ఆదివారం 07 మార్చి 2021
Warangal-city - Jan 12, 2021 , 01:36:34

ఆయిల్‌పామ్‌ వేగంగా ఫామ్

ఆయిల్‌పామ్‌ వేగంగా ఫామ్

 • నూనెలోటు తీర్చేందుకు సర్కారు చర్యలు
 • కంపెనీల ఎంవోయూ ప్రక్రియ పూర్తి
 • ఈఎండీలు కూడా చెల్లించిన ఏజెన్సీలు
 • నర్సరీల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు
 • రూరల్‌ జిల్లాకు సంగెంలో స్థలం ఎంపిక
 • ఉమ్మడి జిల్లాలో 94,182 ఎకరాల్లో సాగు లక్ష్యం
 • త్వరలో రైతులకు స్టడీ టూర్లు
 • దక్షిణ అమెరికాలోని కోస్టారికా నుంచి మొక్కల దిగుమతి
 • తెనేరా రకం విత్తనం ఎంపిక
 • వెయ్యి ఎకరాలకో సలహాదారుగా బీఎస్సీ అగ్రికల్చర్‌ వ్యక్తి

దేశంలో వంట నూనెల లోటును పూడ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆయిల్‌ పామ్‌ తోటల పెంపకానికి ఉమ్మడి జిల్లాలో వేగంగా అడుగులు పడుతున్నాయి. అవసరానికి మించి ధాన్యం నిల్వలు ఉండడంతో వరికి ప్రత్యామ్నాయంగా పామాయిల్‌ను తెరపైకి తెచ్చిన సర్కారు, సాగు ఏర్పాట్లు సైతం చకచకా చేస్తున్నది.  ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 94 వేల 182 ఎకరాల్లో సాగు లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ఉద్యానవన శాఖ, అందుకు అనుగుణంగా రైతుల్లో ఆసక్తి కలిగేలా చర్యలు తీసుకుంటున్నది. ఇక్కడి వాతావరణానికి అనుకూలంగా ఉండేలా దక్షిణ అమెరికాలోని కోస్టారికా ప్రాంతానికి చెందిన తెనేరా రకం ఆయిల్‌పామ్‌ విత్తనాలను ఎంపిక చేసింది. జిల్లాల్లో ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీల ఏర్పాటుకు ఏజెన్సీల ఎంపిక సైతం పూర్తి కాగా, ఆయా కంపెనీలు ప్రభుత్వంతో ఎంవోయూ (మెమోరాండం ఆఫ్‌ అండర్‌ స్టాండింగ్‌) కుదుర్చుకున్నాయి. ఈ నెల 6వరకే ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్లు (ఈఎండీ) సైతం చెల్లించాయి.

- వరంగల్‌ సబర్బన్‌, జనవరి, 11

 • 28, 164 మహబూబాబాద్‌ గోద్రెజ్‌ ఆగ్రోవిట్‌ లిమిటెడ్‌
 • 7, 400 జనగామ3 ఎఫ్‌ ఆయిల్‌పాం ప్రైవేట్‌  
 • 23, 110 వరంగల్‌ రూరల్‌ రాం చరణ్‌ ఆయిల్‌ ఇండస్ట్రీస్‌
 • 5, 600 వరంగల్‌ అర్బన్‌ కేఎన్‌ బయో సైన్సెస్‌ ఇండియా
 • 10, 000 ములుగు చిద్రుపి టెక్నికల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌
 • 19, 900భూపాలపల్లి జీఎం రెడ్డి కాటన్‌ ఇండస్ట్రీస్‌bప్రైవేట్‌ లిమిటెడ్‌  లిమిటెడ్‌
 • పామాయిల్‌ సాగువైపు వడివడిగా అడుగులు

ఆయిల్‌పామ్‌ తోటల పెంపకానికి ఉమ్మడి జిల్లాలో వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే 94 వేల 182 ఎకరాల్లో సాగు లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ఉద్యానవన శాఖ, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నది. ఇక్కడి వాతావరణాన్ని తట్టుకునే దక్షిణ అమెరికాలోని కోస్టారికా ప్రాంతానికి చెందిన తెనేరా రకం ఆయిల్‌పామ్‌ విత్తనాలను ఎంపిక చేసింది. 

