గురువారం 25 ఫిబ్రవరి 2021
Warangal-city - Jan 17, 2021 , 02:15:44

మహమ్మారి అంతానికి నాంది

మహమ్మారి అంతానికి నాంది

  •  ఉమ్మడి జిల్లాలో వైద్య, అంగన్‌వాడీ, పారిశుధ్య సిబ్బందికి తొలిడోసు
  • ఆరు జిల్లాల్లో 589మందికి టీకా
  • మొదటి రోజు విజయవంతంగా కార్యక్రమం
  • మూడుచోట్ల ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
  • మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రాథోడ్‌
  • ఆయా నియోజకవర్గాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు
  • టీకా వేసుకున్నవారిలో హర్షాతిరేకం
  • కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ షురూ

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి అంతానికి నాంది పడింది. ఉమ్మడి జిల్లాలో కొవిడ్‌-19 పీడ విరుగడయ్యే అద్భుత ఘట్టం శనివారం నుంచి షురువైంది. వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, మహబూబాబాద్‌, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని ప్రభుత్వ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్‌ అధికారికంగా మొదలు కాగా, మూడు చోట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రాథోడ్‌, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు కార్యక్రమాన్ని ప్రారంభించగానే ప్రజల్లో భరోసా నెలకొంది. తొలిరోజు ఆరు జిల్లాల పరిధిలో 589 మంది వైద్య,  అంగన్‌వాడీ, పారిశుధ్య సిబ్బందికి విజయవంతంగా టీకా వేయగా వారిలో ఆనందం రెట్టించింది.

- వరంగల్‌, జనవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)

కరోనా మహమ్మారి పతనానికి నాంది పడింది. ఉమ్మడి జిల్లాలో కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ శనివారం నుంచి అధికారికంగా ప్రారంభమైంది. కరోనా ఉధృతిలోనూ రోగులకు సేవలందించిన డాక్టర్లు, పారా మెడికల్‌ సిబ్బంది సహా పారిశుధ్య కార్మికులకు మొదట టీకాను వేసి తెలంగాణ ప్రభుత్వం అరుదైన గౌరవం ఇచ్చింది. వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, మహబూబాబాద్‌, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని ప్రభుత్వ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ మొదలైంది. కరోనా విపత్కర సమయంలో ప్రజల బాగు కోసం అహర్నిషలూ కష్టపడి పని చేసిన వైద్య సిబ్బందికి, అంగన్‌వాడీ కార్యకర్తలకు, పారిశుధ్య కార్మికులకు తొలిరోజు వ్యాక్సిన్‌ వేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి టీకా వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి రోజు ఆరు జిల్లాల్లో కలిపి 589 మందికి వ్యాక్సిన్‌ వేశారు. ఒక్కొక్కరికి 0.5 మిల్లీ లీటరు చొప్పున డోసు ఇచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఎలాంటి సమస్యలు లేకుండా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మొదటిరోజు విజయవంతమైందని పేర్కొన్నారు.  

అర్బన్‌లో 180మందికి..

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని ఎంజీఎం వైద్యశాల, పోచమ్మకుంట, దేశాయిపేట అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, హసన్‌పర్తి, వంగర, కమలాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకా వేసే కార్యక్రమం మొదలైంది. ఒక్కో కేంద్రంలో 30 మందికి చొప్పున ఆరు కేంద్రాల్లో కలిపి 180 మంది వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లకు టీకాలు ఇచ్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఎంజీఎం దవాఖానలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, కమిషనర్‌ పమేలా సత్పతి, డీఎంహెచ్‌వో లలితాదేవి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి టీకాను ఎంజీఎంలో సిబ్బంది సిద్ధయ్యాచారికి ఇచ్చారు. వంగర పీహెచ్‌సీలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, పోచమ్మకుంట అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయభాస్కర్‌, కమలాపూర్‌లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, హసన్‌పర్తి పీహెచ్‌సీలో ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, దేశాయిపేట అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

