సోమవారం 01 మార్చి 2021
Warangal-city - Jan 25, 2021 , 00:21:50

పల్లె ఇంజినీర్..!

పల్లె ఇంజినీర్..!

  • చదివింది ఐటీఐ..సృజనాత్మకతతో కొత్త ఆవిష్కరణ 
  • కలుపుతీసే యంత్రాన్ని కనుగొన్న యువకుడు
  • తక్కువ ధరకు విక్రయిస్తూ రైతులకు అండగా..
  • ఇతర రాష్ర్టాలకూ సరఫరా..

ఇంజినీరింగ్‌ విద్య చదువలేదు.. పెద్ద పెద్ద కాలేజీలకు వెళ్లనూలేదు.. చేసింది ఐటీఐ.. కానీ, నూతన ఆవిష్కరణలు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు ఓ యువకుడు. కలుపుతీతకు వేల రూపాయల్లో రైతులు పెడుతున్న ఖర్చును దగ్గరుండీ చూశాడు. తక్కువ ఖర్చుతో యంత్రాన్ని కనుగొనాలనుకున్నాడు. రెండేళ్ల పాటు ఇంటర్‌నెట్‌లో పరిశోధన చేశాడు. దానికితోడు అప్పటికే తన వెల్డింగ్‌ షాపులో రైతులకు గుంటుకలు తయారు చేయడం ఆ యువకుడికి కలిసొచ్చింది. కలుపు మొక్కలను ఏరివేసే యంత్రం (మినీ టిల్లర్‌) ను కనిపెట్టి సక్సెస్‌ అయ్యాడు అబ్బోజు వెంకటేశ్‌.     

- శాయంపేట, జనవరి 24

వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తికి చెందిన అబ్బోజు రామ్మూర్తి, సౌందర్య రెండో కుమారుడు వెంకటేశ్‌. హన్మకొండలోని ఓ ప్రైవేటు ఐటీఐలో డీజిల్‌ మెకానిక్‌ చదివాడు. ఆ తర్వాత ఆర్టీసీలో అప్రెంటిస్‌ చేశాడు. ఇంటి వద్ద వెల్డింగ్‌ షాపు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఎద్దుల సాయంతో నడిచే గుంటుక మొద్దు, నాగలి కర్రు వంటివి తయారు చేసి పం పించేవాడు. రైతులు కలుపు తీసేందుకు పడుతున్న తిప్పలను చూసి చలించిపోయాడు. ఈ క్రమంలోనే కలుపుతీసే యంత్రాన్ని కనిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు ఇంటర్నెట్‌ వేదికగా చేసుకున్నాడు. యూట్యూబ్‌లోనూ శోధించాడు. కలుపుతీసే యంత్రాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుని సక్సెస్‌ అయ్యాడు. ఇంజిన్‌తో నడిచే 90 కిలో బరువున్న మినీ టిల్లర్‌ను పెట్రోల్‌, డీజిల్‌తో నడిచేలా తయారు చేశాడు. 

తయారీ ఇలా..

యంత్రం తయారీకి ఇంజిన్‌ను మధ్యప్రదేశ్‌ రాష్ట్రం నుంచి తెప్పించుకుంటున్నాడు. మిగతా పరికరాలను ఐరన్‌తో తన వెల్డింగ్‌ షాపులోనే తయారు చేస్తున్నాడు. యంత్రానికి కిందిభాగంలో ఐదు పారలు, రెండు ఫీట్ల వెడల్పుతో ఉండేలా గుంటుక బ్లేడ్‌ను అమర్చాడు. టిల్లర్‌ తిరిగేలా ముందు భాగంలో టైర్లకు బదులు కేజ్‌ వీల్స్‌ను, రోడ్డుపై వెళ్లేటప్పుడు టైర్లు ఉండేలా డిజైన్‌ చేశాడు. పైభాగంలో ఇంజిన్‌, మోటరును అమర్చాడు. తాడుపెట్టి లాగితే మోటరు స్టార్ట్‌ అయి కేజీవీల్స్‌ సాయంతో ముందుకెళ్తుంది. పారలు  భూమిలోకి వెళ్లి కదులుతుంటే బ్లేడ్‌ కలుపు తీస్తుంది. 

ఇతర రాష్ర్టాలకు యంత్రం సరఫరా

సోషల్‌ మీడియా వేదికగా తాను తయారు చేసిన యంత్రాన్ని వెంకటేశ్‌ ప్రచారం చేశాడు. దీంతో ఇతర రాష్ర్టాల నుంచి ఆర్డర్లు వచ్చాయి. ధర తక్కువగా ఉండడంతో మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, మంచిర్యాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూల్‌, గుంటూరు, కడప ప్రాంతాలకు చెందిన రైతులు కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు 20కి పైగానే యంత్రాలు విక్రయించాడు. తొంబై కిలోల బరువు మాత్రమే ఉండడంతో ట్రాన్స్‌పోర్టు ద్వారా ఆర్డర్‌ ఇచ్చిన వారికి పంపిస్తున్నాడు. 

కలుపుతీయడం భారంగా ఉండేది

మాకున్న భూమిలో కూలీలను పెట్టి కలుపు తీయించడం భారంగా ఉండేది. ఎలాగైనా కలుపుతీసే యంత్రం తయారు చేయాలనుకున్న. ఐటీఐ చదవడంతో ఇంజిన్‌, మోటర్లపై అవగాహన ఉంది. రెండేళ్లు ఇంటర్నెట్‌ సాయంతో యంత్రం తయారీని తెలుసుకున్నా. డీజిల్‌, పెట్రోల్‌ ఇంజిన్‌తో నడిచే టిల్లర్‌ను తయారు చేశా. మిర్చి, ఇతర తోటల్లో రెండు ఫీట్ల గ్యాప్‌తో ఉండే పంటల్లో సులువుగా కలుపు తీ యవచ్చు. ప్రస్తుతం ఒక ఫీటుతో ఉండే టిల్లర్‌ను తయారు చేస్తున్నాను. పత్తితో పాటు చిన్న పంటల్లో కలుపు తీయవ చ్చు. పెద్ద కంపెనీ లు కలుపు తీసే యంత్రాలను రూ. 40 వేల నుంచి రూ.70వేల వరకు విక్రయిస్తున్నాయి. కానీ నేను రూ.35 వేలకు మాత్రమే అమ్ముతున్నాను. 

- అబ్బోజు వెంకటేశ్‌, గట్లకానిపర్తితక్కువ ఖర్చు.. 

వేగంగా పని

మినీ టిల్లర్‌తో ఖర్చు తక్కువ కావడమే కాకుండా పని వేగంగా జరుగుతుంది. ఎద్దుల గుంటుక సాయంతో ఒక ఎకరాలో కలుపు తీస్తే రోజంతా పట్టడమే కాకుండా రూ.1500 ఖర్చు అవుతున్నది. యంత్రంలో లీటర్‌ డీజిల్‌ పోస్తే మూడు గంటలు నడుస్తుంది. గంట నుంచి గంటన్నర సమయంలో ఎకరం విస్తీర్ణంలో కలుపు తీయవచ్చు. లీటరు డీజిల్‌కు రూ.85 ఖర్చు అవుతుంది. ఈ యంత్రాన్ని వెంకటేశ్‌ రూ.35 వేలకు  విక్రయిస్తున్నాడు. 

VIDEOS

logo