గురువారం 25 ఫిబ్రవరి 2021
Warangal-city - Feb 06, 2021 , 01:24:35

విధులకు పదును

విధులకు పదును

  • పోలీసులకు పునశ్చరణ తరగతులు 
  • కమిషనరేట్‌ ఏఆర్‌ విభాగం ఆధ్వర్యంలో ప్రారంభం
  • వ్యవస్థ పటిష్టం.. విధులపై అవగాహన కోసం నిర్వహణ

పోలీసుల విధులకు మరింత పదును పెట్టేందుకు ఆ శాఖ శుక్రవారం నుంచి పునశ్చరణ తరగతులను ప్రారంభించింది. వారిలో ఆత్మస్థయిర్యం, నూతనోత్సాహాన్ని పెంపొందించేందుకు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఏఆర్‌ విభాగం ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమం మొదలైంది. పీసీ పరిధిలోని 48 ఠాణాల సిబ్బందికి ఈ తరగతులు కొనసాగనున్నాయి.   

హన్మకొండ సిటీ, ఫిబ్రవరి 5 : పోలీసుల్లో ఆత్మస్థయిర్యం, నూతనోత్సాహాన్ని నింపేందుకు, విధులపై అవగాహన కల్పించేందుకు ఆ శాఖ పునశ్చరణ తరగతులను ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం ‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌'ను అమల్లోకి తెచ్చిన తర్వాత ప్రజలు ధైర్యంగా ఠాణా మెట్లు ఎక్కుతున్నారు. ఈ క్రమంలో కొందరు ‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌'ను ఆసరా చేసుకుని శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారు. ఏకంగా పోలీసులపైనే దాడులు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పోలీసు సిబ్బంది సహనం పాటిస్తూ అసాంఘిక శక్తుల మెడలు ఎలా వంచాలనే అంశాలపై అవగాహన కల్పించేందుకు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఏఆర్‌ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక తరగతులను శుక్రవారం ప్రారంభించింది. వ్యవస్థను మరింత పటిష్టం చేయడంలో భాగంగా డీజీపీ ఆదేశానుసారం కమిషనరేట్‌ పరిధిలోని అధికారులు, సిబ్బందికి విధి నిర్వహణపై అవగాహన కల్పిస్తున్నది. 

దాడుల నేపథ్యంలో..

ఇటీవల వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో పోలీస్‌ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ఆ శాఖ నిర్ణయం తీసుకున్నది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ నాయకులు పోలీసుల సమక్షంలోనే రాళ్లు విసిరారు. పరకాల సీఐ మహేందర్‌రెడ్డిని బంధించి విధులకు ఆటంకం కలిగించారు. జనగామలోనూ ప్రభుత్వ కార్యాలయంలోకి బీజేపీ నాయకులు చొచ్చుకుపోయి  హంగామా చేస్తుండగా నిలువరించే క్రమంలో సీఐ లాఠీ ఝలిపించినందుకు ఆ పార్టీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీస్‌ శాఖకు విమర్శలు తప్పలేదు. ఈ నేపథ్యంలో విధుల్లో ఉన్నప్పుడు ఏ విధంగా సంయమనం పాటించాలి, చట్ట వ్యతిరేకులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే  అంశాలపై పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఏఆర్‌ అడిషనల్‌ డీసీపీ ఆధ్వర్యంలో కమిషనరేట్‌లోని 48 పోలీస్‌ స్టేషన్ల సిబ్బందికి ఈ తరగతులు పెట్టారు. ప్రతి స్టేషన్‌ నుంచి రోజూ ఇద్దరు చొప్పున తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది. లాఠీ డ్రిల్‌, మాబ్‌ నియంత్రణ, మహిళలు, పిల్లల సమస్యలపై వేగవంతమైన స్పందన, అసాంఘిక శక్తుల అణిచివేత తదితర అంశాలపై తరగతులు ఉంటాయి.  

ప్రతి శుక్రవారం పరేడ్‌

ప్రతి శుక్రవారం తప్పనిసరిగా పరేడ్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఈ విధానం ఉనా కేవలం ఏఆర్‌ సిబ్బందే పాల్గొనేది. ప్రస్తుతం ప్రతి శుక్రవారం విధుల్లో ఉన్న సిబ్బంది కమిషనరేట్‌ పరేడ్‌ గ్రౌండ్‌కు వచ్చి పరేడ్‌ చేయాలి. ఇందులో వెపన్‌ హ్యాండిలింగ్‌, లాఠీ డ్రిల్‌పై ప్రత్యేక తరగతులు ఉంటాయి. ఏ విభాగంలో పని చేస్తున్న సిబ్బందికి ఆ విభాగపు పద్ధతులపై అవగహన కల్పిస్తారు. శుక్రవారం ఏర్పాటు చేసిన పరేడ్‌కు ఎల్కతుర్తి సర్కిల్‌ తప్ప సెంట్రల్‌ జోన్‌లోని అన్ని స్టేషన్ల సిబ్బంది హాజరయ్యారు. ట్రాఫిక్‌,  రోడ్డు భద్రత, సిగ్నల్స్‌ పని విధానంపై అవగహన కల్పించారు. రూరల్‌ ఏరియా సర్కిల్‌ కార్యాలయల్లో పరేడ్‌ నిర్వహించారు. 


VIDEOS

logo