ఆన్లైన్లో ప్లాంట్స్ నగరంలో కొత్త తరహా వ్యాపారం

ఆన్లైన్.. మనిషి తనకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఎంచుకునే సాదనం. గృహ అవసరాల సామగ్రి మొదలు వేసుకునే దుస్తుల వరకూ అన్నింటినీ ఆన్లైన్ ద్వారా తెప్పించుకుంటున్నారు. ఇప్పుడు ఇందులో మొక్కలు సైతం చేరాయి. ఏ రకమైన మొక్కలు కావాలన్నా వినియోగదారులు ఆన్లైన్లో బుక్ చేస్తున్నారు. అంతేకాకుండా మట్టి, కుండీలను కూడా ఆర్డర్ చేస్తున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ గ్రూపుల్లో కావాల్సిన మొక్కలను ఫొటో తీసి పెడుతూ నగరంలోనూ ఈ వ్యాపారం సాగిస్తున్నారు. ప్రజలు సైతం ఆసక్తికనబరుస్తున్నారు.
మొక్కలు పెంచడం ఓ ట్రెండ్
ప్రస్తుతం ప్రతిఒక్కరూ మొక్కలను పెంచడం ట్రెండ్‌గా మారింది. సాధారణంగా మనం సైంటిఫిక్ మొక్కలను బాటనీ ల్యాబ్‌ల్లో చూస్తుంటాం. ఇప్పటి కాలంలో ఎంత ఖరీదైన మొక్కలైనా సరే తెప్పించుకుని మరీ పెంచుకుంటున్నారు. కొందరైతే వారి ఇళ్లలో డెకరేషన్ బొమ్మల కన్నా నీటిలో పెరిగే మొక్కలతో డెకరేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు చెట్ల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. వివిధ రకాల పూల మొక్కలను ప్రత్యేకంగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేస్తున్నారు. ఇండోర్ ప్లాంట్స్‌లో బనాన, బాంబో ప్లాంట్స్, ఫిలియోడెండ్రోన్, పిపరోమియా హాంగింగ్ వంటి వివిధ రకాల మొక్కలు వివిధ రాష్ర్టా ల నుంచి ఆన్లైన్ ఆర్డర్‌పై తెప్పిస్తున్నారు. గిఫ్ట్ ఐటమ్స్‌గా బహూకరిస్తుండడం విశేషం. మరికొందరు దిగుమతులు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు.
అందుబాటులో ఇండోర్, ఔట్‌డోర్ మొక్కలు..
ఇండోర్, ఔట్‌డోర్ మొక్కలను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తూ ఇంట్లో పెంచుతున్నారు. కేరళ నుంచి వివిధ రకాల మొక్కలను తెప్పిస్తుండగా బెంగళూరు, పుణే నుంచి మొక్కలకు మట్టి, ఫైబర్ కుండీలను ఆన్లైన్లోనే కొనుగోలు చేస్తున్నారు. మట్టి కిలో చొప్పున ప్యాకింగ్ ద్వారా నేరుగా ఇంటికే వస్తుంది.
ఆసక్తి చూపుతున్న ప్రజలు
పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు చెట్లను పెంచడంలో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇంటి ఎదుట మొదలుకుని ఆవరణ, కుండీలు, బాల్కనీల్లో కూడా మొక్కలు పెంచుతున్నారు. అంతేకాకుండా వాటి కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయిస్తున్నారు.
ఆన్లైన్ అమ్మకాలు..
కేరళ నుంచి వివిధ రకాల మొక్కలను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నా. వాటికి సంబంధించిన మట్టి కిలో లెక్కన ఆర్డర్‌పై ఇక్కడికి తెప్పిస్తున్నా. కేరళ నుంచి వివిధ రకాల మొక్కలను, బెంగళూరు, పుణే నుంచి మట్టి, ఫైబర్ కుండీలు తెప్పిస్తున్నా. ఇంట్లో ఇండోర్ మొక్కలతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఆన్లైన్ ద్వారా మొక్కలు అమ్ముతున్నా. మొక్కల ప్రేమికుల నుంచి విశేష స్పందన వస్తోంది.- దీకొండ రంజిత్‌కుమార్, మదర్కాంప్లెక్స్, కుమార్‌పల్లి