ఆదివారం 07 మార్చి 2021
Warangal-city - Jan 26, 2021 , 00:16:50

జెండా పండుగకు వేళాయె..

జెండా పండుగకు వేళాయె..

  • గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం.. ముస్తాబైన పరేడ్‌ గ్రౌండ్‌
  • ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
  • ఆరు జిల్లాల్లో పతాకాలను ఆవిష్కరించనున్న కలెక్టర్లు
  • కొవిడ్‌ నిబంధనల మేరకు కార్యక్రమాలు

గణతంత్ర దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. మంగళవారం నిర్వహించే వేడుకలకు ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాకేంద్రాల్లో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. వివిధ రకాల రంగులతో మైదానాలను ముస్తాబు చేయగా సాంస్కృతిక ప్రదర్శనలు, అభివృద్ధిని తెలిపే స్టాళ్ల కోసం ఏర్పాట్లు చేశారు. జిల్లాలవారీగా కలెక్టర్లు జాతీయ జెండాలను ఆవిష్కరించనుండగా కొవిడ్‌ నిబంధనల నడుమ వేడుకలు నిర్వహించనున్నారు.

హన్మకొండ, జనవరి 25 : గణతంత్ర దినోత్సవ వేడుకలకు హన్మకొండ పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌ ముస్తాబైంది. రంగురంగులతో గ్రౌండ్‌ను అలంకరించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. ఉదయం 8గంటల నుంచి సాంస్కృతిక సారథి బృంధాలతో కార్యక్రమాలు నిర్వహిస్తారు. 9గంటలకు జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఆ తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జిల్లాలో అమలుచేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలను ఉద్దేశించి కలెక్టర్‌ ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులను సత్కరిస్తారు. అలాగే విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేస్తారు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాటుచేసిన స్టాళ్లను కలెక్టర్‌ తిలకిస్తారు. ఈమేరకు పరేడ్‌గ్రౌండ్‌లో సెంట్రల్‌జోన్‌ డీసీపీ పుష్ప ఆధ్వర్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీస్‌శాఖలో వివిధ విభాగాల సిబ్బందితో కలిపి పరేడ్‌ చేయించేందుకు 5 ప్లాటూన్లను సిద్ధం చేశారు. వీఐపీలు, విద్యార్థులు, ప్రజలు వేడుకలకు హాజరుకానున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ సమస్యలు రాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించి, సామాజిక దూరం పాటించాలని అధికారులు సూచించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో అంబేద్కర్‌ క్రీడా మైదానం, ములుగులో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. మహబూబాబాద్‌లో ఎన్టీఆర్‌ స్టేడియంలో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, జనగామలో ధర్మకంచ మినీ స్టేడియంలో కలెక్టర్‌ నిఖిల, హన్మకొండ జేఎన్‌ స్టేడియంలో వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ జెండా ఆవిష్కరించనునున్నారు.


VIDEOS

logo