టార్గెట్ .. మార్చి

- స్మార్ట్ సిటీ పనుల పూర్తికి మూడు నెలల ప్రణాళిక
- వడివడిగా కదులుతున్న బల్దియా అధికారులు
- త్వరలోనే మారనున్న నగర రూపురేఖలు
రూ.వందల కోట్లతో గ్రేటర్లో చేపట్టిన ‘స్మార్ట్ సిటీ’ పనులు మార్చిలోగా పూర్తి చేయాలని బల్దియా యంత్రాంగం టార్గెట్ పెట్టుకున్నది. ఈ మేరకు మూడు నెలల కార్యాచరణ రూపొందించింది. ఏ నెలలో ఏ పనులు కంప్లీట్ చేయాలో పక్కా ప్రణాళికలు వేసింది. స్మార్ట్‌రోడ్లు, సెంట్రల్ లైటింగ్, గ్రాండ్ ఎంట్రెన్స్‌లు, స్మార్ట్ లైబ్రరీలు, భద్రకాళీ బండ్ ఎంట్రెన్స్ ప్లాజాలను వేగంగా పూర్తి చేసే లక్ష్యంతో కదులుతున్నది.
వరంగల్, ఫిబ్రవరి 4 : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.వందల కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు అధికారులు మూడు నెలల కార్యాచరణ రూపొందించారు. స్మార్ట్‌సిటీ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులు మార్చి నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏ నెలలో ఏ పనులు పూర్తి చేయాలో అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. స్మార్ట్‌సిటీ పథకంలో చేపట్టిన ప్రధాన పనులను మార్చి నాటికి పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో చేపట్టిన స్మార్ట్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్, గ్రాండ్ ఎంట్రెన్స్‌లు, స్మార్ట్ లైబ్రరీలు, భద్రకాళి బండ్ ఎంట్రెన్స్ ప్లాజాలు మూడు నెలల్లో పూర్తి చేయనున్నారు. ఒక వైపు పట్టణ ప్రగతి నిధులతో ప్రతి గల్లీలో అభివృద్ధి పనులు, మరో వైపు స్మార్ట్‌సిటీ నిధులతో నగర ప్రధాన రహదారులు, ముఖ ద్వారాలు, సెంట్రల్ లైటింగ్ పనులు పురోగతిలో ఉన్నాయి. మార్చి నాటికి ప్రధాన అభివృద్ధి పనులు పూర్తయితే నగర రూపురేఖలు మారనున్నాయి.
నెల వారీగా కార్యాచరణ..
అభివృద్ధి పనుల పూర్తికి నెల వారీగా కార్యాచరణ రూపొందించారు. ప్రతి నెల పూర్తి చేయాల్సిన పనులపై గ్రేటర్ అధికారులు దృష్టి సారిస్తున్నారు. నెలల వారీగా ప్రణాళిక పక్కా అమలు జరిగేలా కమిషనర్ పమేలా సత్పతి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
జనవరి
స్మార్ట్‌రోడ్లు ఫేజ్-1లో చేపట్టిన నాలుగు రోడ్లలో రోడ్డు-4 పూర్తి చేశారు. రీజినల్ లైబ్రరీ ఆధునీకరణ పనులు, పోతన బైపాస్ రోడ్డు నుంచి 12 మోరీల జంక్షన్ వరకు సెంట్రల్ లైటింగ్. అదాలత్ జంక్షన్ నుంచి అండర్ బ్రిడ్జి వరకు సెంట్రల్ లైటింగ్, కేయూ జంక్షన్ నుంచి పెద్దమ్మగడ్డ జంక్షన్, ఉర్సు గుట్ట నుంచి గణపతి కళాశాల వరకు సెంట్రల్ లైటింగ్ పనులు చేశారు. దీంతో పాటు ఫాతిమా జంక్షన్ నుంచి సుబేదారి వరకు సైకిల్ ట్రాక్ పనులు పూర్తి చేశారు.
ఫిబ్రవరి..
