బుధవారం 24 ఫిబ్రవరి 2021
Warangal-city - Jan 11, 2021 , 00:28:29

సరికొత్తగా చేనేత

సరికొత్తగా చేనేత

  • కార్పొరేట్‌కు దీటుగా ఉత్పత్తుల తయారీ
  • గుంత మగ్గాల స్థానంలో ఫ్రేమ్‌ మగ్గాలు
  • సొసైటీలకు ఉచితంగా ఇవ్వనున్న సర్కారు
  • 10 రోజుల్లో శిక్షణ కేంద్రాలు ప్రారంభం
  • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 7 సెంటర్ల ఏర్పాటు
  • ఉత్పత్తులు కొనుగోలు చేయనున్న టెస్కో
  • భరోసా నింపుతున్న ‘ప్రొడక్ట్‌ డైవర్సిఫికేషన్‌ స్కీమ్‌'

ఇక నుంచి చేనేత ఉత్పత్తులు సరి‘కొత్త’ పద్ధతిలో మార్కెట్‌లోకి రానున్నాయి. కార్పొరేట్‌కు దీటుగా జంపఖానాలు, బెడ్‌షీట్లతో పాటు అందమైన డిజైన్లలో సూటింగ్‌, షర్టింగ్‌, తాన్‌ బట్టలు తయారు కానున్నాయి. ఇందుకుగాను దశాబ్దాల కాలంగా ఉన్న గుంత మగ్గాల స్థానంలో ఫ్రేమ్‌ మగ్గాలు వచ్చేశాయి. ట్రెండ్‌కు తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టగా తొలి విడుత ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏడు కేంద్రాలు ఏర్పాటుకానున్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత మొదట 122 మంది కార్మికులకు ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇవ్వనుండగా సర్కారు తెచ్చిన ప్రొడక్ట్‌ డైవర్సిఫికేషన్‌ స్కీమ్‌(ఉత్పత్తి మార్పు)తో వేలాది మంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి.

- వరంగల్‌, జనవరి 10

ఉమ్మడి జిల్లా చేనేత కార్మికులతో కొత్త డిజైన్లలో ప్యాంట్‌, షర్ట్‌, తాన్‌ బట్టల ఉత్పత్తులను స్థానికంగా తయారు చేసేందుకు చేనేత జౌళి శాఖ చర్యలు తీసుకుంటున్నది. తొలి విడుత ఉమ్మడి జిల్లాలో 7 సెంటర్లు ఏర్పాటుకానుండగా, సంక్రాంతి తర్వాత కొత్త ఉత్పత్తుల తయారీపై 122మంది కార్మికులకు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పొందిన కార్మికులు వెంటనే ఉత్పత్తులు ప్రారంభించేలా సొసైటీలకు ఉచితంగా ఫ్రేమ్‌ మగ్గాలను అందజేయనున్నారు. ఇప్పటికే చేనేత జౌళిశాఖ అధికారులు 122 ఫ్రేమ్‌ మగ్గాలకు ఆర్డర్‌ చేశారు. శిక్షణలో భాగంగా ఇప్పటికే 16 మగ్గాలు ఉమ్మడి జిల్లాకు చేరాయి. సూటింగ్‌, షర్టింగ్‌ ఉత్పత్తులను టెస్కో ఆధ్వర్యంలో కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీ

ప్రొడక్ట్‌ డైవర్సిఫికేషన్‌ స్కీమ్‌ నిర్వహణ కార్మికులందరికీ శిక్షణ ఇచ్చేలా ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ శిక్షణ శిబిరాల నిర్వహణ, ఉత్పత్తులను టెస్కో కొనుగోలు తీరును కమిటీ పరిశీలించనుంది. చేనేత జౌళీ శాఖ ప్రాంతీయ ఉప సంచాలకులు చైర్మన్‌గా టెస్కో డివిజనల్‌ మేనేజర్‌ కన్వీనర్‌గా, హైండ్లూమ్‌ ఉప సంచాలకులు, లేబర్‌ సర్వీస్‌ సెంటర్‌ హైండ్లూమ్‌ ఉప సంచాలకులు డైరెక్టర్లుగా కమిటీ వేశారు. వీరందరూ ఉమ్మడి జిల్లాలోని ప్రతి చేనేత కార్మికుడికి శిక్షణ ఇవ్వడంతో పాటు ఉత్పత్తులు వెనువెంటనే కొనుగోలు చేసేలా ఈ కమిటీ పర్యవేక్షించనుంది.

