శనివారం 06 మార్చి 2021
Warangal-city - Jan 06, 2021 , 00:50:46

కౌకొండ గుట్టలు

కౌకొండ గుట్టలు

  •  ప్రకృతినిలయాలం
  • గుట్టల చుట్టూ వందల ఎకరాల్లో సాగు
  • కనుచూపుమేర పచ్చదనం
  • ఆహ్లాదకర వాతావరణం

గ్రామాలంటేనే ప్రకృతి అందాలకు నిలయాలు.. అందునా గుట్టలు ఉంటే ఆ ఊరు చూడముచ్చటగా ఉంటుంది. నడికూడ మండలంలోని కౌకొండ గ్రామాన్ని ఆనుకుని ఉన్న గుట్టలు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. చుట్టూ కొండలు.. మధ్యలో పచ్చటి పరిసరాలు.. ఆ పక్కనే ఉన్న చెరువును చూస్తే ఏ మాత్రం పర్యాటక ప్రాంతాలకు తీసిపోని విధంగా దర్శనమిస్తున్నది. అభివృద్ధి చేస్తే  పట్టణాలు, నగరాల్లో జీవిస్తున్న ప్రజలకు సెలవుదినాల్లో కౌకొండ గుట్టలు చక్కటి ఆటవిడుపు కానున్నాయి.

- నడికూడ, జనవరి 5

నడికూడ మండలకేంద్రానికి కేవలం 5 కిలో మీటర్ల దూరంలో సుమారు 67 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కౌకొండ గుట్టలు వారాంతంలో సేదతీరడానికి అనువుగా ఉన్నాయి. ఇక్కడ పార్కులను ఏర్పాటు చేస్తే నగరాల నుంచి పర్యాటకులు కుటుంబ సమేతంగా వచ్చి సేదతీరేందుకు అనువుగా ఉంటుందని గ్రామస్తులు అంటున్నారు. వరంగల్‌ నుంచి కౌకొండకు వచ్చే క్రమంలో దారిలో పలు పల్లెలను పరిచయం చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. తద్వారా నగరవాసులు పల్లెల స్థితిగతులను అర్థం చేసుకొనే వీలుంటుంది. రాళ్లపై రాళ్లను ఎవరో పేర్చినట్లుగా ఉండే ఈ గుట్టల మధ్యలో, విశాల ప్రదేశంలో సహజసిద్ధంగా ఉన్న నీటి కొలను ఫొటోగ్రఫీ, సినిమా, సీరియల్స్‌ షూటింగ్‌లకు అనువుగా ఉంది.

ప్రభుత్వం దృష్టి సారిస్తే..

తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారిస్తే కౌకొండ పరిసర ప్రాంతాలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో సినిమా యూనిట్‌ వారు మాత్రమే షూటింగ్‌ లొకేషన్లను వెతుక్కుంటూ వెళ్లే వారు. ప్రస్తుతం టీవీ సీరియల్స్‌, యూట్యూబ్‌ చానళ్లు పదుల సంఖ్యలో వెలువడ్డాయి. ఈ తరణంలో కౌకొండ గుట్టలను అభివృద్ధి చేస్తే ప్రతిరోజు ఏదో ఒక షూటింగ్‌ ఇక్కడే జరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గ్రామానికి గుట్టలే అలంకారం

మా గ్రామానికి గుట్టలే అలంకారం. దూరప్రాంతాల వారు వీకెండ్‌ పార్టీల కోసం గుట్టల పరిసరాలకు వస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకుంటే మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దవచ్చు. పార్కులు, కుర్చీలను ఏర్పాటు చేసి పూల మొక్కలు, నీడనిచ్చే మొక్కలను పెంచితే బాగుంటుంది. నీటి కొలనును పెద్ద చెరువుగా మార్చి ఎళ్లకాలం నీరు నిల్వ ఉండేలా చర్యలు చేపట్టాలి.

- మేకల రమేశ్‌, కౌకొండ సర్పంచ్‌

ప్రశాంతంగా ఉంటుంది

మా ఊరిలోని గుట్టల వద్ద చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆహ్లాదకర వాతావరణాన్ని గ్రామస్తులు ఎంజాయ్‌ చేస్తున్నారు. పండుగలు, సెలవు రోజుల్లో స్నేహితులతో కలిసి ఇక్కడి వచ్చి విందువినోదాల్లో పాల్గొంటాం. గుట్టలను అభివృద్ధి చేస్తే పర్యాటక ప్రాంతంగా మారే అవకాశం ఉంటుంది.

- మాదారం నవీన్‌, కౌకొండ

VIDEOS

logo