మంగళవారం 02 మార్చి 2021
Warangal-city - Jan 16, 2021 , 01:15:23

కొత్తకొండ జనసంద్రం

కొత్తకొండ జనసంద్రం

  • వీరభద్రుడి సన్నిధికి పోటెత్తిన భక్తజనం
  • ఆలయంలో కొనసాగుతున్న రద్దీ
  • కోరమీసాలు సమర్పించి భక్తుల మొక్కులు
  • ఆకట్టుకున్న కొత్తపల్లి ఎడ్లబండ్ల ప్రదక్షిణ

ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మకరసంక్రాంతిని పురస్కరించుకుని గురు, శుక్రవారాల్లో స్వామివారి సన్నిధి కిక్కిరిసిపోయింది. పండుగ రోజున ఆలయం చుట్టూ కొత్తపల్లి గ్రామస్తుల ఎడ్లబండ్ల ప్రదక్షిణ కనులపండువలా సాగింది. జాతరలో రద్దీ కొనసాగుతుండగా, కోరమీసాలు, గుమ్మడికాయ మొక్కులు సమర్పించి ‘కోరిన కోర్కెలు తీర్చు వీరన్నా’ అంటూ భక్తజనం ప్రణమిల్లుతున్నది. 

- భీమదేవరపల్లి, జనవరి 15

వీరభద్రుడి సన్నిధికి పోటెత్తిన భక్తజనం

మకర సంక్రాంతిని పురస్కరించుకుని వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండలో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు కనులపండువలా జరుగుతున్నాయి. పండుగ సందర్భంగా గురు, శుక్రవారాల్లో స్వామివారి సన్నిధికి భక్తజనం పోటెత్తింది. గురువారం మకర సంక్రాంతి పర్వదినం కావడంతో లక్షలాది మంది భక్తులు వేకువజామునే స్వామివారిని దర్శించుకునేందుకు గంటల తరబడి క్యూకట్టారు. శీఘ్రదర్శనం లైన్లు సైతం కిక్కిరిసిపోయాయి. జాతరలోని దుకాణాలు, రంగులరాట్నం, సర్కస్‌ తదితర ప్రాంతాలన్నీ రద్దీగా కనిపించాయి. ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఈవో రజినీకుమారి, సిబ్బంది పూర్తి ఏర్పాట్లు చేశారు.

పీవీ ఇంటినుంచి రథం

వంగరలో మాజీ ప్రధాని, దివంగత పీవీ నర్సింహారావు ఇంటి నుంచి కొత్తకొండకు ఎడ్లబండి రథం మకర సంక్రాంతి రోజున వెళ్లడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ ఏడాది సైతం ఎడ్లబండి రథాన్ని అందంగా అలంకరించి పీవీ తనయుడు ప్రభాకర్‌రావు, పీవీ సోదరుడి కుమారుడు పీవీ మదన్‌మోహ న్‌రావుతో కలిసి వెళ్లగా గ్రామస్తుల శివసత్తుల నృత్యాలు, మహిళల కోలాటాల నడుమ కొత్తకొండకు సాగనంపారు.  

గుట్టపైన స్వయంభూ ఆత్మలింగానికి పూజలు

గుట్టపైన కొలువుదీరిన వీరభద్రస్వామి ఆత్మలింగం ఆలయంలో దివ్యాలంకరణ పూజలు జరిగాయి. గుట్టపైకి వెళ్లి భక్తులు పూజలు చేశారు.  ప్రకృతి రమణీయతను ఆస్వాదించేందుకు యువకులు పోటీపడ్డారు. 

మేకల బండి ప్రదక్షిణ..

సంక్రాంతి పర్వదినం రోజున వేకువజామునే ఆనవాయితీ ప్రకారం వేలేరుకు చెందిన యాదవులు డప్పుచప్పుళ్లు, శివసత్తుల నృత్యాల నడుమ మేకలబండితో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం ఎడ్లబండ్లతో వచ్చిన భక్తులు ప్రదక్షిణ చేసి స్వామివారికి మొక్కులు సమర్పించుకున్నారు. 

కొత్తకొండకు కొత్తపల్లి రథాలు

బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి అన్న చందంగా కొత్తపల్లి నుంచి కొత్తకొండకు తరలివచ్చిన ఎడ్లబండ్ల రథాలు ఆకట్టుకున్నాయి. అందంగా అలంకరించిన సుమారు 56 ఎండ్లబండ్ల ప్రదక్షిణను తిలకిం చేందుకు ప్రజలు దారుల వెంట బారులు తీరారు.  

మహారుద్రాభిషేకం 

స్వామివారికి ఉత్తరాయణ పుణ్యకాల పూజ చేసిన అనంతరం ఆవుపాలు, నవరసాలతో అభిషేకం, బిల్వార్చన, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేశారు. రుద్రయాగం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేసి, విశేష దర్శనం చేయించారు. యాగశాలలో జ్యోతిర్లింగార్చన చేశారు. 365 దీపాలతో వేదమంత్రోచ్ఛాణల మధ్య పూజలు చేశారు.

స్వామివారిని దర్శించుకున్న పల్లా 

బ్రహ్మోత్సవాలకు రైతుబంధు సమితి రాష్ట్ర కన్వీనర్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సతీ సమేతంగా హాజరై పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. కోడె ప్రదక్షిణ, గుమ్మడికాయ మొక్కులు చెల్లించుకున్నారు. ఈవో రజినీకుమారి శేషవస్ర్తాలు సమర్పించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. పల్లాతో వేలేరు జడ్పీటీసీ చాడ సరితా విజేందర్‌రెడ్డి ఉన్నారు. ములుకనూరు ఏకేవీఆర్‌ జూనియర్‌, డిగ్రీ కళాశాల విద్యార్థులు వలంటీర్లుగా భక్తులకు సేవలందించారు. ములుకనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్‌ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు కల్పించారు. జూదం, మట్కా, గుట్కా, గుడుంబా లేకుండా పూర్తిస్థాయిలో నియంత్రించారు.  

VIDEOS

logo