రూరల్‌లో 104మందికి

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో శనివారం 104 మందికి కరోనా వ్యాక్సినేషన్‌ చేశారు. కలెక్టర్‌ హరిత ఆత్మకూరు పీహెచ్‌సీలో టీకా కార్యక్రామన్ని ప్రారంభించారు. పీహెచ్‌సీలో డాక్టర్‌ ప్రసాద్‌కు మొదటి వ్యాక్సిన్‌ డోస్‌ ఇచ్చారు. వర్ధన్నపేట సీహెచ్‌సీలో ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు కార్యక్రమాన్ని మొదలుపెట్టగా, డాక్టర్‌ సారంగపాణికి ఇక్కడ మొదటి వ్యాక్సిన్‌ ఇచ్చారు. పరకాలలోఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొనగా, మొదటి టీకాను డాక్టర్‌ సంజీవయ్యకు ఇచ్చారు. నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రారంభించగా వ్యాక్సిన్‌ను డాక్టర్‌ వంశీధర్‌కు ఇచ్చారు. జిల్లాలో 90 మంది వైద్య సిబ్బందికి, 14 మంది అంగన్‌వాడీ వర్కర్లకు మొత్తంగా 104మందికి వ్యాక్సిన్‌ వేశారు. 

మహబూబాబాద్‌లో 115

మహబూబాబాద్‌ జిల్లాకేంద్రంతో పాటు కంబాలపల్లి, తొర్రూరు, డోర్నకల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కలిపి 115 మందికి టీకా వేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌, తొర్రూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. మంత్రి సత్యవతి, ఎంపీ మాలోతు కవిత, జడ్పీ చైర్‌పర్సన్‌ అంగోతు బిందు, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, కలెక్టర్‌ గౌతమ్‌, ఎస్పీ కోటిరెడ్డితో కలిసి మహబూబాబాద్‌ జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ప్రధానమంత్రి ప్రసంగ కార్యక్రమాన్ని చూశారు.   డోర్నకల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్‌, కంబాలపల్లి పీహెచ్‌సీలో మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ ప్రారంభించారు. 

జనగామలో 60మందికి.. 

జనగామ జిల్లా పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి, జిల్లా దవాఖానలో మండలి చీఫ్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్‌ నిఖిల టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక్కో కేంద్రంలో 30 మంది చొప్పున మొత్తం 60 మందికి టీకా వేశారు. 

ములుగులో 40మందికి 

ములుగు జిల్లాలోని రెండు కేంద్రాల్లో వ్యాక్సిన్‌ ప్రక్రియ చేపట్టారు. ములుగు, ఏటూరునాగారం దవాఖానల్లో వైద్య సిబ్బందికి, పారిశుధ్య సిబ్బందికి వ్యాక్సిన్‌ వేశారు. ఒక్కో కేంద్రంలో  20చొప్పున మొత్తం 40 మందికి వ్యాక్సిన్‌ వేశారు. ములుగు దవాఖానలో జడ్పీ చైర్మన్‌ కే జగదీశ్‌, అదనపు కలెక్టర్‌ ఆదర్శ సురభి, ఏటూరునాగారం దవాఖానలో జడ్పీ అధ్యక్షుడు జగదీశ్‌, ఐటీడీఏ పీవో హన్మంతు జెండగే వ్యాక్సిన్‌ ప్రక్రియను ప్రారంభించారు. అంతటా కార్యక్రమం విజయవంతం కావడంతో వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.   

ఇప్పుడు ధైర్యంగా ఉంది..

చిట్యాల,  జనవరి 16: కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల ఇప్పుడు ధైర్యంగా ఉంది. నాకు ఇదివరకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చి హోం క్వారంటైన్‌లో ఉన్నా. మందులు వాడాను పెద్దగా ఇబ్బందుమీ అనిపించలేదు. కానీ అప్పటినుంచి నన్ను చులకనగా చూడడం కొంత బాధనిపించింది. ఇప్పుడు ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తుందని తెలిసి వేసుకోవడానికి ధైర్యం చేశా. అరగంటలో అయిపోయింది. మళ్లీ 28 రోజుల తర్వాత సెకండ్‌ డోస్‌ వేస్తరట. టీకా వేసుకునే వారు భయపడే పనిలేదు. నా లాగా నిశ్చింతంగా ఉండండి.

