బుధవారం 03 మార్చి 2021
Warangal-city - Feb 04, 2021 , 00:53:00

ఆకలితీర్చే అన్నపూర్ణ

ఆకలితీర్చే అన్నపూర్ణ

  • సర్కారు నిర్ణయం.. పేదలకు వరం
  • రూ.5 భోజనానికి విశేష స్పందన
  • నగరంలోని ఐదు కేంద్రాల్లో నిర్వహణ
  • ప్రతి సెంటర్‌లో రోజూ 
  • 500 మందికిపైగా భోజనం

ఏ ఒక్కరూ ఆకలితో బాధ పడవద్దనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.5 భోజనం పేదలకు వరంలా మారింది. నగరంలోని ఐదు చోట్ల ఏర్పాటు చేసిన అన్నపూర్ణ క్యాంటీన్లు పేదల ఆకలి తీర్చుతున్నాయి. హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల (జీఎంహెచ్‌) ఆవరణలోని సెంటర్‌ వద్ద రోజూ మధ్యాహ్నం వందలాది మంది కార్మికులు, ప్రైవేట్‌ ఉద్యోగస్తులు భోజనం చేస్తున్నారు. ఉదయం కూలి పనికి వెళ్లే వారికి ఈ భోజనం ఎంతో ఆసరా అవుతున్నది. రోజు వారీ కూలీలు మధ్యాహ్నం రూ.5 భోజనంతో కడుపునింపుకొంటున్నారు. గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో హరేరామ హరేకృష్ణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ఈ పథకం అందరికీ సౌలభ్యంగా మారింది. ఆటోడ్రైవర్లు, కార్మికులు, ప్రైవేట్‌ ఉద్యోగులు సైతం రూ.5 భోజనాన్ని ఇష్టం గా తింటున్నారు. పప్పు, సాం బార్‌, కూరగాయలు, పచ్చడితో  అం దిస్తున్నందున ఈ భోజనా న్ని సామాన్యులు సద్వినియోగం చేసుకుంటున్నారు. 

- హన్మకొండ చౌరస్తా, ఫిబ్రవరి 3

రోజురోజుకూ స్పందన

గ్రేటర్‌ పరిధిలో జీడబ్ల్యూఎంసీ తీసుకొచ్చిన అన్నపూర్ణ భోజన పథకానికి రోజురోజుకూ విశేష స్పందన వస్తున్నది. నామమాత్రపు ధరకే రుచికరమైన, నాణ్యమైన భోజనం దొరుకుతుండడంతో చాలామంది నగరవాసులు మధ్యాహ్నం కాగానే భోజన స్టాళ్లను వెతుక్కుంటూమరీ వెళ్తున్నారు. హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి దవాఖాన(జీఎంహెచ్‌), జిల్లా పరిషత్‌ ఆవరణ, కేయూ జంక్షన్‌, వరంగల్‌ బస్‌స్టేషన్‌, ఎంజీఎం దవాఖాన ఆవరణలో అన్నపూర్ణ కేంద్రాలు నడుస్తున్నాయి. ఉదయం 11.30 నుంచి మొదలై మధ్యా హ్నం 2గంటల వరకు అందుబాటులో ఉంటున్నాయి. ఒక్కో కేంద్రంలో రోజూ సుమారు 500మందికి పైగా పేదలకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నారు.

ఆదరణ పెరుగుతున్నది

రూ.5కే భోజనం దొరుకడం వల్ల సెంటర్‌కు చాలామంది వస్తున్నారు. ప్రతిరోజూ హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో సుమారు 500 మందికి భోజనం పెడుతున్నం. రోజురోజుకూ విశేష ఆదరణ లభిస్తున్నది. ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన భోజనం అందిస్తున్నాం.

- శివ, హరేరామ-హరేకృష్ణ

సంస్థ సిబ్బంది రుచికరంగా ఉంది..

ఫ్రెండ్స్‌తో కలిసి అందుబాటులో ఉన్న కేంద్రం వద్ద అప్పుడప్పుడు రూ.5 భోజనం తింటున్న. టేస్ట్‌ ఎంతో బాగుంటుంది. ఇంత తక్కువ ధరకు సాంబార్‌, కర్రీతో పాటు పచ్చడి ఇవ్వడం చాలా బాగుంది. చాలామంది పేదల ఆకలి తీర్చుతున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు.

- నగేశ్‌, విద్యార్థి 

భోజనం బాగుంది..

తక్కువ ధరకు భోజనం లభించడం చాలా బాగుంది. పేదల కష్టం తెలిసిన సీఎం కేసీఆర్‌ రూ.5కే కడుపు నిండా అన్నం పెడుతుండు. చాలామంది ఇక్కడికి వచ్చి భోజనం చేస్తున్నరు. కార్మికులకు, ప్రైవేట్‌ ఉద్యోగులకు అన్నపూర్ణ కేంద్రాలు ఎంతో ఉపయోగపడుతున్నయ్‌.

- సంపత్‌, హన్మకొండ 

VIDEOS

logo