బుధవారం 24 ఫిబ్రవరి 2021
Warangal-city - Jan 12, 2021 , 01:36:38

జాతరకు ఐన వోలు ముస్తాబు

జాతరకు ఐన వోలు ముస్తాబు

  • నేడు ధ్వజారోహణతో మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
  • సర్వాంగ సుందరంగా ఆలయ పరిసరాలు
  • స్వాగత తోరణాలతో కొత్త శోభ

ఐనవోలు, జనవరి 11 : జాతరకు ఐనవోలు మల్లన్న స్వామి ఆలయం ముస్తాబైంది. నేటి ధ్వజారోహణతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. శాశ్వత, తాత్కాలిక మరుగుదొడ్లు, వాటర్‌ షవర్లు, మహిళలకు ప్రత్యేక గదులు, కుడా ఆధ్వర్యంలో స్వాగత తోరణాల నిర్మాణాలతో ఆలయం కొత్తశోభ సంతరించుకున్నది. మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ ఆదేశాల మేరకు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.

గొల్లకుర్మల ఇలవేల్పు..

స్వామి వారి రూపం చాలా గంభీరంగా ఉంటుంది. సుమారు పది అడుగుల ఎత్తుతో విశాలమైన నేత్రాలు, కోరమీసాలతో చతుర్భుజాల్లో ఖడ్గం, త్రిశూలం, ఢమరుకం, పానపాత్రలతో కనిపిస్తారు. ఇరువైపులా గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మ కొలువుదీరి ఉంటారు. కుడి పాదం కింద మల్లన్న చేతిలో చనిపోయిన మాణిమల్లసూరుల శిరస్సులు కనిపిస్తాయి. కర్ణాటక ప్రాంతంలో పుట్టిన ఖండేలురాయుడు కర్ణాటక నుంచి మహారాష్ట్ర వరకు పరిపాలించాడు. ఈయన ఇద్దరి భార్యల్లో బలిజమేడలమ్మ కర్ణాటక ప్రాంతవాసి. రెండో భార్య గొల్లకేతమ్మ మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ ప్రాంతానికి చెందిన అమ్మవారిగా చెబుతారు. గొల్లకేతమ్మను పెళ్లి చేసుకున్నందున గొల్లకుర్మలు మల్లికార్జునస్వామిని తమ ఇలవేల్పుగా బండారితో పూజిస్తారు.

భక్తులు ఇలా చేరుకోవాలి..

జాతరకు వచ్చే భక్తుల కోసం కొన్ని మార్గాలతో పాటు పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు.వరంగల్‌ నుంచి వచ్చే వారు తహసీల్దార్‌ కార్యాలయం ముందునుంచి బైపాస్‌ రోడ్డు ద్వారా ఐనవోలు పాఠశాల వెనుక భాగం వాహనాలు పార్కింగ్‌ చేసుకోవాలి. కాలినడకన తూర్పు ముఖం నుంచి లోపలికి ప్రవేశించాలి.స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి వయా కూనూర్‌, గర్మిళ్లపల్లి మార్గం ద్వారా వచ్చే భక్తులు తాటివనం వద్ద వాహనాలను పార్క్‌ చేసి కాలి నడకన చేరుకోవాలి.హైదరాబాద్‌ పెద్దపెండ్యాల వయా వెంకటాపురం నుంచి వచ్చే భక్తులు వెంకటాపురం రోడ్డు ఒంటిమామిడిపల్లి రైస్‌మిల్లు వద్ద వాహనాలు పార్కింగ్‌ చేసి కాలినడకన తెలంగాణ తల్లి సెంటర్‌ నుంచి తూర్పు వైపు నుంచి ఆలయంలోకి రావాలి.తిమ్మాపురం క్రాస్‌ నుంచి వయా సింగారం, కొండపర్తి గ్రామాల నుంచి వచ్చే భక్తులు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద వాహనాలను నిలిపి తెలంగాణ తల్లి సెంటర్‌ నుంచి ఆలయానికి చేరుకోవాలి.ఆర్టీసీ బస్సుల ద్వారా వచ్చిన భక్తులు కూడా తెలంగాణ తల్లి సెంటర్‌ వద్ద బస్సు దిగి కాలినడకన ఆలయ తూర్పు వైపు నుంచి ఆవరణలోకి ప్రవేశించి, తిరిగి తూర్పు వైపు నుంచే బయటి వెళ్లాల్సి ఉంటుంది.

VIDEOS

logo