కొత్తకొండ.. ప్రగతి జెండా

- నాడు చెత్తాచెదారంతో అధ్వానంగా వీధులు
- జాతర ముగిశాక కంపుకొట్టే పరిసరాలు
- నేడు పక్కా ప్రణాళికతో అభివృద్ధి పరుగులు
- దాతల సహాయ సహకారాలతో ఆదర్శంగా గ్రామం
- పాలకవర్గం, అధికారయంత్రాంగం సమష్టి కృషికి ఫలితం
నాడు చెత్తాచెదారంతో అధ్వానంగా ఉండే వీధులు.. ఇప్పుడు సీసీతో కళకళలాడుతున్నాయి. ప్రధాన రోడ్లపై మురుగునీటితో కంపు కొట్టే పరిస్థితులు పోయి.. అన్ని ప్రాంతాలకు ఎల్ఈడీ విద్యుత్కాంతులు వచ్చాయి. అంతిమ సంస్కారం కోసం చెరువు గట్లు, వాగు ఒడ్డుకు వెళ్లే దుస్థితిని తప్పించేందుకు వైకుంఠధామం, ఆహ్లాదం కోసం ఎక్కడా లేని విధంగా రెండు ప్రకృతి వనాలు, హరితహారం మొక్కలు, చెత్త వేసేందుకు డంపింగ్ యార్డు, చెరువు వద్ద బతుకమ్మ విగ్రహం, ఇలా.. పల్లె ప్రగతితో వరంగల్ అర్బన్ జిల్లా కొత్తకొండ గ్రామ రూపురేఖలు మారిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ప్రోత్సాహం.. దాతల సహకారానికి పాలక, అధికారయంత్రాంగం సమష్టి కృషి తోడవడంతో ఆ పల్లెలో అభివృద్ధి వెలుగులు కనిపిస్తున్నాయి.
భీమదేవరపల్లి : పల్లెప్రగతి కార్యక్రమంతో కొత్తకొండ దశ, దిశ మారిపోయింది. దాతల పరస్పర సహకారం, పాలకవర్గం సమష్టి కృషితో ఆ ఊరు అద్దంలా మెరుస్తోంది. పల్లె ప్రగతిలో భాగంగా కొత్తకొండలో అందుబాటులోకి వచ్చిన రెండు పల్లెప్రకృతి వనాలు పల్లెవాసులకు ఆహ్లాదం పంచుతున్నాయి. ఒకటి రూ.82,339తో బర్రె గుడి ప్రాంగణంలో, మరొకటి రూ.88,487తో నర్సరీ, డంపింగ్ యార్డు పక్కన నిర్మించారు. ఇక్కడ ప్రభుత్వ స్థలం లేకపోవడంతో అనంత సుధాకర్‌రెడ్డి ఎకరం భూమిని జీపీకి దానం చేయగా, 20గుంటల్లో ప్రకృతి వనం, మిగతా 20గుంటల్లో నర్సరీ రూపుదిద్దుకున్నాయి. అంతేగాక గ్రామ పంచాయతీకి అనుబంధంగా ఉన్న రంగారెడ్డి తండాలో మరో ప్రకృతివనం రానుంది. అలాగే రూ.63వేలతో డంపింగ్ యార్డు, రూ.2లక్షల 41వేలతో సెగ్రిగేషన్ షెడ్డు నిర్మించారు. నర్సరీ ఏర్పాటుచేసి పది వేల మొక్కలు పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
అందరి సహకారంతోనే..
గ్రామస్తులు, దాతల పరస్పర సహకారంతోనే మా ఊరు ఆదర్శంగా నిలిచింది. గ్రామస్తుల సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులను చేపడుతాం. ఆదర్శమంటేనే కొత్తకొండ అనేలా తీర్చిదిద్దుతాం.
- దూడల ప్రమీల, సర్పంచ్
సమష్టి కృషితో సాధ్యమైంది..
గ్రామాన్ని ఆదర్శంగా మార్చడం వెనుక పాలకవర్గం కఠోర శ్రమ దాగి ఉంది. నిత్యం గ్రామ పంచాయతీ పాలకవర్గంలో అభివృద్ధి తీరుతెన్నులపై చర్చిస్తాం. వాటినే ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తాం.
