సోమవారం 08 మార్చి 2021
Warangal-city - Jan 22, 2021 , 01:11:42

ఆమెకు ఆలంబన

ఆమెకు ఆలంబన

 • మహిళలకు వరంలా సంచార మత్స్య విక్రయ వాహనాలు
 • లైవ్‌తో పాటు కూరలు, ఫ్రైలు అమ్మేలా వసతులు
 • ముగ్గురు లేదా ఐదుగురితో కూడిన బృందాలకు కేటాయింపు 
 • ఒక్కో యూనిట్‌ విలువ రూ.10లక్షలు
 • రూ.2.20కోట్లతో ఉమ్మడి జిల్లాకు 22 మంజూరు
 • 60 శాతం సబ్సిడీపై అందజేత
 • 28లోగా దరఖాస్తులకు గడువు
 • మత్స్యకార్మికుల్లో హర్షం
 • సద్వినియోగం చేసుకోవాలని అధికారుల సూచన

మహిళలకు ఆలంబనగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. ఓవైపు కులవృత్తులను ప్రోత్సహిస్తూనే సంబంధిత వర్గాల ఆడబిడ్డలకు ఉపాధి మార్గాలు చూపుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాధాన్యం దక్కని మత్స్యరంగానికి స్వరాష్ట్రంలో పెద్దపీట వేసింది. ఇప్పటికే మత్స్యకార వృత్తికి కావాల్సిన చేప పిల్లలు, మోపెడ్‌లు, లగేజీ ఆటోలు, బొలెరో వాహనాలను సమకూర్చి చేయూతనిచ్చిన టీఆర్‌ఎస్‌ సర్కారు, తాజాగా మత్స్యకార ఆడబిడ్డలకు మరో సువర్ణావకాశాన్ని కల్పిస్తున్నది. ముగ్గురు లేదా ఐదుగురు మహిళా సభ్యులతో కూడిన బృందానికి రూ.10లక్షల విలువ జేసే సంచార మత్స్య విక్రయ వాహనాలను 60శాతం సబ్సిడీతో అందించే ఏర్పాట్లు చేసి ఈ నెల 28లోగా దరఖాస్తులకు గడువిచ్చింది. వాహనంలో లైవ్‌ చేపలే కాకుండా  కూర, ఫ్రైలు సైతం తయారు చేసి అమ్మే వసతులు కల్పించింది.

హన్మకొండ చౌరస్తా, జనవరి 21:  మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నది. కులవృత్తులకు అండగా ఉంటూనే సంబంధిత వర్గాల మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది. మత్స్యకారులకు ఇప్పటికే ఉచిత చేప పిల్లలు, మోపెడ్‌లు, లగేజీ ఆటోలు, బొలేరో వాహనాలను సమకూర్చి చేయూతనిచ్చిన టీఆర్‌ఎస్‌ సర్కారు, తాజాగా మత్స్యకార ఆడబిడ్డలకు రూ.10లక్షల విలువ జేసే సంచార మత్స్య విక్రయ వాహనాలను 60శాతం సబ్సిడీతో అందిస్తున్నది. మత్స్యకార మహిళలు చేపల రవాణా, విక్రయాలు చేసుకునేందుకు వీలుగా ఈ వాహనాలు సమకూరుస్తున్నది. దీంతో చేపలను నమ్ముకుని బతుకుతున్న మత్స్యకారుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. 

60 శాతం సబ్సిడీతో..

సంచార మత్స్య విక్రయ వాహనం యూనిట్‌ విలువ రూ.10 లక్షలు కాగా ఇందులో మత్స్యశాఖ 60శాతం సబ్సిడీ ఇవ్వనుంది. ఈ నెల 28లోగా సంబంధిత జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. ఎంపికైన లబ్ధిదారులు 60 శాతం సబ్సిడీ పోను 40శాతం కింద రూ.4 లక్షలను ఫిబ్రవరి 5లోగా జిల్లా మత్స్యశాఖ అధికారికి డీడీ రూపంలో చెల్లించాలి.

