దివ్యాంగులకు చేయూత

- ట్రైసైకిళ్లు, కృత్రిమ అవయవాలు అందజేత
- ఈ నెల 11, 12న అర్హుల ఎంపిక శిబిరం
- 80 శాతం వైకల్యం తప్పనిసరి
హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించి, అమలు చేస్తున్నది. ఈ క్రమంలోనే శారీరక దివ్యాంగులకు చేయూతను అందించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో ఆర్టిఫీషియల్ లింబ్ మ్యానుఫ్యాక్షరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిపుణల సహకారంతో దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, కృత్రిమ అవయవాలు అందజేయనుంది. ఇందుకు జిల్లాలో ఎంపిక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 11, 12 తేదీల్లో జిల్లాలోని పాస్టోరల్ సెంటర్లో ఈ శిబిరాలు నిర్వహించనున్నారు. ప్రభుత్వం సూచించిన అర్హతలు ఉన్నవారు మాత్రమే ఈ శిబిరాలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ శిబిరం ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు.
వీరే అర్హులు..
బ్యాటరీ ట్రైసైకిల్కు సంబంధించి కాళ్లు తీవ్రవైకల్యం కలిగి ఉండి, చేతులు సాధారణ స్థితిలో ఉండి, వాహనం నడిపే దివ్యాంగులు అర్హులు. ఇందుకు 16 ఏళ్లు వయసు దాటి 80 శాతం వైకల్యం కలిగి ఉండాలి. అలాగే, కుటుంబ నెలసరి ఆదాయం రూ.15వేలకు మించకూడదు. ఇప్పటికే రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ ద్వారా మోటరైజ్డ్ వాహనం పొందిన వారు అనర్హులు. అలాగే, కాలిపర్స్ కోసం కాళ్లకు పోలియో, మస్తిష్క పక్షవాతం కలిగిన వారు అర్హులు. ఈ శిబిరంలో కొలతలు మాత్రమే తీసుకుంటారు. తర్వాత దాన్ని తయారు చేసి అమర్చేందుకు మరో శిబిరం(ఫిట్మెంట్ క్యాంపు) ఏర్పాటు చేస్తారు. అలాగే, కాళ్లు పూర్తిగా లేని వారు మాత్రమే కృత్రిమ కాళ్లను అమర్చేందుకు అర్హులు. వీరికి కూడా ఈ శిబిరంలో కొలత మాత్రమే తీసుకుంటారు. వాటిని అమర్చేందుకు మరో శిబిరం నిర్వహిస్తారు. అర్హత గల అభ్యర్థులు ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, వైకల్య ధ్రువీకరణ పత్రం(సదరం సర్టిఫికెట్), మూడు పాస్పోర్టు సైజ్ ఫొటోలతో హాజరుకావాల్సి ఉంటుంది.
అర్హులకు మాత్రమే అవకాశం
దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లు, కృత్రిమ అవయవాలు పంపిణీ చేసేందుకు ఈ నెల 11, 12 తేదీల్లో ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు శిబిరం ఉంటుంది. ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం అర్హులైన శారీరక దివ్యాంగులు మాత్రమే ఈ శిబిరాలకు హాజరుకావాలి. అనర్హులైన దివ్యాంగులు వచ్చి, ఇబ్బంది పడొద్దు.
- ఎం శారద, జిల్లా సంక్షేమాధికారి
తాజావార్తలు
- మహిళల కోసం నీతా అంబానీ ‘హర్సర్కిల్’!
- కరోనా వ్యాక్సినేషన్:మినిట్కు 5,900 సిరంజీల తయారీ!
- పాత వెహికల్స్ స్థానే కొత్త కార్లపై 5% రాయితీ: నితిన్ గడ్కరీ
- ముత్తూట్ మృతిపై డౌట్స్.. విషప్రయోగమా/కుట్ర కోణమా?!
- శ్రీశైలం.. మయూర వాహనంపై స్వామి అమ్మవార్లు
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం
- స్విస్ ఓపెన్ 2021: మారిన్ చేతిలో సింధు ఓటమి
- తెలుగు ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యుల హవా
- భైంసాలో ఇరువర్గాల ఘర్షణ.. పలువురికి గాయాలు
- గుత్తాకు అస్వస్థత.. మంత్రి, ఎమ్మెల్యేల పరామర్శ