ఆదివారం 07 మార్చి 2021
Warangal-city - Jan 10, 2021 , 01:12:03

నేడే మల్లన్న లగ్గం

నేడే మల్లన్న లగ్గం

  • ముస్తాబైన కొమురవెల్లి 
  • వేలాదిగా తరలిరానున్న భక్తులు
  • ఏర్పాట్లు పూర్తిచేసిన ఆలయ అధికారులు
  • ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి 

చేర్యాల, జనవరి 9 : కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి కల్యాణ మహోత్సవం ఆదివారం వైభవంగా జరుగనుంది. ఇందుకోసం ఆలయ వర్గాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. మహారాష్ట్రలోని షోలాపూర్‌ జిల్లా బార్సి మఠానికి చెందిన సిద్ధగురు మణికంఠ శివాచార్యుల పర్యవేక్షణలో మల్లన్న కల్యాణం జరుగనుంది. కల్యాణానికి శాసనమండలి చీఫ్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. 

వేలాదిగా తరలి రానున్న భక్తులు..

స్వామి వారి కల్యాణోత్సవానికి వేలాదిగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున తోట బావి ప్రాంతంలో నిర్మించిన శాశ్వత కల్యాణ వేదిక వద్ద బారికేడ్లు, షామియానాలు ఏర్పాటు చేశారు. మొబైల్‌ టాయిలెట్లు అందుబాటులోకి తెచ్చారు. ఆర్టీసీ అధికారులు సిద్దిపేట, జనగామ జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేకంగా బస్సులు నడిపిస్తున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో 25వేల మాస్కులు, శానిటైజర్లు సిద్ధం చేశారు.

పార్కింగ్‌ సదుపాయం..

వరంగల్‌, హైదరాబాద్‌ నుంచి వచ్చే భక్తులకు వైశ్య సత్రం వద్ద, కరీంనగర్‌, సిద్దిపేట జిల్లా నుంచి వచ్చే భక్తులకు బతుకమ్మ చెరువు వద్ద, వీఐపీలకు తోటబావి వద్ద, చేర్యాల నుంచి వచ్చే వారికి బస్‌స్టేషన్‌ పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో పార్కింగ్‌ స్ధలాలు ఏర్పాటు చేశారు. 60వేల లడ్డూలు, 20వేల పులిహోర ప్యాకెట్లను సిద్ధం చేశారు. పోలీస్‌శాఖ 260 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. 

దర్శనం ధరల పెంపు..

స్వామి వారి దర్శనం టిక్కెట్‌ ధరలను పెంచుతూ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీవీఐపీకి రూ. 500, విశిష్టకు రూ. 150, శీఘ్ర దర్శనానికి రూ. 100కు పెంచారు. 

ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి..

కల్యాణోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ వహించడంతో తోటబావి వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో శాశ్వత కల్యాణ వేదిక నిర్మించడంతో యేటా వేలాది మంది భక్తులు కల్యాణోత్సవాన్ని వీక్షిస్తున్నారని అన్నారు. స్వామి వారి కల్యాణం సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు.

VIDEOS

logo