తొలి విడుత 122 మందికి శిక్షణ

తొలి విడుత 122మంది చేనేత కార్మికులకు ఆధునిక పద్ధతుల ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా కార్పొరేట్‌ సంస్థల ఉత్పత్తులతో చేనేత ఉత్పత్తులు  పోటీ పడేలా ప్రభుత్వం ఉత్పత్తి మార్పు (ప్రొడక్ట్‌ డైవర్సిఫికేషన్‌)స్కీమ్‌ను తీసుకవచ్చింది. ఉమ్మడి జిల్లాలోని 54 చేనేత సహకార సంఘాల్లో సుమారు 4వేల మంది కార్మికులున్నారు. వారందరికీ శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 2350 మంది, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 600 మంది, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 800 మంది ఉన్నట్లు చేనేత జౌళీ శాఖ అధికారులు చెబుతున్నారు. పది రోజుల్లో శిక్షణ ప్రారంభించనున్నారు. అర్బన్‌ జిల్లా పరిధిలో నాలుగు సెంటర్లలో శిక్షణ ఇవ్వనున్నారు. నగరంలోని మట్టెవాడ చేనేత సహకార సంఘంలో 20 మంది కార్మికులు, ఎల్‌బీనగర్‌ సహకార సంఘంలో 20మంది కార్మికులు, ఎల్కతుర్తి మండలం సూరారంలో 20 మంది కార్మికులు, కమలాపురం మండలం వెంకటేశ్వర పల్లిలో 20 మంది కార్మికులు, రూరల్‌ జిల్లాలోని దుగ్గొండి మండలం నాచినపల్లిలో 7 మంది కార్మికులు, ఆత్మకూర్‌ మండలం పెంచికలపేటలో 5 మంది కార్మికులు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చికన్‌పల్లిలో 5మంది కార్మికులకు తొలి విడుతలో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ కాలంలో రోజుకు 210 రూపాయలు ైస్టెఫండ్‌ అందించనున్నారు.

సొసైటీలకు ఉచితంగా ఫ్రేమ్‌ మగ్గాలు

ఇప్పటివరకు గుంతమగ్గాలు వినియోగిస్తున్న సొసైటీలకు ప్రభుత్వం ఫ్రేమ్‌ మగ్గాలు అందించనుంది. శిక్షణ పూర్తి చేసుకున్న వెంటనే ఉత్పత్తులు ప్రారంభించేలా వారికి ఉచితంగా ఫ్రేమ్‌ మగ్గాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే మగ్గాలను చేనేత, జౌళి శాఖ కొనుగోలు చేసింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైండ్లూమ్‌ టెక్నాలజీ, వీవర్స్‌ సర్వీస్‌ సెంటర్ల నుంచి వచ్చిన మాస్టర్‌ ట్రెయినర్లు కార్మికులకు 45రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.

పది రోజుల్లో శిక్షణ ప్రారంభం

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పది రోజుల్లో కార్మికులకు శిక్షణ ప్రారంభిస్తాం. చేనేత, జౌళి శాఖ కమిషనర్‌ శైలజా రామయ్యర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇటీవల ఎల్కతు ర్తి మండలం సూరారంలో  ఫ్రేమ్‌ మగ్గాల ట్రయల్‌ రన్‌ను ఆమె పరిశీలించారు. 16 ప్రేమ్‌ మగ్గాలు 7 శిక్షణ సెంటర్లలో ఫిట్టింగ్‌ పూర్తయ్యింది. నిరంతరంగా చేనేత కార్మికులకు కొత్త పద్ధతులపై శిక్షణ ఇస్తాం. పాత పద్ధతుల్లో నేస్తున్న ఉత్పత్తులకు డిమాండ్‌ లేక నిల్వలు పెరుగుతున్నాయి. ట్రెండ్‌కు తగ్గట్టుగా కార్మికులకు శిక్షణ ఇచ్చేలా ప్రభుత్వం ప్రొడక్ట్‌ డైవర్సిఫికేషన్‌ స్కీమ్‌ తీసుకొచ్చింది. రాష్ట్రంలో ప్రయోగాత్మకం గా ఉమ్మడి వరంగల్‌, గద్వాలలో ఈ కార్యక్రమం ప్రా రంభం కానుండగా కొత్త పద్ధతుల్లో తయారైన ప్యాంట్‌, షర్ట్‌, తాన్‌ బట్టలను టెస్కో కొనుగోలు చేస్తుంది.

- రాఘవరావు, చేనేత, జౌళి శాఖ ఉప సంచాలకులు 

VIDEOS

logo