మంగళవారం 09 మార్చి 2021
Warangal-city - Jan 31, 2021 , 00:08:39

మట్టి కింద మహ సంపద

మట్టి కింద మహ సంపద

  • ఖిలా వరంగల్‌ లక్ష్మీ కొండల గండి ప్రాంతంలో 12వ శతాబ్దానికి చెందిన త్రికూటాలయాలు
  • భూగర్భంలో చారిత్రక వారసత్వ సంపద
  • కాకతీయుల నిర్మాణాలపై 
  • ఏళ్ల తరబడి నిరాదరణ  
  • గత పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యాలు
  •  కళా వైభవం కనుమరుగవుతున్నా పట్టని కేంద్ర పురావస్తుశాఖ
  • నిధులు మంజూరైనా విడుదల చేయక కాలయాపన

అవి ఒకప్పుడు ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లాయి. ఓరుగల్లు రాజధాని ప్రజల నీరాజనాలు అందుకున్నాయి. కాకతీయుల ఘనకీర్తిని విశ్వవ్యాప్తం చేశాయి. నాటి చారిత్రక వైభవాన్ని నలు దిశలా చాటాయి. కాల క్రమేణా ఆదరణ కరువై క్రమంగా మట్టిలోకి ఒదిగిపోయాయి. రాజ్యాలు పోయి రాజకీయాలు వచ్చాక నాయకుల నిర్లక్ష్యానికి సాక్ష్యాలుగా నిలిచాయి. ఇక ఎవరూ పట్టించుకునేవారు లేక ఆ మహా ఆలయాలను భూ మాతే తన గర్భాన దాచుకున్నది. గత పాలకుల ‘పక్షపాతాన్ని’ కళ్లగట్టేందుకు ఇప్పటికీ కడుపున పొదిమి పట్టుకున్నది. ఎప్పుడో కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలోకి వెళ్లిన ఈ ప్రాంత కళావైభవం కనుమరుగవుతున్నా, పట్టని ఆ శాఖ తీరు విమర్శలకు తావిస్తున్నది.    

-వరంగల్‌, జనవరి 30 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి) 

అవి కాకతీయుల ఘనమైన వారసత్వ సంపదకు సాక్ష్యాలు.. క్రీస్తు శకం 12వ శతాబ్దానికి చెందిన గొప్ప చారిత్రక నిర్మాణాలు.. ఒకప్పుడు నిత్యపూజలు, అభిషేకాలతో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లి, సుదీర్ఘకాలం ‘ఓరుగల్లు రాజధాని’ వైభవాన్ని చాటిన త్రికూటాలయాలు.. కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్న ఈ వారసత్వ కట్టడాలు కాల క్రమేణా పట్టింపు కరువై మట్టిలో కూరుకుపోయాయి. ఇటీవలి కాలంలో చారిత్రక అన్వేషణలో భాగంగా ఖిలా వరంగల్‌ మట్టి కోటలోని లక్ష్మీకొండల గండి ప్రాంతంలో భూగర్భంలో దాగిన అత్యద్భుత త్రికూటాలయాలు వెలుగుచూశాయి. ఒక ఆలయం సగమే బయటపడగా, మరో ఆలయం పూర్తిగా భూమిలోనే ఉన్నది. ఇప్పటికైనా ఈ అపురూప దేవాలయాలను కేంద్రం పట్టించుకుని పూర్వవైభవం తేవాలన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. -వరంగల్‌, జనవరి 30 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి) 