స్మార్ట్ రోడ్లలో రోడ్డు-3 పూర్తి చేయనున్నారు. సెంట్రల్ లైబ్రరీని స్మార్ట్ లైబ్రరీగా తీర్చిదిద్దనున్నారు. రాతి కోట ఉత్తర ద్వారం పక్కన ఉన్న మాటు అభివృద్ధితోపాటు విద్యుదీకరణ, ఖిలావరంగల్‌లో నాలుగు కిలోమీటర్ల పొడవు ఉన్న రాతి కోటపై ముళ్ల పొదల తొలగింపు, రాతి కోట రోడ్డు పొడవు లైటింగ్ ఏర్పాటు పనులు పూర్తి చేయాలని ప్రణాళికలు తయారు చేశారు. చారిత్రక ఖిలావరంగల్‌లోని కట్టడాలకు ఫసాడ్ లైట్ల ఏర్పాటుతోపాటు రెండు సంవత్సరాల పాటు నిర్వహణ చేసేలా ఏజెన్సీని ఫిబ్రవరి 28 వరకు ఏర్పాటు చేయనున్నారు.
మార్చి..
మార్చి 31 నాటికి నగరం నలువైపులా నిర్మిస్తున్న గ్రాండ్ ఎంట్రెన్స్‌ల వద్ద రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయనున్నారు. భద్రకాళీ బండ్ ముఖద్వారం వద్ద చేపట్టిన రాతి పనులు, పబ్లిక్ గార్డెన్ అభివృద్ధి పనులు పూర్తి చేయనున్నారు. హైదరాబాద్, ఖమ్మం వైపు కాకతీయ కళాతోరణాలతో చేపట్టిన గ్రాండ్ ఎంట్రెన్స్‌ల పూర్తి, కరీంనగర్ వైపు ఎడ్యుకేషన్ థీమ్‌తో నిర్మించే గ్రాండ్ ఎంట్రెన్స్, నర్సంపేట వైపు టెక్స్టైల్ థీమ్‌తో నిర్మించే గ్రాండ్ ఎంట్రెన్స్‌ల నిర్మాణాలను పూర్తి చేయనున్నారు. చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో విద్యుదీకరణ పనులు పూర్తి చేయనున్నారు.
అభివృద్ధి పనుల్లో వేగం..
మూడు నెలల ప్రణాళికలో భాగంగా అభివృద్ధి పనులు పూర్తయితే నగర రూపు రేఖలు మారనున్నాయి. చారిత్రక, పర్యాటక నగరంగా ఆకట్టుకుంటున్న వరంగల్ నగరంలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచేందుకు గ్రేటర్ అధికారుల ముందుకు పోతున్నారు. ఇప్పటికే అనుకున్నట్లుగానే అభివృద్ధి పనులు పూర్తి చేస్తూ వస్తున్నారు. మార్చి నాటికి అనుకున్నట్లుగా అన్ని ప్రధాన అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే నగరంలోని సుమారు 25 జంక్షన్ల అభివృద్ధి, సుందరీకరణ పనులు మార్చి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. గ్రాండ్ ఎంట్రెన్స్‌లు, ప్రధాన స్మార్ట్ రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి, చారిత్రక కోటలో ఫసాడ్ లైట్ల కాంతులు నగరానికి కొత్త అందాలు తీసుకురానున్నాయి.
తాజావార్తలు
- అన్ని మున్సిపాలిటీల్లో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు
- భారతదేశపు మొదటి అటవీ వైద్య కేంద్రం ప్రారంభం
- పదేండ్లలో చేయాల్సిన పనులు11 నెలల్లో పూర్తి చేశాం
- భారత అమ్మాయిల ఓటమి
- రైతులారా ఆశ కోల్పోవద్దు.. వంద నెలలైనా మీతో ఉంటాం: ప్రియాంక గాంధీ
- నిర్మాణ అద్భుతం దేవుని గుట్ట ఆలయం
- ఈ టీ తాగితే బరువు తగ్గొచ్చు
- జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి కేటీఆర్
- మార్చి 12 నుంచి ప్రచారం మొదలుపెడుతా: మిథున్ చక్రవర్తి
- కిడ్స్ జోన్లో ఎంజాయ్ చేసిన టీమిండియా క్రికెటర్లు.. వీడియో