మంగళవారం 09 మార్చి 2021
Warangal-city - Jan 10, 2021 , 01:12:05

కాకతీయుల జలయజ్ఞానికి ప్రతీకలు

కాకతీయుల జలయజ్ఞానికి ప్రతీకలు

  • వందల ఏళ్ల క్రితమే అద్భుత కట్టడాలు
  • రాజధాని ఓరుగల్లులో 200వరకు మెట్ల బావులు
  • తాగునీటి అవసరాలు తీర్చేలా ఏర్పాటు
  • సులభంగా నీటిని తెచ్చుకునేలా నిర్మాణం

జీవకోటికి నీరే ప్రాణాధారం.. నీరు లేనిదే మనుగడ లేదు. అమృత సమానమైన నీటిని ఒడిసి పట్టి, సకల జనుల అవసరాలు తీర్చేందుకు వందల ఏళ్ల క్రితమే కాకతీయులు ‘జలయజ్జం’ చేసిన విషయం ఓరుగల్లువాసులకే కాదు.. యావత్‌ దేశానికీ తెలుసు. నాడు వారు తవ్వించిన తటాకాలు నేటికీ ఎన్నో గ్రామాలకు జీవనాధారమయ్యాయి. వారి పాలనలో ఏ ఒక్కరూ సాగు, తాగు నీటికి ఇబ్బందులు పడకూడదన్న సదుద్దేశంతో చెరువులతో పాటు చాలా ప్రాంతాల్లో అద్భుత నిర్మాణ శైలితో మెట్ల బావులు ఏర్పాటు చేశారు. రాజధాని ఓరుగల్లులోనే 200 వరకు ఈ మహాబావులు ఉండగా, నాడు ప్రజావసరాలు తీర్చేందుకు ఇవి ఎంతగానో తోడ్పడ్డాయి. ఇప్పటికీ చెక్కుచెదరని ఆ అద్భుత చారిత్రక కట్టడాల విశేషాలు మీకోసం.. మధ్యపేజీలో..

-వరంగల్‌, జనవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) 

  • కాకతీయుల జలయజ్ఞానికి ప్రతీకలు
  • రాజధాని ఓరుగల్లులో 200వరకు మెట్ల బావులు
  • వందల ఏళ్ల క్రితమే అద్భుత కట్టడాలు

మనిషి మనుగడకు నీరు చాలా ముఖ్యం. జలవనరులను సంరక్షిస్తేనే మనకు ఆ నీటి లభ్యత ఉంటుంది. ఆధునిక టెక్నాలజీ, కరంటు మోటర్లు లేని కాలంలో నీటి సంరక్షణలో కాకతీయులు అందరికీ మార్గదర్శకులుగా నిలిచారు. వారి పాలనలో వేల తటాకాలు తవ్వించారు. వ్యవసాయం కోసం ఊరి బయట చెరువులు నిర్మించి వాటితో ప్రజల తాగునీటి అవసరాలు కూడా తీర్చేందుకు వీలుగా వందల సంఖ్యలో మెట్ల బావులు కట్టారు. గొప్ప నిర్మాణాలకు ప్రసిద్ధిగాంచిన కాకతీయులు, అద్భుత ఇంజినీరింగ్‌ టెక్నాలజీతో మెట్ల బావులు కట్టించారు. 

సులభంగా నీటిని తెచ్చుకునేలా..

పారే నీటిని ఒడిసిపట్టాలంటే ఆనకట్టలు కట్టాలి. భూగర్భం నుంచి పొందాలంటే బావులు తవ్వాలి. ఇలా నీటి నిల్వ కోసం కాకతీయలు వందల ఏండ్ల క్రితమే ప్రత్యేక నిర్మాణాలు చేపట్టారు. నీటి నిల్వకోసం పెద్ద బావిని తవ్వి దాని చుట్టూ మెట్లు కట్టారు. ఒకే బావిలో నీరు ఎక్కువ మందికి ఉపయోగపడేలా, సులభంగా అందులోంచి తాగునీరు తెచ్చుకునేలా నిర్మించారు. కాకతీయుల హయాంలో వారి రాజధాని ఓరుగల్లు (వరంగల్‌) నగరంలో కట్టిన మెట్ల బావులు తాగునీటి అవసరాలు తీర్చాయి. కొన్ని బావులు సాగు అవసరాలకు ఉపయోగపడ్డాయి. 

సుమారు 200 వరకు బావులు.. వేర్వేరు పేర్లు

కాకతీయుల రాజధానిగా ఉన్న ఇప్పటి వరంగల్‌ మహానగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 200 వరకు మెట్ల బావులున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. వరంగల్‌-ఖమ్మం ప్రధాన రహదారికి సమీపంలోని శివనగర్‌లో మెట్ల బావి ఉంది. అక్కడి స్థానికులు దీన్ని మెట్ల బావి, 14 మోటల బావి, పెద్ద కోనేరు, దిగుడు బావి, అంతస్తుల బావి, చంద్రకళ బావి అని వేర్వేరు పేర్లతో పిలుస్తుంటారు. గతంలో ఈ ప్రాంతంలో రైసు మిల్లులు, గోదాములు ఉండడం వల్ల కొందరు మిల్లు బావి అని కూడా అంటారు. చేద, బొక్కెన వంటి అదనపు వస్తువులు ఏవీ లేకుండా ప్రజలు తాగునీటిని పొందేలా మెట్ల బావులు కట్టారు.  

