మురుగు వదిలి ముస్తాబు

- ఏడాదిన్నరలోనే మారిన ఊర్లు
- ఏ గ్రామం చూసినా కొత్త రూపు
- పరిశుభ్రత, పచ్చదనంతో కళకళ
- ప్రజావసరాలు తీరేలా పనులు
- మెరుగైన ఆరోగ్య ప్రమాణాలు
- ఉమ్మడి జిల్లాలో జీపీలు 1687
- పల్లె ప్రకృతి వనాలు 2,383
- వైకుంఠ ధామాలు 745
- నర్సరీలు 1,682
- కంపోస్టు తయారీ కేంద్రాలు 973
- ఆవాసాలు 2,738
- డంపింగ్ యార్డులు 1,477
- పూర్తయిన రైతు వేదికలు 324
నిన్నమొన్నటిదాకా ఊరంటే పాత ఇండ్లు.. పాడువడ్డ బావులు.. బొందలు పడి మురుగు పారే దారులు.. చెత్తకుప్పలు, మురికి కూపాలతో నిండిన వీధులు.. కంపు కొట్టే సందులు.. దోమలు, ఈగలు, క్రిమికీటకాలు ముసురుకున్న పరిసరాలు.. ఎటు చూసినా కనిపించే రొచ్చును చూసి మనసు నొచ్చుకునేది. గుండెనిండా ఊపిరి పీల్చుదామంటే స్వచ్ఛమైన గాలి కరువయ్యేది. కూడళ్లు, ఇంటి అరుగులు తప్ప నలుగురు ఒక్కచోట చేరి ఆహ్లాదం పొందే ప్రదేశాలు కానరాకపోయేవి. పల్లెలకు పట్టిన ఏండ్లనాటి దారిద్య్రాన్ని పోగొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’తో ఊరు మారింది. ఏడాదిన్నరనుంచి ఏ గ్రామం చూసినా పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడుతున్నది. అద్దాల్లాంటి రోడ్లు, ఎప్పుటికప్పుడు పారిశుధ్య నిర్వహణ, మంచి వాతావరణం పంచేందుకు పచ్చని చెట్లు, కాసేపు సేదతీరేందుకు రూపుదిద్దుకుంటున్న ప్రకృతివనాలు, చివరి గమ్యానికి ప్రశాంతంగా చేరుకునేందుకు సిద్ధమైన వైకుంఠధామాలతో ప్రతి పల్లె కొత్తగా కనిపిస్తున్నది.
- వరంగల్, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఏండ్లనాటి దారిద్య్రాన్ని తరిమికొట్టిన ‘పల్లె ప్రగతి’
ఊరు అదే.. కానీ ముఖచిత్రం మారింది.. గ్రామస్తులు, అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితో సరికొత్త రూపాన్ని సంతరించుకున్నది. సర్కారు చేయూతతో ప్రగతి బాట పట్టింది. ఏడాదిన్నరలోనే మురుగు వదిలి ముస్తాబై ఆహ్లాదం పంచుతున్నది. పాత కంపును పోగొట్టుకుని స్వచ్ఛమైన వాతావరణాన్ని ప్రజల దరిచేర్చింది.
క్రమం తప్పకుండా నిధులు
పల్లె ప్రగతి విజయవంతం కోసం రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తున్నది. 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు కలిపి గతేడాది ఏప్రిల్ నుంచి జనవరి వరకు ఆరు జిల్లాలకు రూ. 420.35 కోట్లు విడుదలయ్యాయి. వీటి ద్వారా ప్రజలకు అత్యవసరాలైన వైకుంఠధామం(శ్మశానవాటిక), డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే చాలా గ్రామాల్లో ఇవి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. పారిశుధ్య నిర్వహణతో పల్లెలు ఇప్పుడు సురక్షితమైన ప్రాంతాలుగా మారాయి. నిండైన పచ్చదనంతో స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి. పారిశు ధ్య నిర్వహణ, పచ్చదనం కోసం అవసరమయ్యే ట్రాక్టర్ను ప్రతి పం చాయతీకి ప్రభుత్వం సమకూర్చింది. వరంగల్ అర్బన్, వరంగల్ రూర ల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ము లుగు జిల్లాల్లో కలిపి 1687 గ్రామ పంచాయతీలున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని ఒక్క జీపీకి తప్ప అన్నింటికీ ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు ఉన్నాయి. వీటితో గ్రామా ల్లో పారిశుధ్య నిర్వహణ సు లభతరమైంది. మొక్కలకు నిరంతరం నీటిసరఫరా చే స్తున్నారు. ఇక ప్రజలకు ఆ హ్లాదం పంచేందుకు ఏర్పాటైన పల్లె ప్రకృతి వనాలు ఊ ర్లకు కొత్త కళను తెచ్చాయి. గ్రామాలకు వెళ్లిన వారు అ క్కడ సెల్ఫీలు తీసుకుని ము రిసిపోతున్నారు.
పాతవి లేవు..
ఇంటి పక్కన ప్రమాదకరంగా ఉండే పాత బాయి బొందలు, పడావు పడ్డ ఇండ్లు ఇప్పుడు ఎక్కడా లేవు. విస్తృతమైన ప్రజాభాగస్వామ్యంతో గ్రామాల సమగ్ర వికాసమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి ఊర్ల రూపురేఖలనే మార్చేసింది. పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు, వైకుంఠధామాల నిర్మాణం, డంపింగ్ యార్డుల ఏర్పాటు ప్రధాన అంశాలుగా చేపట్టిన కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తున్నది. పల్లె ప్రగతి ద్వారా ఊర్లలో జనాలకు కావాల్సిన పనులు చేపడుతున్నారు. 2019 సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 5 వరకు మొదటి విడుత, 2020 జనవరి 2 నుంచి 12 వరకు రెండో విడుత ‘పల్లె ప్రగతి’ నిర్వహించి, ఆ తర్వాత నిరంతరం కొనసాగాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ కార్యక్రమం మెజార్టీ గ్రామాల్లో విజయవంతమైంది. దీంతో పట్టణాలకు దీటుగా గ్రామాల్లో ప్రజల ఆరోగ్య ప్రమాణాలు మెరుగయ్యాయి.