సంగెం వద్ద స్థల పరిశీలన ఫ్యాక్టరీ, నర్సరీ రెండూ

ఒకేచోట ఉండేలా కంపెనీ సన్నాహాలు

వరంగల్‌ రూరల్‌, జనవరి 11 (నమస్తేతెలంగాణ): వరంగల్‌రూరల్‌ జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగుకు సబంధించి రామ్‌చరణ్‌ ఆయిల్‌ ఇండస్ట్రీస్‌ కొద్ది రోజుల క్రితం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఉద్యానశాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు వెల్లడిం చారు. జిల్లాలో ఆయిల్‌ పామ్‌ సాగుకు 23వేలకుపైగా ఎకరాలను గుర్తించగా, విడుతలవారీగా ఏటా కొంతశాతం ఏరియాలో సాగు చేపట్టే అవకాశముంది. ఎంపిక చేసిన రైతులకు రామ్‌చరణ్‌ ఆయిల్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ మొక్కలను అందజేయాల్సి ఉంటుంది. నర్సరీ నిర్వహణకు కావాల్సిన భూమి కోసం కంపెనీ ప్రతినిధులు అన్వేషిస్తున్నారు. సంగెం మండల కేంద్రం వద్ద ఓ స్థలాన్ని కంపెనీ ప్రతినిధులు కొద్ది రోజుల క్రితం పరిశీలించారు. నర్సరీలో ఆరెడు నెలల పాటు మొక్కలు పెంచిన తర్వాత రైతులకు పంపిణీ చేస్తారు. వీటిని రైతులకు అందజేసిన తర్వాత మూడేళ్లలో ఫ్యాక్టరీని నెలకొల్పాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నర్సరీ ఏర్పాటు చేసే చోటే ఫ్యాక్టరీ నిర్మించే ఆలోచనతో సంగెం వద్ద ఒకేచోట 30ఎకరాల భూమిని కొనే పనిలో ఉన్నట్లు తెలిసింది. జిల్లా నుంచి దాదాపు వెయ్యి ఎకరాల్లో సాగు కోసం రైతుల నుంచి దరఖాస్తులు అందాయని ఉద్యానశాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు చెప్పారు. వారికి సాగు, దిగుబడులు, లాభాలను వివరించేందుకు ఖమ్మం జిల్లా అశ్వారావుపేట పర్యటనకు ఉద్యానశాఖ తరపున తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులను సొంత ఖర్చులతో అశ్వారావుపేట పర్యటనకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చెప్పారు. సంక్రాంతి తర్వాత ప్రజాప్రతినిధులతో టూర్‌ ఏర్పాటు చేస్తామని ఉద్యానశాఖ జిల్లా అధికారి ప్రకటించారు.  

ప్రభుత్వ ఖర్చుతో టూర్‌

అశ్వారావుపేట ఏరియాలో రైతులు ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. అక్కడ టీఎస్‌ ఆయిల్‌ ఫెడ్‌ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి సుమారు 70మంది ప్రజాప్రతినిధులతో అశ్వారావుపేట టూర్‌కు ప్లాన్‌ చేశాం. ప్రభుత్వ అనుమతి రాగానే సంక్రాంతి తర్వాత టూర్‌ నిర్వహిస్తాం. ప్రభుత్వ ఖర్చుతోనే ఇది ఉంటుంది. ఎమ్మెల్యేలు, జిల్లా ప్రజాపరిషత్‌ చైర్‌పర్సన్‌, జడ్పీటీసీలు, ఎంపీపీలతో పాటు రైతుబంధు సమితి జిల్లా, మండల కోఆర్డినేటర్లు పర్యటనలో ఉంటారు.

- శ్రీనివాసరావు, జిల్లా ఉద్యానశాఖ అధికారి

తెనేరా రకం విత్తనం ఎంపిక

మన రాష్ట్ర వాతావరణానికి అనుకూలంగా ఉండేలా అన్ని ప్రాంతాల్లోని ఆయిల్‌ పామ్‌ విత్తనాలను పరిశీలించిన అధికారులు, దక్షిణ అమెరికాలోని కోస్టారికా ప్రాంతంలో ఉండే తెనేరా రకం ఆయిల్‌పామ్‌ విత్తనాలను ఎంపిక చేశారు. అక్కడి నుంచి త్వరలోనే మొలకలను తీసుకొచ్చి ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేసుకుంటున్న నర్సరీల్లో నిర్ణీత ఎత్తు వరకు పెంచి రైతులకు ఇస్తారు. రాష్ట్ర ఆయిల్‌పామ్‌ రెగ్యులరైజేషన్‌ అండ్‌ ప్రొడక్షన్‌, ప్రాసెసింగ్‌ యాక్టు-1993 ప్రకారం ఆయా కంపెనీలు రైతులతో ఆయిల్‌ పామ్‌ సాగు చేయిస్తాయి. ప్రతి వెయ్యి ఎకరాలకు ఒక బీఎస్సీ అగ్రికల్చర్‌ చదివిన వ్యక్తిని సలహాదారుగా నియమిస్తారు. ప్లాంటింగ్‌ మొదలు పంట దగుబడి వరకు అన్ని సలహాలను కంపెనీలే అందిస్తాయి. 