గొప్ప నిర్మాణశైలి..

నీటి వనరుల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిచ్చిన కాకతీయులు, మెట్ల బావుల నిర్మాణంలోనూ అంతే ప్రాధాన్యమిచ్చారు. తాగునీరు అందించే మెట్ల బావులను పవిత్ర నిర్మాణాలుగా భావించారు. శివనగర్‌, కరీమాబాద్‌లోని సుభాష్‌ విగ్రహం సమీపంలో, మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా, వేయి స్తంభాలగుడితో పాటు దాదాపు 20 బావులు నగర పరిధిలోనే ఉన్నాయి. శివనగర్‌ మెట్ల బావి నాలుగు వైపులా 14 మీటర్ల వెడల్పుతో చతురస్రాకారంలో ఉంది. కిందికి వెళ్తున్న కొద్దీ విస్తీర్ణం పెరుగుతుంటుంది. కోనేరు దక్షిణం వైపు నుంచి పది మెట్లు కిందికి దిగితే మొదటి అంతస్తు వస్తుంది. మొదటి అంతస్తు వద్ద మెట్లకు ఇరువైపులా ఉన్న ద్వారం నుంచి ఎనిమిది మీటర్లు ముందుకు వెళితే బావి కనిపిస్తుంది. రెండు వైపులా 14, మరో రెండు వైపులా 20 పిల్లర్లపై అంతస్తు ఉంటుంది. మొదటి అంతస్తు బావి చుట్టూ 2.5 మీటర్ల వెడల్పుతో ఒకవైపు పిల్లర్లు, మరోవైపు గోడ ఉంటుంది. కోనేరు పైభాగంలో 14 మీటర్ల చొప్పున చతురస్రాకారంలో ఉండే మొదటి అంతస్తులో 18 మీటర్లు ఉంది. అక్కడి నుంచి మరో 20 మెట్లు దిగితే రెండో అంతస్తు ఉంటుంది. అక్కడే చిన్నపాటి మండపం కూడా ఉన్నది. అక్కడ ఉండే రాతిపై ప్రాచీన కాలంలో మహిళల వస్త్రధారణ తెలిపే శిల్పాలున్నాయి. మరో రాతిపై 11 దేవతా విగ్రహాలు చెక్కి ఉన్నాయి. అద్భుత నిర్మాణశైలితోపాటు ఏండ్లపాటు కూడా నీరు ఎండిపోకుండా ఉండేలా కాకతీయులు ఈ బావులు నిర్మించారు. ఏడేండ్ల కరువు వచ్చిన సందర్భాల్లోనూ ఈ బావిలో నీళ్లు ఉండేవని స్థానికులు ఇప్పటికీ చెప్పడం చూస్తే నీటి సంరక్షణలో మెట్ల బావుల గొప్పదనం ఏంటో మనకు స్పష్టమవుతుంది. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ రూ.30 లక్షలతో శివనగర్‌ మెట్ల బావి సంరక్షణకు చర్యలు చేపట్టింది. అక్కడి పరిసరాలను శుభ్రం చేయడం, చుట్టూ చదును చేయడం వంటి పనులు చేసింది. కబ్జాల నుంచి పరిరక్షించేందుకు బావి చుట్టూ గోడ నిర్మించింది. 

వాటి నిర్మాణం అత్యద్భుతం

కాకతీయుల కాలంలో చేపట్టిన అనేక నిర్మాణాలు ఢిల్లీ సుల్తానుల దాడిలో ధ్వంసమయ్యాయి. వేయిస్తంభాలగుడి, రామప్ప గుడి, ఖిలా వరంగల్‌లోని అనేక నిర్మాణాలు ధ్వంసమైన వాటిలో ఉన్నాయి. అనంతరం పాలన సాగించిన నిజాం రాజులు ప్రత్యేకంగా పురావస్తు శాఖను ఏర్పాటు చేసి అనేక కట్టడాలకు మరమ్మతు చేశారు. మెట్ల బావులకు కూడా అక్కడక్కడా మరమ్మతు చేసిన ఆనవాళ్లు మనకు కనిపిస్తాయి. పెద్ద పెద్ద రాళ్ల మధ్యన విరిగిన శిల్పాలను డంగు సున్నంతో అతికించారు. బావుల చుట్టూ కొన్ని శిల్పాకృతులు తర్వాత కాలంలో అమర్చిన ఆనవాళ్లు కనిపిస్తాయి.           

- అరవింద్‌ ఆర్య పకిడె, యువ చరిత్రకారుడు

VIDEOS

logo