- జూలూరి సాయిశ్రీనాథ్‌, 

డాటా ఎంట్రీ ఆపరేటర్‌-చిట్యాల సివిల్‌ హాస్పిటల్‌ 

ఏమైతదోనని భయపడ్డా..

చిట్యాల, జనవరి 16 : వ్యాక్సిన్‌ అనగానే మొదట భయపడ్డా. వేసుకుంటే ఏమైతదోనని కొంత టెన్షన్‌ ఉండేది. వేసుకొని బయటకు వచ్చిన తర్వాత చాలామంది అడిగారు ఏమైనా అయిందా అని. అసలేం కాలేదు.. ధైర్యంగా ఉండండి అని నేనే చెప్పాను. వ్యాక్సిన్‌ వేసుకోవడానికి దవాఖానలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా వెళ్లి టీకా వేసుకోండి. వాళ్లు, వీళ్లు చెప్పిన మాటలు విని కంగారు పడకండి.

-  దూలం కృష్ణ, ల్యాబ్‌ అసిస్టెంట్‌, 

చిట్యాల సివిల్‌ హాస్పిటల్‌ దుష్ప్రచారం నమ్మకండి..

నర్సంపేట, జనవరి 16 : వ్యాక్సిన్‌ వేసుకునేందుకు ప్రజలెవరూ భయపడవద్దు. వ్యాక్సిన్‌ రాక ముందు ఏదో అవుతుందని చాలా ప్రచారం జరిగింది. కానీ, అలాంటివేవీ నమ్మకండి. నేను నర్సంపేట ఏరియా హాస్పిటల్‌లో వ్యాక్సిన్‌ తీసుకున్నా. వ్యాక్సిన్‌ ఇచ్చిన తర్వాత దద్దుర్లు కానీ, జ్వరం కానీ రాలేదు. ఎప్పటిలాగే ఉన్నా. వ్యాక్సిన్‌ ఇవ్వగానే ఫిజీషియన్‌ మందులు రెడీగా ఉంచారు. ఎలాంటి ఇబ్బంది కాలేదు. చాలా రిలాక్స్‌గా ఉన్నా. కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.

- డాక్టర్‌ గిరిప్రసాద్‌  

అపోహలు తొలగించేందుకే..

పరకాల, జనవరి 16 : పరకాల సీహెచ్‌సీ పరిధిలో మొదట కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవడం సంతోషం గా ఉంది. వ్యాక్సినేషన్‌పై ఎలాంటి అపోహలు వద్దు. దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. టీకా పూర్తిగా సురక్షితమైనది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలి. వైద్యుడిగా, సివిల్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌గా వైద్య సిబ్బంది, ప్రజల్లో ఉన్న భయం పోగొట్టేందుకు నా బాధ్యతగా మొదటి టీకా వేసుకున్నాను.

- డాక్టర్‌ ఆకుల సంజీవయ్య, 

సూపరింటెండెంట్‌, సివిల్‌ హాస్పటల్‌, పరకాల వైరస్‌ భయం పోయింది..

పాలకుర్తి రూరల్‌, జనవరి 16 : మొన్నటివరకు ఎవరికి కరోనా ఉందోనని భయం ఉండేది. కానీ ఇప్పుడు వ్యాక్సిన్‌ తీసుకురావడం శుభపరిణామం. మొదట టీకా నేను వేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ టీకాతో కొండంత ధైర్యం వచ్చింది. వైరస్‌ భయం కూడా తగ్గింది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం వల్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.

- చిలుకమారి ఆంజయ్య, పాలకుర్తి ప్రభుత్వ దవాఖాన అటెండర్‌ 

ధైర్యంగా వైద్యం చేస్తాం..

