శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Warangal-city - Feb 06, 2021 , 01:24:37

సమస్యల వాడ

సమస్యల వాడ

  • అధ్వానంగా ఇండస్ట్రియల్‌ పార్కు రహదారులు
  • కనిపించని హరితహారం మొక్కలు
  • దయనీయంగా కార్మికుల బతుకులు
  • పట్టించుకోని అధికారులు

అది ఎంతో మందికి ఉపాధి చూపుతున్న ప్రాంతం.. ఎన్నో పరిశ్రమలు,  ఉత్పత్తులు, కార్మికులతో ఆ ఏరియా నిత్యం సందడిగా ఉంటుంది. కానీ, ఆ ప్రాంతాన్ని సమస్యలు నీడలా వెంటాడుతున్నాయి. ఎటు చూసినా దుమ్ము, ధూళి, చెత్తాచెదారం కనబడుతోంది. అదే  రాంపూర్‌, మడికొండ ఇండస్ట్రియల్‌ పార్కు ఏరియా. ఈ పారిశ్రామిక వాడలో సరైన రోడ్లు, ఇతర సౌకర్యాలు లేక స్థానికులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

- మడికొండ 

వరంగల్‌ అర్బన్‌ జిల్లా రాంపూర్‌, మడికొండలోని ఇండస్ట్రియల్‌ పార్కులో అనేక పరిశ్రమలు ఉన్నాయి. వాటిలో అనేక రకాల వస్తువులు తయారవుతున్నాయి. ఇక్కడ వందలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. స్థానికులే కాకుండా ఉత్తరప్రదేశ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర ఇలా అనేక ప్రాంతాల నుంచి వందలాది మంది కార్మికులు ఇక్కడికి వలస వచ్చి పరిశ్రమల్లో పని చేస్తున్నారు. అయితే ఈ ఇండస్ట్రియల్‌ పార్కులో సౌకర్యాలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. పారిశ్రామిక వాడ ప్రధాన రోడ్డుతో పాటు మిగతా పరిశ్రమలకు వెళ్లే రోడ్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. గుంతలు పడి అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. వాహనాలు వచ్చి పోయే క్రమంలో విపరీతంగా దుమ్ము లేస్తోంది. ఆ దుమ్ములో ఏమీ కనిపించక కార్మికులకు ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ అసలే లేదు. అక్కడక్కడ ఉన్నా అది చెత్తా చెదారం, ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండిపోయింది. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు పరిసరాల్లోనే చేరడంతో భరించలేని దుర్వాసన వస్తోంది. పారాబాయిల్డ్‌ రైస్‌ మిల్లుల నుంచి వచ్చే పొగతో ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. విషయాన్ని పలుమార్లు ఐటీ సెజ్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండడం లేదని ఐటీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

దయనీయ స్థితిలో కార్మికులు

ఇక్కడి పరిశ్రమల్లో వందలాది మంది కార్మికులు పని చేస్తున్నారు. అయితే, వారికి మాత్రం కనీస సౌకర్యాలు లేవు. చిన్న చిన్న గుడిసెల్లో, ఇరుకు గదుల్లో కాలం వెల్లదీస్తున్నారు. పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ఇక్కడి గాలి, నీరు మొత్తం కూడా కాలుష్యమయం కావడంతో కార్మికులు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. అంతేకాకుండా వైద్యాధికారులు కూడా ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. పారిశ్రామిక అధికారులు కూడా కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపణలు వస్తున్నాయి. 

ఇబ్బందుల్లో సమీప గ్రామాలు

పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థాలతో సమీప గ్రామాలైన మడికొండ, రాంపూర్‌ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా గ్రామాల్లో గాలి, నీరు కలుషితమవుతోందని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల యాజమాన్యాలు వ్యర్థాలను ఇష్టారీతిన వదిలేస్తున్నాయి. ఇక్కడే ఐటీ సంస్థలు, విద్యా సంస్థలు కూడా ఉండడంతో పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం, పొగతో ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అలాగే, ఇండస్ట్రియల్‌ ప్రధాన రహదారి ద్వారానే డంపింగ్‌యార్డు వాహనాలు ఇష్టారాజ్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో రోడ్లపై వ్యర్థాలు పడి దుర్వాసన వెదజల్లుతోంది. అలాగే, ధర్మసాగర్‌ నుంచి వర్ధన్నపేటకు వెళ్లే దేవాదుల కాల్వ కూడా పరిశ్రమల మధ్య నుంచి వెళ్తుండడంతో ఆ నీరు సైతం కలుషితమవుతోందనే ఆరోపణలు ఉన్నాయి.

కరువైన పచ్చదనం

రాంపూర్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాలో పచ్చదనం కరువైంది. హరితహారం మొక్కలు మచ్చుకైనా కనిపించడం లేదు. హరితహారంలో భాగంగా అధికారులు తూతూ మంత్రంగా మొక్కలు నాటి, వాటిని గాలికి వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్కడక్కడా కొన్ని చెట్లు ఉన్నా అవి మొత్తం దమ్ము, ధూళితో నిండిపోయి కనిపిస్తున్నాయి. ఖాళీ స్థలాలు కన్పిస్తే చాలు గ్రానైట్‌ పరిశ్రమల నిర్వాహకులు వ్యర్థాలను పడేస్తున్నారు.  

VIDEOS

logo