వాహనంలో సౌకర్యాలు

సంచార మత్స్య విక్రయ వాహనంలో వివిధ సౌకర్యాలు కల్పించారు. ఒక కంటెయినర్‌, కిచెన్‌ ప్లాట్‌ ఫాం విత్‌ బర్నర్స్‌, సింక్‌, డీప్‌ ఫ్రీజర్‌, ఐసొలేటెడ్‌ ఐసీ బాక్‌, థర్మోకోల్‌ బాక్‌, వేయింగ్‌ బ్యాలెన్స్‌, డిస్‌ ప్లే యూనిట్‌, వాటర్‌ ట్యాంక్‌, ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్‌, బ్యాకప్‌ బ్యాటరీ, పవర్‌ కనెక్షన్స్‌, వేస్ట్‌ బిన్‌-2 (వెట్‌ అండ్‌ డ్రై) ఏర్పాటు చేశారు. వీటిలో లైవ్‌ ఫిష్‌తో పాటు, చేపల కూర, చేపల ఫ్రై కూడా చేసి అమ్ముకునే వసతులు ఉన్నాయి. కొత్త ఒరవడితో చేపలు అమ్మేందుకు ఈ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చారు. నగరాలు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లు, డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో చేపలు అమ్ముకునేందుకు వీలుంటుంది. పరిశుభ్రమైన వాతావరణంలో సంచార వాహనాన్ని ఏర్పాటు చేసుకుని విక్రయాలు చేపట్టవచ్చు. 

మహిళలు సద్వినియోగం చేసుకోవాలి

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. అనేక పథకాలతో వారిని ఆదుకుంటున్నది. 60శాతం సబ్సిడీతో సంచార మత్స్య విక్రయ వాహనాలను అందిస్తు న్నాం.  ఒక్కో వాహనానికి లబ్ధిదారులు రూ.6 లక్షలు రాయితీపోను రూ.4 లక్షలు చెల్లించాలి. చేపల బిజినెస్‌లో ఆసక్తి, అనుభవం ఉన్నవారు, 18 నుంచి 50ఏళ్ల లోపువారు అర్హులు. వాహనంలో 11 రకాల వస్తువులతో కూడిన సౌకర్యాలు కల్పించారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 

-డాక్టర్‌ విజయభారతి, జిల్లా మత్స్యశాఖ అధికారి, వరంగల్‌ అర్బన్‌ 

ఇవీ అర్హతలు..

 • ప్రతి యూనిట్‌ను వేర్వేరు కుటుంబాలకు చెందిన ముగ్గురు లేదా ఐదుగురు మహిళలతో ఏర్పడిన బృందానికి ఇస్తారు. సభ్యులకు చేపల వ్యాపారం, మార్కెటింగ్‌, ప్రాసెసింగ్‌, విలువ పెంచే ఉత్పత్తుల తయారీ, చేపల ఆహార వ్యాపారంలో ముం దస్తు అనుభవం కలిగి ఉండాలి. లేదా ఇందులో శిక్షణ పొందేందుకు సిద్ధంగా ఉండాలి.
 • ఒక వార్డులో ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ విధానంలో ఎంపిక చేస్తారు. ఆ సమయంలో హాజరైన దరఖాస్తుదారుల సమక్షంలోనే కమిటీలు ఎంపిక చేస్తాయి.
 • గ్రూపులో ఒకరు మొదటి, మరొకరు రెండో లీడర్‌గా ఉండాలి. వారిద్దరూ జాయింట్‌ బ్యాంకు ఖాతా తెరిచి నిర్వహించాలి.
 • గ్రూపులో ఒకరికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. ఎవరికీ లేకుంటే డ్రైవింగ్‌ లైసెన్స్‌ (ఎల్‌ఎంవీ) ఉన్న  డ్రైవర్‌ను నియమించుకోవచ్చు.
 • గ్రూపు సభ్యుల వయస్సు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి
 • గ్రూపులోని వారంతా ఒకే జిల్లాలో నివసించేవారై ఉండాలి. నిరుద్యోగులు లేదా స్వయం ఉపాధి పొందుతున్నవారే అర్హులు
 • లబ్ధిదారులు శిక్షణ పొందేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రాసెస్‌ చేసిన చేపలు, తినేందుకు సిద్ధంగా ఉన్న ఉత్పత్తుల అమ్మకం చేపడుతామని లిఖితపూర్వకంగా ఇవ్వాలి. 
 • ఇచ్చిన ప్రయోజనానికి వాహనాన్ని వాడకుంటే అది పంపిణీ చేసిన తేదీ నుంచి 12 శాతం వడ్డీ, సబ్సిడీ రికవరీ చేస్తారు. చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకుంటారు.  
 • మత్స్యశాఖ లేదా మరే ఇతర శాఖల పథకాల కింద ఇలాంటి యూనిట్లను ఒకరు లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తుదారులు పొంది ఉంటే, గ్రూపునకు అర్హత ఉండదు.
 • లబ్ధిదారుల వాటా గ్రూపు స్వయంగా చెల్లించవచ్చు లేదా ఏ బ్యాంకు నుంచైనా రుణం పొందవచ్చు. కానీ, వాహనాన్ని బ్యాంకుకు హైపోథికేట్‌ (కుదువ తరహా) చేయరాదు. 
 • వాహనాన్ని ఐదేళ్ల పాటు మత్స్యశాఖ సౌజన్యంలో నిర్వహించాలి. 

VIDEOS

logo