వర్ధన్నపేట, జనవరి 16 : వ్యాక్సిన్‌ వేయించుకోవడం వల్ల ఇప్పుడు ధైర్యంగా వైద్యం చేస్తాం. ఇప్పటివరకు కరోనా వస్తుందేమోనని భయంతో జాగ్రత్తలు తీసుకుంటూ రోగులకు పరీక్షలు చేశాం. ఇప్పుడు టీకా అందుబాటులోకి రావడం మొదట వైద్యులకు ఇస్తున్నందున ఎలాంటి అపోహలు అవసరం లేదు. బీపీ, షుగర్‌, ఏమైనా ఇతర ఆరోగ్య సమస్యలుంటే వ్యాక్సిన్‌ వేయరు. మిగతా వారు నిశ్చింతగా వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చు.

- డాక్టర్‌ సారంగపాణి 

అనుమానాలు వద్దే వద్దు

పాలకుర్తి రూరల్‌, జనవరి 16 : కరోనాను అంతం చేసేందుకు ప్రభుత్వాలు వ్యాక్సిన్‌ కనిపెట్టాయి. టీకాపై అనుమానాలు వద్దే వద్దు. వ్యాక్సిన్‌తో వైరస్‌ పూర్తిగా కట్టడి అవుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదటి దశలో మేము(వైద్య సిబ్బంది) వ్యాక్సిన్‌ తీసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను కొవిడ్‌ బారిన పడి కోలుకున్నా. నాకు కరోనా వచ్చిన సమయంలో చాలా భయమేసింది. టీకా తీసుకున్నప్పటి నుంచి నిశ్చింతగా ఉన్నా.

- ప్రమీల, హెడ్‌ నర్స్‌, పీహెచ్‌సీ, పాలకుర్తి 

భరోసాతో బతకొచ్చు..

మహబూబాబాద్‌ : టీకా వేసుకుంటే ఏమౌతుందోననే అపోహలు ఉన్నా నేనేం భయపడలేదు. టీకా వేసుకున్నాక ఎలాంటి ఇబ్బందులు కలుగలేదు. టీకాతో ప్రజలందరూ భరోసాతో బతకొచ్చు. కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం వ్యాక్సిన్‌ తేవడం మంచి పరిణామం. ప్రజలకు సేవలందిస్తున్న వైద్యులకు మొదట టీకా వేయడం చాలా సంతోషం.

- వెంకట్రాములు, డాక్టర్‌

అందరికీ అవగాహన కల్పిస్తా..

వరంగల్‌ చౌరస్తా, జనవరి 16 : కరోనా వ్యాక్సిన్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది. టీకాను ముందుగా ఎంజీఎం సిబ్బందికి ఇవ్వడాన్ని ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపుగా భావిస్తున్నా. సెకండ్‌ డోస్‌ తీసుకునేంత వరకు డాక్టర్ల సూచనలు పాటిస్తా. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొదట నాకే వ్యాక్సిన్‌ వేసిన వైద్యులకు ధన్యవాదాలు. వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నా వంతు కృషిచేస్తా.

- సిద్ధయ్యాచారి, ఎంజీఎం కార్పెంటర్‌ 

 ఇగ భయం లేదు

నేను హన్మకొండ పోచమ్మకుంట దవాఖానల వాచ్‌మన్‌గ పనిజేస్త. ఈ కరోనా పాడుగాను ఎట్లచ్చిందో ఏమో గాని, అందర్ని భయంల పడేసింది. దీని పీడ ఎట్ల పోవాల్నని దిగులు పడేది. ఎవలకు సోకిందో, ఎక్కన్నుంచి అంటుకుంటదోనని బయటకు పోదామంటెనే గజ్జుమనేది. మందిల తిరగాల్నంటే అనుమానముంటుండె. ఇప్పుడు టీకా ఏస్కున్న. ఇగ భయం లేదు. ధైర్యంగ మెదులచ్చు. సూదేసుకుంటె ఏమైతదోనని శానమంది భయపెట్టిన్రు. ఏంగాలె.  

- పోచమ్మకుంట యూహెచ్‌సీలో వ్యాక్సిన్‌ వేసుకున్న అనంతరం చిరునవ్వుతో వాచ్‌మన్‌ కే చందు.. 


VIDEOS

logo