ఆరు జిల్లాలకు ఏజెన్సీల ఆమోదం

ఆయిల్‌పామ్‌ తోటల పెంపకం కోసం రైతులకు సలహాలు, సూచనలతో పాటు సాంకేతిక సహాయాన్ని అందించి వారు పండించిన పంటను కొనుగోలు చేసి, నూనెను ఉత్పత్తి చేసి విక్రయించేందుకు ప్రతి జిల్లాకు ఒక కంపెనీని ఎంపిక చేశారు. ఇందులో భాగంగా మహబూబాబాద్‌ జిల్లాలో 28 వేల 164 ఎకరాల సాగుకోసం గోద్రేజ్‌ ఆగ్రోవిట్‌ లిమిటెడ్‌ను, జనగామలో 7వేల400 ఎకరాల సాగు లక్ష్యం కాగా 3 ఎఫ్‌ ఆయిల్‌ పామ్‌ పైవేట్‌ లిమిటెడ్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాకు 23 వేల 110 ఎకరాల సాగుకు రాం చరణ్‌ ఆయిల్‌ ఇండస్ట్రీస్‌, అర్బన్‌ జిల్లాలో 5 వేల 600 ఎకరాల సాగుకు కేఎన్‌ బయో సైన్సెస్‌ ఇండియా లిమిటెడ్‌, ములుగు జిల్లాలో పది వేల ఎకరాల సాగుకు చిద్రుపి టెక్నికల్‌ సర్విసెస్‌ లిమిటెడ్‌, భూపాలపల్లి జిల్లాలో 19 వేల 900 ఎకరాల సాగుకు జీఎం రెడ్డి కాటన్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను ఎంపిక చేశారు. ఈ కంపెనీలు ఆయా జిల్లాల్లో ఆయిల్‌పామ్‌ మొక్కల నర్సరీల ఏర్పాటు కోసం స్థలాలను అన్వేషిస్తున్నాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లాకు సంబంధించి సంగెంలో స్థలాన్ని ఎంపిక చేశారు. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ పామ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (ఐఐవోపీఆర్సీ) గైడ్‌లైన్స్‌ ప్రకారం నర్సరీల ఏర్పాటుకు ఉద్యానవన శాఖకు దరఖాస్తు చేసుకుంటున్నారు. 

రైతులు, ప్రజాప్రతినిధులకు స్టడీ టూర్‌

ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన ఆయిల్‌పామ్‌ సాగుపై అన్ని జిల్లాలల్లో రైతుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తున్నది. వందల సంఖ్యలో రైతులు ఆయిల్‌పామ్‌ సాగుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఆసక్తి ఉన్న రైతుల జాబితాను ఉద్యావన శాఖ రూపొందించింది. గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు ఆయిల్‌పాం వల్ల రైతులకు వచ్చే లాభాలను, మార్కెటింగ్‌ వ్యవస్థను సవివరంగా చెబతుండడంతో రోజురోజుకూ ఈ పంట సాగుపై రైతుల్లో ఆసక్తి పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు, రైతులకు ఆయిల్‌ పామ్‌ సాగు చేసే ప్రాం తాల్లో స్టడీ టూర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ముందుగా ఎమ్మెల్యే, ఎంపీపీ, జడ్పీటీసీలతో పాటు రైతు సమన్వయ సమితి కన్వీనర్లను, తర్వాత రైతులను కూడా తీసుకెళ్లేందుకు ఉద్యానవన శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, కమ్మపేట మండలాల్లో 1990-92 సంవత్సరాల్లో మొదలైన ఈ ఆయిల్‌పామ్‌ సాగు విజయవంతంగా కొనసాగుతున్నది. ఇక్కడ రెండు ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. ఇక్కడికే స్టడీ టూర్లు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే భూపాలపల్లి జిల్లా నుంచి కొందరు ప్రజాప్రతినిధులు వెళ్లి వచ్చారు. ఇటీవల ఆయిల్‌ పాం ప్రైస్‌ ఫిక్సింగ్‌ కమిటీ (వోపీపీఎఫ్‌సీ) ఆయిల్‌పాం గెల ధరను ఎన్నడూ లేని స్థాయిలో టన్నుకు రూ.14,416 ధర నిర్ణయించడంతో రైతులకు మరింత ఆసక్తి పెరిగింది. 


VIDEOS

logo