ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Warangal-city - Feb 05, 2021 , 00:27:49

పండుగులా వ్యవసాయం

 పండుగులా వ్యవసాయం

  • రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల్లేవు
  • అన్నదాతల కండ్లల్లో కేంద్రం మట్టికొట్టే ప్రయత్నం చేయొద్దు
  • మంత్రి ఈటల రాజేందర్‌
  • కమలాపూర్‌లో రైతువేదిక ప్రారంభం
  • తెలంగాణలో రైతు ఆత్మహత్యల్లేవు
  • వారి కండ్లల్లో కేంద్రం మట్టికొట్టే ప్రయత్నం చేయొద్దు
  • రైతువేదిక ప్రారంభోత్సవంలో మంత్రి ఈటల రాజేందర్‌

కమలాపూర్‌, ఫిబ్రవరి 4 : వ్యవసాయాన్ని పండుగ చేసింది సీఎం కేసీఆరేనని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. గురువారం కమలాపూర్‌లో రైతు వేదిక భవనాన్ని ప్రారంభించి అన్నదాతలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు కాకముందు పల్లే పల్లెన పల్లేర్లు మొలిచే తెలంగాణలోన.. అనే పాటను గోరటి వెంకన్న కండ్లకు కట్టినట్లు రాసిండని కొనియాడారు. పాటను విన్న కేసీఆర్‌ చలించిపోయాడన్నారు. రైతుల కష్టాలు తొలగించాలనే ఆలోచనలకు ప్రతిరూపమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమన్నారు. కాళేశ్వరం నీళ్లు మొదట ముద్దాడింది హుజూరాబాద్‌ నియోజకవర్గ రైతులనే అన్నారు. గతంలో మానేరు డ్యాంలో నాలుగు టీఎంసీల నీళ్లు ఉన్నప్పుడు కూడా పంటలకు నీటిని విడుదల చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు.  

పంటలకు మద్దతు ధర..

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవని, 24 గంటల కరంటు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు ప్రవేశపెట్టి ప్రభుత్వం వారికి అండగా నిలిచిందన్నారు. కరోనా కాలంలో పంటకు మద్దతు ధర కల్పించి కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. దేశంలోని 70 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, అలాంటి దేశంలో రైతులు సమ్మె చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో పాలకులు ఆలోచించాలన్నారు. చట్టాలు చేసి రైతుల కండ్లల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేయొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. రైతుకు కులం, మతం లేదని, ఎక్కడైనా రైతు రైతేనని, అన్యాయం చేస్తే ఊరుకునేది లేదన్నారు. పంటకు మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. స్వామినాథన్‌ కమిటీ సిఫారసులను పరిగణలోకి తీసుకుని చట్టాలను చేయాలని కేంద్రానికి సూచించారు. కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు మాట్లాడుతూ.. రైతు వేదిక భవనాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మెరుగైన పంటలను పండించి ఆర్థికంగా ఎదగాలన్నారు. జడ్పీ చైర్మన్‌ సుధీర్‌కుమార్‌ మాట్లాడుతూ.. రైతుల కోసం రైతు వేదికలు ప్రపంచంలోనే ఏ దేశంలో నిర్మించలేదన్నారు. అనంతరం మంత్రి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.  కమలాపూర్‌లోని 30 పడకల దవాఖానను సందర్శించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్‌ లలితాయాదవ్‌, డీఆర్డీవో శ్రీనివాస్‌కుమార్‌, ఏడీఏ దామోదర్‌రెడ్డి, ఎంపీపీ రాణి, జడ్పీటీసీ కల్యాణి, సింగిల్‌ విండో చైర్మన్‌ సంపత్‌రావు, ఈటల భద్రయ్య, రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ శైలజ, సర్పంచ్‌ విజయ, ఏఎంసీ చైర్మన్‌ బాలకిషన్‌రావు, తహసీల్దార్‌ జ్యోతివరలక్ష్మీదేవి, ఎంపీడీవో విజయ్‌కుమార్‌, ఎంపీవో రవిబాబు, ఏవో లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

గ్రామాభివృద్ధికి సీడ్‌ కంపెనీ డైరెక్టర్‌ విరాళం.. 

కమలాపూర్‌ : మండలంలోని కన్నూరు గ్రామాభివృద్ధికి అడ్వాంట సీడ్‌ కంపెనీ డైరెక్టర్‌ చెరుకు రమేశ్‌ విరాళాలు అందజేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు విరాళంగా అందజేసిన రూ. 5 లక్షల విలువైన కంప్యూటర్లను మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి ప్రారంభించారు. గ్రామంలో బస్‌షెల్టర్‌ నిర్మాణానికి రూ. 10లక్షలు, పాఠ్య పుస్తకాలు, మొబైల్‌ టాయిలెట్స్‌ కోసం రూ. 2లక్షలు అందజేశారు. కాగా, సీడ్‌ కంపెనీ డైరెక్టర్‌ రమేశ్‌ను మంత్రి అభినందించారు. సర్పంచ్‌ పుల్లూరి రాంచందర్‌రావు, సింగిల్‌ విండో చైర్మన్‌ సంపత్‌రావు, ఎంపీటీసీ వీరమనేని భాస్కర్‌రావు, ఎంఈవో రాంకిషన్‌రాజు, సీడ్‌ కంపెనీ అధికారులు నగేశ్‌హుడా, మధుసూదన్‌రెడ్డి, రవికుమార్‌, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.   


VIDEOS

logo