కళలకు పుట్టినిల్లు ఓరుగల్లు

- కాకతీయుల తర్వాత కళలను ప్రోత్సహిస్తున్నది సీఎం కేసీఆర్ ఒక్కరే..
- మేయర్ గుండా ప్రకాశ్‌రావు
ఖిలావరంగల్, జనవరి 29 : కళలను, కళాకారులను పోషించిన ఘనత కాకతీయ చక్రవర్తులదని, దీంతో ఓరుగల్లు కళలకు పుట్టినిల్లుగా మారిందని మేయర్ గుండా ప్రకాశ్‌రావు అన్నా రు. శుక్రవారం వరంగల్ స్టేషన్ రోడ్డులోని రాధాకృష్ణ గార్డెన్స్‌లో జరిగిన సమావేశంలో ఫిబ్రవరి 2న జరుగనున్న సద్గురు త్యాగరాజస్వామి ఆరాధన సంగీతోత్సవ విధి విధానాలను భద్రకాళి శేషు తో కలిసి మేయర్ వెల్లడిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ల తర్వాత వరంగల్‌లో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు జరుపడం సంతోషంగా ఉందన్నారు. నాట్యం, శిల్పం, సంగీతం ఈ మూడింటిని నాడు ప్రపంచానికి అందించిన ఘనత కాకతీయులదే అని తెలిపారు. వారి తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అకాడమిని స్థాపించి కళలను ప్రోత్సహిస్తున్నారన్నారు. కాకతీయుల మాదిరిగానే తెలంగాణలో సీఎం కేసీఆర్ అనేక ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. భద్రకాళి శేషు మాట్లాడుతూ ఫిబ్రవరి 2న ఉదయం 7:30 గంటలకు భద్రకాళి ఆర్చిగేటు వద్ద ఉన్న విద్యారణ్యస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి, అక్కడి నుంచి నగర సంకీర్తన ద్వారా వరంగల్ స్టేషన్ రోడ్డులోని రాధాకృష్ణ గార్డెన్‌కు చేరుకుంటామన్నారు. ఉత్సవం తర్వాత వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులను సన్మానిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత విధ్వాంసులు వీ తిరుపతయ్య, ఉమ్మడి లక్ష్మణాచారి, ఎండీ జియోద్దీన్, ఎండీ లాయక్ అహ్మద్, రాంపెల్లి గోపీకృష్ణశర్మ, వనమాల సుధాకర్, దెందుకూరి సోమనాథ్, బైరి శిరీష, పశుపతి, భాస్కర్, సాయిచరణ్, ప్రణని, పావని, అనురాధ, రామ్మూర్తి, బజ్జూరి వైకుంఠం, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.