- యాటపోలు రాజమణి, ఎంపీటీసీ
గ్రామస్తుల సహకారం వల్లే..
గ్రామ పంచాయతీ పాలకవర్గం నిజాయితీ, గ్రామస్తుల ప్రోత్సాహం, దాతల సహాయసహకారాల వల్లే కొత్తకొండ గ్రామం పల్లెప్రగతిలో ఆదర్శంగా నిలిచింది. రిపబ్లిక్ డే రోజున జిల్లాస్థాయిలో ఉత్తమ ఉద్యోగిగా కలెక్టర్ నాకు ప్రశంసాపత్రం ఇచ్చారు. ఇదంతా గ్రామస్తుల సమష్టి కృషి వల్లే.
- ధర్మేందర్, పంచాయతీ కార్యదర్శి
చివరి మజిలీ చింత లేకుండా..
మొన్నటివరకు చెరువు గట్లు, వాగు ఒడ్డున దహన సంస్కారాలతో పడే ఇబ్బందులు తీరిపోయాయి. పల్లె ప్రగతితో ఊరి చివర రూ.12 లక్షలతో వైకుంఠథామం ఏర్పాటుచేశారు. గ్రామంలో మురికికాలువలు లేని చోట సుమారు 390వరకు ఇంకుడు గుంతలు నిర్మించగా, 298 ఎల్ఈడీ లైట్లు అమర్చారు.
ముందుకొచ్చిన దాతలు..
- గ్రామాభివృద్ధి కోసం ఎంతోమంది దాతలు ముందుకొచ్చారు.
- గ్రామ కో ఆప్షన్ మెంబర్ అనంతుల సత్యనారాయణ రూ.4లక్షల 30వేలతో స్వర్గరథం, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల కోసం రూ.లక్ష విరాళం ఇచ్చారు.
- ఎర్రబెల్లి నరసింహారెడ్డి దంపతులు రూ.70వేలతో శవపేటిక అందజేశారు.
- బతుకమ్మ విగ్రహం కోసం పత్తిపాక రాజేశం రూ.51వేలు సమకూర్చారు.
- ప్రభుత్వ పాఠశాలలో పలువురు ఓపెన్ జిమ్ ఏర్పాటుచేశారు.
- గ్రామదేవతలను ప్రతిష్ఠించేందుకు రూ.15లక్షలు ఖర్చు వస్తుందని పాలకవర్గం అంచనా వేయగా త్వరలోనే దాతల సహాయంతో ప్రతిష్ట కార్యక్రమం చేపడుతామని పాలకవర్గం పేర్కొంది.
- ప్రతి నెల రూ.3లక్షల 35వేలు గ్రామ పంచాయతీకి వస్తాయి. ఇందులో ఒక నెల రాష్ట్ర ఫైనాన్స్ ఇస్తే, మరో నెల కేంద్రం నుంచి వస్తాయి. అలాగే పన్నుల రూపంలో పంచాయతీకి రూ.4లక్షల 20వేలు ఏటా జమవుతాయి.
తాజావార్తలు
- బీజేపీ పాలనలో మిగిలింది కోతలు.. వాతలే
- విధాన రూపకల్పన ప్రభుత్వానికే పరిమితం కావద్దు: ప్రధాని
- ఈసారి ధోనీ చెత్త రికార్డు సమం చేసిన కోహ్లి
- టైమ్ మ్యాగ్జిన్ కవర్ పేజీపై మహిళా రైతులు
- ఒకే రోజు 13 లక్షల మందికి వ్యాక్సిన్
- ప్రియా ప్రకాశ్ మరో తెలుగు సినిమా .. ఫస్ట్ లుక్ విడుదల
- భార్యతో కలిసి మొక్కలు నాటిన ఎంపీ సీఎం శివరాజ్
- రైల్వే బాదుడు.. ఇక ప్లాట్‌ఫామ్ టికెట్ రూ.30
- సుశాంత్ కేసు.. వెయ్యి పేజీలపైనే ఎన్సీబీ చార్జ్‌షీట్
- రక్షణ బడ్జెట్‌ను పెంచిన చైనా