మంగళవారం 02 మార్చి 2021
Warangal-city - Jan 31, 2021 , 00:08:36

రూ.155.53కోట్ల పనులకు ఆమోదం

రూ.155.53కోట్ల పనులకు ఆమోదం

  • మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు కౌన్సిల్‌ గ్రీన్‌సిగ్నల్‌
  • భద్రకాళి ఆలయ మాడవీధుల డీపీఆర్‌కు నిధుల కేటాయింపు 
  • ఏడాదిన్నరలో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి : మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు

వరంగల్‌, జనవరి 30 : చరిత్రలో నిలిచిపోయేలా నగరాభివృద్ధి పరుగులు పెడుతోంది. ప్రతి కౌన్సిల్‌ సమావేశంలో రూ.వందల కోట్ల అభివృద్ధి పనులకు ఆమోద ముద్రలు పడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధికి నిధులు కేటాయి స్తున్నారు. శనివారం హన్మకొండ అంబేద్కర్‌ భవన్‌లో మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు అధ్యక్షతన జరిగిన గ్రేటర్‌ సర్వసభ్య సమావేశం లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నగరంలో రూ.155.53 కోట్ల అభివృద్ధి పనులకు కౌన్సిల్‌ పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. 74 ప్రధాన ఎజెండా అంశాలతో పాటు 24 టేబుల్‌ ఎజెండా అంశాలలో ఉన్న  362 అభివృద్ధి పనులకు అనుమతులు మంజూర య్యాయి. కొన్ని డివిజన్లకు రూ.10 కోట్లకు పైగా అభివృద్ధి నిధులు కేటాయించింది. కాగా, నగరంలో పలు జంక్షన్లలో మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేసింది. భద్రకాళి బండ్‌పై బసవేశ్వర విగ్రహం, నగరంలోని అనుకూలమైన జంక్షన్లలో  విగ్రహంతో పాటు మిషన్‌ భగీరథ పథకంలో ఉగాది నుంచి నగరానికి రోజూ తాగునీటి సరఫరా చేయనున్న తరుణంలో భగీరథుడి విగ్రహం ఏర్పాటు చేయాలని కౌన్సిల్‌ సమావేశంలో సభ్యులు నిర్ణయించారు. హన్మకొండ చౌరస్తా ప్రాంతంలోని టైలర్స్‌ స్ట్రీట్‌ను జ్యువెల్లరీ స్ట్రీట్‌గా మారుస్తూ కౌన్సిల్‌లో తీర్మానం చేశారు.  అలాగే, ఔట్‌ సోర్సింగ్‌లో పనిచేస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్లతో పాటు వర్క్‌ ఇన్‌స్పెక్టర్ల వేతనాల పెంపునకు ఆమోదం తెలిపారు. మామునూరులో యానిమల్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుతో పాటు గ్రేటర్‌ ఇండోర్‌ స్టేడియం సమీపంలో రూ.8.50 కోట్లతో స్విమ్మింగ్‌ పూల్‌ నిర్మాణానికి కౌన్సిల్‌ సభ్యులు ఆమోదం తెలిపారు. అలాగే, భద్రకాళి దేవాలయం మాడవీధుల డీపీఆర్‌ల తయారీకి నిధులు కేటాయించారు. ప్రతి డివిజన్‌కు రూ.5 లక్షలు నామినేషన్‌ పనులు కేటాయిస్తూ కౌన్సిల్‌లో ఆమోదించారు. కాగా, గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కౌన్సిల్‌ సమావేశంలో ఘనంగా నివాళుల ర్పించారు. గాంధీ చిత్రపటానికి మేయర్‌తోపాటు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, కమిషనర్‌ పమేలా సత్పతి పూలమాలలు వేశారు. అనంతరం గ్రేటర్‌ ఆధ్వర్యంలో తడి చెత్తతో తయారు చేస్తున్న భూమి సంవర్ధిని ఎరువును ఆవిష్కరించారు. దీంతో పాటు గ్రేటర్‌ జేఏసీ ఆధ్వర్యంలో ముద్రించిన 2021 డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. 

రూ.వెయ్యి కోట్లతో పనులు

ఏడాదిన్నరగా నగరంలో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నాం. ప్రతి డివిజన్‌లో పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం నగరాభివృద్ధికి ఇంకా రూ. 240 కోట్లు మంజూరు చేసేందుకు హామీ ఇచ్చింది. కార్పొరేషన్‌ చరిత్రలో ఇంతపెద్ద మొత్తంలో అభివృద్ధి జరిగింది ఈ పాలక వర్గం హయాంలోనే. కాంట్రాక్టర్లు భయపడాల్సిన అవసరం లేదు. పనులు పూర్తి చేసిన వెంటనే బిల్లులు చెల్లిస్తాం.  

- గుండా ప్రకాశ్‌రావు, మేయర్‌ 

తలెత్తుకునేలా అభివృద్ధి

కార్పొరేటర్లు తలెత్తుకునేలా అన్ని డివిజన్లలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. మేయర్‌, కమిషనర్‌ సమష్టిగా ముందుకు పోతూ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. రూ.వందల కోట్లు కేటాయిస్తున్న మేయర్‌కు అభినందనలు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దల దృష్టికి నగర సమస్యలు తీసుకపోయి నిధులు తీసుకొచ్చేలా పాలక వర్గం కృషి చేస్తోంది. 

- బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీ

పుట్టలమ్మ రిజర్వాయర్‌ సిబ్బందికి వేతనాలు ఇవ్వాలి

కార్పొరేషన్‌లో విలీనమైన హసన్‌పర్తిలోని పుట్టలమ్మ రిజర్వాయర్‌లో పనిచేస్తున్న సిబ్బందికి గ్రేటర్‌ నుంచి వేతనాలు ఇవ్వాలి. విలీన గ్రామాల అభివృద్ధిపై మరింత దృష్టిసారించాలి. ఆయా కార్పొరేటర్ల అభివృద్ధి ప్రతిపాదనలకు వెంటనే ఆమోదం తెలపాలి. మడికొండ డంపింగ్‌ యార్డులో బయో మైనింగ్‌ పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి.

- అరూరి రమేశ్‌, వర్ధన్నపేట ఎమ్మెల్యే 

తడి, పొడి చెత్తను వేరు చేయాలి 

ఇంటింటికీ చెత్త సేకరణలో భాగంగా ప్రజలు ఇంటి వద్దే తడి, పొడి చెత్తలను వేరు చేసి ఇవ్వాలి. కార్పొరేటర్లు డివిజన్లలో ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాలి. తడి చెత్తతో ఇంటి వద్దే కంపోస్ట్‌ చేసేలా ప్రజలను చైతన్యం చేయాలి. ఇలా తయారు చేసిన ఎరువును కిలో రూ.20 చెల్లించి కార్పొరేషన్‌ కొనుగోలు చేస్తుంది. ప్రజలు సహకరిస్తేనే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో కార్పొరేషన్‌కు మంచి ర్యాంకు వస్తుంది.

- పమేలా సత్పతి, గ్రేటర్‌ కమిషనర్‌ 

VIDEOS

logo