గురువారం 25 ఫిబ్రవరి 2021
Warangal-city - Jan 21, 2021 , 00:57:22

సేద్యానికి సాంకేతికత ఎంతో అవసరం

సేద్యానికి సాంకేతికత ఎంతో అవసరం

  • నిట్‌లో పరిశోధనలను క్షేత్రస్థాయికి తీసుకొస్తాం
  • త్వరలో డ్రోన్‌ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌
  • నిట్‌ డైరెక్టర్‌ రమణారావు
  • ఆకట్టుకున్న వ్యవసాయ విద్యార్థుల ప్రదర్శనలు

వరంగల్‌ సబర్బన్‌, జనవరి 20 : ప్రస్తుతం ఒడిదుడుకులు ఎదుర్కొంటు న్న వ్యవసాయరంగానికి సాంకేతిక సాయం ఎంతో అవసరమని నిట్‌ డైరెక్టర్‌ ఎన్‌.వీ.రమణారావు అభిప్రాయపడ్డారు. ఏరువాక, ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ములుగు రోడ్‌లోని ప్రాంతీయ వ్యవసాయక్షేత్రంలో వ్యవసాయ విద్యార్థులకు పని అనుభవ ముగింపు కార్యక్రమం బుధవారం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఏడీఆర్‌ ఉమారెడ్డి వ్యవసాయానికి ఇంజినీరింగ్‌ అవసరాన్ని వివరించారు. శాస్త్ర సాంకేతిక రంగం అన్ని అంశాల్లో శరవేగంగా ముందుకు వెళ్తుంటే వ్యవసాయం మాత్రం వెనుకబడిందన్నారు. దీనికి దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన నిట్‌ సాంకేతికంగా సాయం చేసేందుకు ముందుకురావాలని కోరారు. దీనిపై నిట్‌ డైరెక్టర్‌ స్పందిస్తూ నిట్‌ ఆధ్వర్యంలో వ్యవసాయంపై అనేక రకాల పరిశోధనలు చేస్తున్నామన్నారు. ల్యాబ్‌లో ఉన్న ఈ పరిశోధనలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. రైతులకు ఎలాంటి అవసరాలున్నయో చెబితే తదనుగుణంగా సాంకేతికను వృద్ధి చేసి అందుబాటులోకి తెస్తామని వివరించారు. అలాగే త్వరలో వరంగల్‌ నిట్‌లో దేశంలోనే మొదటిసారి డ్రోన్‌ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీ ఎక్స్‌టెన్షన్‌ డైరెక్టర్‌ శామ్యూల్‌ మాట్లాడుతూ వ్యవసాయ విద్యను పూర్తి చేసుకుంటున్న విద్యార్థులు కేవలం ఉద్యోగం కోసమే కాకుండా సరికొత్త ఆవిష్కరణల దిశగా ఆలోచించాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి ఉషాదయాల్‌ మాట్లాడుతూ విలువ ఆధారిత ఉత్పత్తుల వైపు రైతులు ఆలోచనలు చేయాలని అన్నారు. చిరుధాన్యాలను పండించేందుకు రైతులు సిద్ధపడాలని సూచించారు. జాతీయ ఆహార భద్రత మిషన్‌లో భాగంగా రైతులకు మినీ రైస్‌ మిల్లులను సబ్సిడీపై ఇవ్వనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం అందించనున్న మరిన్ని అభివృద్ధి పథకాలను వినియెగించుకోవాలని కోరారు. నాబార్డు ఏజీఎం చంద్రశేఖర్‌ మాట్లాడుతూ సబ్సిడీ రుణాలను రైతులు సద్వినియోగం చేసుకొని, ఆర్థికాబివృద్ధి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల డీన్‌ బలరాం, డాట్‌ కో ఆర్డినేటర్‌ నర్సయ్య, ఏడీఏ దామోదర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన పలు కంపెనీ స్టాళ్లు రైతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఆకట్టుకున్న ‘రావెప్‌'

ములుగు రోడ్‌లోని వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో బుధవారం వ్యవసాయ డిగ్రీ విద్యార్థులకు రావెప్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌, జగిత్యాల, పాలెం, వరంగల్‌ వ్యవసాయ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు సేద్యపు పనుల పరిణామాలను ఆకృతుల రూపంలో ప్రదర్శించారు. తేమ సంరక్షణకు మల్చింగ్‌ అందులో రకాలు, అంతర పంటలు వాటి సరళీకరణ, పుట్ట గొడుగుల పెంపకం, నీటి పారుదలకు సంబంధించిన పలు పద్ధతులు, పంట రక్షణకు సోలార్‌ కంచె, మక్కజొన్నలో జంట సాళ్ల సాగు, వరి నాట్లలో సరికొత్త పద్ధతులు, కూరగాయల సాగులో ట్రెల్లింగ్‌ విధానాలపై విద్యార్థులు స్వయంగా చేసిన నమూనాలు రైతులను ఆకర్శించాయి.


VIDEOS

logo