మూగజీవాలకు అత్యాధునిక వైద్యం

- రూ.4 కోట్లతో తొలిదశ నిర్మాణం పూర్తి
- వెటర్నరీ కాలేజీకి అనుబంధంగా ఏర్పాటు
- గైనకాలజీ, సర్జరీ, మెడిసిన్ విభాగాలు
- రాత్రి 8గంటల వరకు సేవలు
- వెటర్నరీ కోర్సులు చదివేవారికి అవకాశాలు మెరుగు
- రూ.27 కోట్లతో వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. మూగజీవాలకు సైతం అత్యాధునిక వైద్య సేవలందించే ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు వరంగల్‌లో ఉన్న వెటర్నరీ దవాఖాన స్థానంలో కొత్తగా రూ.27కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నది. వెటర్నరీ కళాశాలకు అనుబంధంగా పనిచేసే ఈ దవాఖానలో అన్ని రకాల జీవాలకు సాధారణ వైద్యంతో పాటు ఆపరేషన్లు చేసే సౌకర్యం ఉంటుంది. వ్యాధులను నిర్ధారించేందుకు అల్ట్రాసౌండ్ వంటి పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు వెటర్నరీ కళాశాలలో సీట్లు పెరిగి ఆయా కోర్సులు చదివేవారికి అవకాశాలు మెరుగుపడనున్నాయి.
వరంగల్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మూగజీవాలకు అత్యాధునిక వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నది. ఇందుకుగాను వరంగల్‌లో కొత్తగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నది. రూ.27 కోట్లతో పనులు మొదలుకాగా, మొదటిదశలో రూ.4 కోట్లతో చేపట్టిన నిర్మాణం పూర్తయ్యింది. మెయిన్ రోడ్డుకు హాస్పిటల్‌ను అనుసంధానించే దారి కోసం పశుసంవర్ధక శాఖ గతంలోనే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు నిధులు చెల్లించింది. ఈ పనులు పూర్తి కాగానే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సేవలను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో గైనకాలజీ, సర్జరీ, మెడిసిన్ విభాగాలు ఉండడం వల్ల అన్ని మూగజీవాలకు ఇక్కడే పూర్తిస్థాయి వైద్యం అందనుంది. అలాగే వ్యాధులను నిర్ధారించేందుకు వీలుగా అల్ట్రా సౌండ్ పరికరాలను అమర్చుతున్నారు. ప్రస్తుతం ఉదయం తొమ్మది నుంచి సాయంత్రం ఐదు వరకే సేవలందిస్తుండగా, కొత్త హాస్పిటల్ ప్రారంభమైతే రాత్రి ఎనిమిది గంటల వరకు సేవలందిస్తారు. పాడిపశువులు, గొర్రెలు, మేకలు, కుక్కలు, కోళ్లు, ఇతర పక్షులు అన్నింటికీ ఇక్కడ సాధారణ వైద్య సేవలతో పాటు ఆపరేషన్లు చేస్తారు.
వెటర్నరీ కాలేజీకి అనుబంధంగా..
2017లో వెటర్నరీ డిగ్రీ కాలేజీని రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌లో ఏర్పాటు చేసింది. వెటర్నరీ కౌన్సెల్ ఆఫ్ ఇండియా(వీసీఐ) అనుమతితో 2018లో మొదటి బ్యాచ్ మొదలైంది. ఈ కాలేజీ అనుమతి వచ్చే విషయంలో మానవ వనరులతో పాటు భవనాలు కీలకంగా ఉంటాయి. మొదట మామునూరు సమీప భవనంలో వీటిని నిర్వహిస్తున్నారు. వెటర్నరీ కాలేజీ శాశ్వత భవనాల నిర్మాణం వేగంగా జరుగుతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మూడో బ్యాచ్ మొదలుకాబోతోంది. వీసీఐ బృందం మూడేండ్ల క్రితం క్షేత్రస్థాయిలో పరిశీలించి రెండు బ్యాచ్‌లకు అనుమతిచ్చింది. తాజాగా కొత్త బ్యాచ్‌కు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త భవనంలోనే వచ్చే ఏడాది తరగతులను నిర్వహించేలా పనులు వేగంగా పూర్తవుతున్నాయి. మరోవైపు వెటర్నరీ డిగ్రీ విద్యార్థులు బోధనతో పాటు ప్రత్యక్షంగా వైద్య సేవల్లో శిక్షణ పొందాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం పూర్తవుతోంది. కాలేజీలో ప్రస్తుతం 40సీట్లకు వీసీఐ అనుమతి ఇచ్చింది. ఈ కాలేజీకి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభమైతే అప్పుడు ఈ సంఖ్య 80కి పెరుగుతుంది. దీంతో వెటర్నరీ కోర్సు చదివే వారికి అవకాశాలు రెట్టింపు కానున్నాయి.
తాజావార్తలు
- టీ బ్రేక్..ఇంగ్లాండ్ 144/5
- ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్.. ఇండియాలో బెంగళూరే బెస్ట్
- ఉప్పెన చిత్ర యూనిట్‌కు బన్నీ ప్రశంసలు
- ఓటీటీలో పోర్న్ కూడా చూపిస్తున్నారు : సుప్రీంకోర్టు
- సవాళ్లను ఎదుర్కొంటున్న భారత సైన్యం : సీడీఎస్ బిపిన్ రావత్
- షాకింగ్ : లైంగిక దాడిని ప్రతిఘటించిన దళిత బాలిక హత్య!
- ప్రమీలా జయపాల్‌కు అమెరికాలో అత్యున్నత పదవి
- ఓటీటీ నియంత్రణలపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
- వేగవంతంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ
- మెగా హీరో సినిమాలో బిగ్ బాస్ భామ..!