుంటున్నారు. ఇదే అదనుగా భావించిన హుజూరాబాద్‌, ధర్మసాగర్‌, హుస్నాబాద్‌ తదితర మండలాలకు చెందిన దళారులు లబ్ధిదారుల ఇండ్లకు వెళ్తూ దొంగచాటున బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. కిలోకు రూ. 5 నుంచి 7 వరకు కొంటూ ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో వారు ఎంపిక చేసుకున్న ప్రదేశానికి తరలిస్తున్నారు. అక్కడ ఇంకా ఎక్కువ ధరకు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. మరికొంత మంది దళారులు నేరుగా రైస్‌మిల్లులు, కోళ్ల ఫారాలకు తరలిస్తున్నారు. మండల వ్యాప్తంగా ఈ వ్యాపారం నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్నది. దీంతో ప్రభుత్వ సొమ్ము దళారుల పాలవుతున్నది. ఇప్పటికైనా అధికారులు నిఘా పెంచి ఈ వ్యాపారానికి అడ్డుకట్ట వేసి ప్రభుత్వ సొమ్ము దళారుల పాలు కాకుండా కాపాడాలని పలువురు కోరుతున్నారు.

VIDEOS

logo