చారిత్రక అన్వేషణలో వెలుగులోకి

ఇటీవలి కాలంలో మట్టి కోటలోని లక్ష్మీకొండల గండి ప్రాంతంలో చారిత్రక అన్వేషణలో భాగంగా త్రికూటాలయాలు వెలుగుచూశాయి. ఒక ఆలయం సగమే బయటపడగా, మరో ఆలయం పూర్తిగా భూ గర్భంలోనే ఉన్నది. ఓరుగల్లులో రాతికోట, మట్టికోటల మధ్య దాదాపు 17 ఆలయాలున్నాయి. వీటన్నింటిలోనూ ఈ త్రికూటాలయాలు ప్రత్యేకమైనవి. పద్మపు పట్టికలు, హంస పట్టికలు, రంగమండపంలో స్తంభాలపై అందమైన శిల్పాలున్నాయి. ఆలయంలోని శిలలపై వాలి వధ, గోపికలు, కృష్ణుడు, గజలక్ష్మి, నరసింహావతారం, వినాయకుడు, కోలాటం వంటి చిత్రాలున్నాయి. గర్భాలయ ద్వార బంధాలపై చతర్భుజులైన శైవ ద్వార పాలకులు, చామర, పరిచారికల శిల్పాలు ఉన్నాయి. రెండో త్రికూటాలయం ఇప్పుడు పూర్తిగా భూమిలోపలే ఉన్నది. పైన ఉండే రాయి తొలగించి ఉంది. లోపలికి దిగితే గర్భాలయం, వీరభద్రుడి విగ్రహాలున్నాయి. కేంద్ర పురావస్తు శాఖ నిర్లక్ష్యంతో ఈ చారిత్రక ఆలయాలు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం నెలకొంది. గుప్త నిధుల కోసం కొందరు ఆలయాలు, వాటి పరిసరాల్లో తవ్వకాలు జరిపిన ఆనవాళ్లున్నాయి. ఇలాంటి తవ్వకాలతో ఆ ప్రాంతమంతా శిథిలావస్థకు చేరింది. ఆలయంలో ఉండాల్సిన శివలింగం సమీపంలోనే వేరే చోట ఉన్నది. ఆలయం, శివలింగం బయటపడడంతో భూగర్భంలో మరింత అపురూప శిల్పసంపద ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు. కేంద్ర పురావస్తు శాఖ ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ రెండు ఆలయాల్లోనూ గొప్ప కళా సంపద ఉందని, పూర్తిస్థాయిలో తవ్వితే వా రసత్వ సంపద బయటికి వస్తుందని పేర్కొంటున్నారు. కాకతీయ ఘన వారసత్వ సంపదకు ఆనవాళ్లుగా ఉండే త్రికూటాలయాలు నిరాదరణకు గురై మరుగున పడ్డాయి. కేంద్ర పురావస్తు శాఖ పరిధిలోని ఈ కట్టడాలను పట్టించుకునే వారు లేక భూమిలో కుంగిపోయా యి. ఏండ్లుగా ఇదే వైఖరి ఉండడంతో ఈ ఆలయాల ఆనవాళ్లు కూడా ఇప్పుడు దొరికే పరిస్థితి లేకుండా పోతున్నది. కాకతీయుల రాజధాని కేంద్రం ఖిలా వరంగల్‌ మట్టి కోటకు ఆనుకుని ఉండే ప్రాచీన ఆలయాల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా ఉన్నది. 12వ శతాబ్దానికి చెందిన ఈ త్రికూటాలయాల్లో గొప్ప కళా సంపద ఇప్పటికీ అలానే ఉన్నది. ఇవి కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో ఉండడంతో వీటి పరిరక్షణ, పర్యవేక్షణ అంతా కేంద్ర ప్రభుత్వమే చూడాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు త్రికూటాలయాలు బయటికి కనిపించేలా చేసేందుకు అవసరమైన తవ్వకాల కోసం కేంద్ర పురావస్తు శాఖ గతంలో రూ.80 లక్షలు మంజూరు చేసింది. కానీ, నిధులు విడుదల చేయకపోవడంతో త్రికూటాలయాలు వెలుగు చూసే పనులు మొదలుకావడం లేదు. 

శివుడు, విష్ణువు, సూర్యుడి కొలువు.. 

ఒకే ఆవరణలో శివుడు, విష్ణువు, సూర్యుడు కొలువై ఉండేలా కట్టిన ఆలయాలను త్రికూటాలయాలుగా పిలుస్తారు. ఇలాంటివి అరుదుగా ఉంటాయి. కాకతీయుల హయాంలో కట్టిన ఆలయాల్లో దాదాపు అన్నీ ఇదే పద్ధతిలో ఉంటాయి. కాకతీయులు ఓరుగల్లు రాజధానిగా సుదీర్ఘకాలం పరిపాలన సాగించారు. గణపతి దేవుడి కాలంలో రాజ్య రక్షణ కోసం వరుసగా రాతికోట, మట్టికోట, పుట్టకోటలు నిర్మించారు. కోటలోని స్వయంభూ శ్రీ శంభులింగేశ్వరస్వామి ఆలయాన్ని ప్రధాన కేంద్రంగా భావించేవారు. ప్రధాన కేంద్రం నుంచి 1.2 కిలోమీటర్ల దూరంలో నాలుగు కిలో మీటర్ల పొడవుతో చుట్టూ రాతి కోట నిర్మించారు. ప్రధాన కేంద్రం నుంచి 2.4 కిలో మీటర్ల దూరంలో ఏడు కిలోమీటర్ల పొడవుతో మట్టి కోట కట్టారు. మట్టి కోట బయట విశాలమైన ప్రాంతాన్ని కలుపుతూ పుట్టకోట నిర్మించారు. కాకతీయ పాలకుడు గణపతి దేవుడి హయాంలో ఈ కోటల నిర్మాణం పూర్తయ్యిందని, ఆలయాల నిర్మాణం తర్వాతే కోట నిర్మాణం జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు. వందల ఏండ్ల నాటి వారసత్వ సంపద ఇప్పుడు కేంద్ర పురావస్తు శాఖ తీరుతో నిర్లక్ష్యానికి గురవుతున్నదని, ఇప్పటికైనా ఈ ఆలయాలకు పూర్వవైభవం తేవాలని కోరుతున్నారు. 

VIDEOS

logo