శనివారం 06 మార్చి 2021
Warangal-city - Jan 17, 2021 , 02:15:41

‘హాల్‌మార్క్‌' నిర్వాహకుల ఇష్టారాజ్యం

‘హాల్‌మార్క్‌' నిర్వాహకుల ఇష్టారాజ్యం

  • నగల తనిఖీల పేరుతో వ్యాపార లావాదేవీల నిర్వహణ
  • నగరంలో జోరుగా ఆభరణాల కొనుగోళ్లు, అమ్మకాలు

వరంగల్‌ చౌరస్తా, జనవరి 16 : బంగారంతో తయారు చేసిన వస్తువుల నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేసే హాల్‌మార్క్‌ సెంటర్లు నిబంధనలకు నీళ్లొదులుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. బంగారం అమ్మకాలు, కొనుగోలు వ్యాపార కేంద్రాలుగా తయారవుతున్నాయి. వరంగల్‌ నగర పరిధిలో ఐదు హాల్‌ మార్కింగ్‌ కేంద్రాలున్నాయి. హాల్‌ మార్కింగ్‌ సెంటర్లు నాణ్యతా ప్రమాణాల విషయాలను పక్కనపెట్టి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. నిబంధనల ప్రకారం బంగారం, వెండి, ప్లాటినం లాంటి లోహాలతో తయారు చేసిన వస్తువులు, ఆభరణాల నాణ్యత, ప్రమాణాల పరిశీలన మాత్రమే చేయాల్సిన హాల్‌మార్క్‌ సెంటర్ల నిర్వాహకులు సాధారణ ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

హాల్‌మార్క్‌ సెంటర్‌ అంటే..

బంగారం, వెండి, ప్లాటినం లాంటి ఖరీదైన లోహాలతో తయారు చేసిన వస్తువులు, ఆభరణాల నాణ్యతను తెలియజేయడానికి పరీక్షలు నిర్వహించాలి. పరీక్షించిన వస్తువులో ఏ లోహపు శాతం ఎంత ఉంది అనే విషయాన్ని ధ్రువీకరించే అనుమతి కలిగి ఉండేదే హాల్‌మార్క్‌ సెంటర్‌. ఈ సెంటర్లు బీఐఎస్‌ (బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌) సంస్థ ద్వారా అనుమతి కలిగి ఉంటాయి. నిబంధనలకు లోబడి ఆభరణాలు, వస్తువుల్లో కలిపిన లోహాలు ఎంత శాతం ఉన్నాయో ధ్రువీకరించి సర్టిఫికెట్‌ అందజేయాలి. దీని ఆధారంగా లోహాల విలువ నిర్ణయిస్తారు. 

వ్యాపార కేంద్రాలుగా..

హాల్‌మార్క్‌ సెంటర్లు బంగారం, వెండి అమ్మకం కేంద్రాలుగా తయారవుతున్నాయి. బీఐఎస్‌ నిబంధనల ప్రకారం లోహాల తనిఖీలు మాత్రమే నిర్వహించాల్సిన కేంద్రాలు బంగారం కొనుగోళ్లు, అమ్మకాలు సైతం నిర్వహిస్తున్నాయి. నాణ్యతా ప్రమాణాల తనిఖీల పేరుతో అనుమతి తీసుకుని, తక్కువ సంఖ్యలో లోహాల గుర్తింపు, తక్కువ నైపుణ్యం కలిగిన యంత్రాలతో హాల్‌మార్క్‌ సెంటర్లను ఏర్పాటు చేసి బంగారం, వెండి తదితర లోహాల వ్యాపారం నిర్వహిస్తున్నారు. 

అధికారులు స్పందించాలి..

అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకే వస్తువును పరీక్షించిన రెండు సెంటర్లు వేర్వేరు నివేదికలు అందించడం నిర్వాహకుల వ్యాపార ప్రావీణ్యానికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి బంగారం, వెండి అమ్ముతున్న హాల్‌మార్క్‌ సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

నిబంధనలు పాటించడం లేదు..

వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన బంగారం నాణ్యత పరీక్షించే హాల్‌మార్క్‌ సెంటర్లు నిబంధనలు పాటించడం లేదు. నిబంధనల ప్రకారం అనుమతి పొందినప్పుడు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న లోగో (ముద్ర) వారు పరీక్షించిన బంగారు వస్తువుపై ముద్రించాలి. అలా కాకుండా ఇష్టారాజ్యంగా నాణ్యతలు చూపిస్తున్నారు. ఇలా చిన్న చిన్న తేడాలతోనే వేల రూపాయలు వినియోగదారులు కోల్పోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలి. 

- గజ్జెల సతీశ్‌, ఖిలావరంగల్‌, వినియోగదారుడు


VIDEOS

logo