ఆడేద్దాం స్కేటింగ్

ఆసక్తి చూపుతున్న చిన్నారులు
కరోనా నేపథ్యంలో ఇంటిపట్టునే ఉంటున్న చిన్నారులు నిత్యం సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్కే పరిమితమవుతున్నారు. ఆటలకు దూరమవుతున్నారు. దీంతో వారిలో శారీరక, మానసిక ఎదుగుదల లోపిస్తున్నది. ఈ నేపథ్యంలో నగరంలోని కొందరు తల్లిదండ్రులు వారి పిల్లలకు స్కేటింగ్ నేర్పిస్తున్నారు. హన్మకొండ బాలసముద్రంలోని చిల్డ్రన్స్ పార్కులో ట్రాక్‌పై శిక్షణ ఇప్పిస్తున్నారు. ఎంతసేపు స్కేటింగ్ చేసినా అలసట ఉండడకపోవడంతో చిన్నారులు కూడా ఈ ఆట నేర్చుకునేందుకు ఉత్సాహపడుతున్నారు. రోజూ సాయంత్రం రెండుగంటల పాటు స్కేటింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
-హన్మకొండ చౌరస్తా, జనవరి 4
మానసికోల్లాసంతోపాటు వ్యాయామం.. రోజూ రెండు గంటలు శిక్షణ
ఆటల్లో ఉత్సాహంగా ఉంటే పిల్లలకు చదువు ఒత్తిడి తెలియదు. అలాగని ఆటల్లోనే మునిగితే అలసట పెరుగుతుంది. ఎంతసేపు ఆడినా అలుపు లేకుండా ఉండాలంటే మాత్రం స్కేటింగ్‌కు మించిన ఆట మరోటి లేదు. అయితే, దీన్ని నేర్చుకోకుండా ఆడడం చాలా ప్రమాదం. ఇందుకు అనువైన స్థలం ఉండాలి. కరోనా నేపథ్యంలో ఇంటిపట్టునే ఉంటున్న పిల్లలు.. ఈ ఆట నేర్చుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మానసిక, శారీరక వికాసం కలుగుతుండడంతో ఎక్కువ మంది పిల్లలు స్కేటింగ్వైపు మొగ్గుచూపుతున్నారు. హన్మకొండ బాలసముద్రంలోని చిల్డ్రన్స్ పార్కులోని స్కేటింగ్ ట్రాక్ ఈ ఆటకు వేదికగా మారింది. హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్‌లో ఏకైక స్కేటింగ్ ట్రాక్ ఇక్కడే ఉంది. 20 నుంచి 30 వరకు చిన్నారులు ప్రతిరోజూ సాయంత్రం 5.30 నుంచి 7.30 గంటల వరకు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. ప్రత్యేకంగా కోచ్ ద్వారా శిక్షణ తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల ఇష్టాలకు స్కేటింగ్ ఆట నేర్పిస్తున్నారు, నేర్పిస్తున్నారు. ఎంతో జాగ్రత్తగా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. స్కేటింగ్ సమయంలో జారిందంటే ప్రమాదమే. అందువల్ల జాగ్రత్తగా వ్యవహరించాలి.
మానసికోల్లాసానికి స్కేటింగ్
మారుతున్న కాలానుగుణంగా చిన్నారులు ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్కే పరిమితమవుతున్నారు. సెల్‌ఫోన్స్ వచ్చాక వాటితోనే ఎక్కువగా కాలక్షేపం చేస్తున్నారు. దీంతో ఆటలకు దూరమవుతున్నారు. స్కేటింగ్ శారీరంగా, మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడుతుంది. చిన్నారులు స్కేటింగ్ చేస్తూ హాయిగా ఆటలాడేస్తున్నారు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న చిన్నారులు పడుతూ లేస్తూ స్కేటింగ్ చేస్తుండగా, అనుభవం ఉన్నవారు రయ్‌మంటూ దూసుకెళ్తున్నారు. స్కేటింగ్ అనుభవం ఉన్నవారు మాత్రమే దీనిపై విన్యాసాలు చేయగలుగుతారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా స్కేటింగ్ కిట్లు లభిస్తున్నాయి. వివిధ రకాల్లో హెల్మెట్లు, షూస్ లభిస్తున్నాయి. చిన్న పిల్లల స్కేటింగ్ షూష్ రూ.1000 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉండగా, ఇక ప్రొఫెషనల్ స్కేటింగ్ చేయగలిగే వారికి రూ.3000 నుంచి స్కేటింగ్ షూష్ లభిస్తుండడం విశేషం.
ఫిజికల్ అండ్ మెంటల్లీ స్ట్రాంగ్
స్కేటింగ్ చేయడం వలన చిన్నారులు ఫిజికల్ అండ్ మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అవుతారు. ఆరు సంవత్సరాలుగా ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. సిద్ధార్థ సార్ వద్ద నేర్చుకున్నా. ప్రస్తుతం స్కేటింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న. 5-13 సంవత్సరాల మధ్య వయస్సున్న చిన్నారులు 20 మందికిపైగా ప్రతిరోజూ సాయంత్రం శిక్షణ ఇస్తున్నా. ప్రతియేటా నిర్వహించే పోటీల్లో జిల్లా నుంచి ఎంతో మంది పాల్గొని ప్రతిభ కనబరుస్తున్నారు. జాతీయస్థాయిలో రాణించిన చిన్నారులు కూడా ఉన్నారు. ప్రత్యేకంగా స్కేటింగ్ ట్రాక్ నిర్మిస్తే ఇంకా చాలామంది నేర్చుకునే అవకాశం ఉంటుంది.
- జోయల్, కోచ్
శరీరానికి ఎంతో మంచిది
మా పాప ఫస్ట్ క్లాస్ చదువుతున్నది. స్కేటింగ్ చేయడం చాలా ఇష్టం. రోజూ రెండు గంటలు స్కేటింగ్ చేస్తుంది. ఎప్పుడూ సెల్‌ఫోన్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌తో ఉండే చిన్నారులకు స్కేటింగ్ శిక్షణ శరీరానికి ఎంతో మంచిది. మానసికోల్లాసానికి దోహదపడుతుంది. రెండు నెలలుగా నేర్చుకుంటుంది. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు స్కేటింగ్ నేర్పిస్తున్నారు.
- డాక్టర్ కస్తూరిదేవి, హన్మకొండ