ఆత్మవిశ్వాసమే ఊపిరిగా..

- అంధులకు అండగా లూయిస్ ఆదర్శ బ్లైండ్ స్కూల్
- చదువుతో పాటు రాణిస్తున్న విద్యార్థులు
- ఆన్లైన్ ద్వారా కొనసాగుతున్న విద్యాబోధన
- ప్రభుత్వం, దాతల సహకారంతో పాఠశాల భవనం
- నేడు ప్రపంచ అంధుల దినోత్సవం
పోచమ్మమైదాన్, జనవరి 3: ప్రపంచాన్ని కనులారా చూడకున్నా వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నారు. రెండు కళ్లతో నేరుగా వీక్షించకున్నా స్పర్శతో అర్థం చేసుకుంటున్నారు. అంధులమని అధైర్యపడకుండా చదువుతోపాటు ఆటపాటల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేగాక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని కంప్యూటర్ కూడా నేర్చుకుంటూ మిగతా వారితో పోటీ పడుతున్నారు. ఇలాంటి వారికి ఖిలా వరంగల్ తూర్పుకోటకు చెందిన అంధుడైన నలివెల కుమారస్వామి ఓ ఆప్తుడిగా, తల్లి, తండ్రిగా, గురువుగా అక్షరాలు నేర్పిస్తూ అండగా నిలుస్తున్నారు. ఇటు ప్రభుత్వ సహకారం, అంధుల సాయం, అతడి పట్టుదలతో గ్రేటర్ వరంగల్ ఆటోనగర్‌లో ప్రత్యేకంగా లూయీస్ ఆదర్శ అంధుల పాఠశాలతో పాటు సొంత భవనం ఏర్పాటైంది. లూయీ బ్రెయిలీ జయంతి, ప్రపంచ అంధుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
నేడు ప్రపంచ అంధుల దినోత్సవం తోటివారికి అండగా..
నలివెల కుమారస్వామి పుట్టుకతోనే అంధుడు. అయినా అధైర్యపడకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహం, అన్నదమ్ముల సహకారంతో హైదరాబాద్‌లోని అంధుల పాఠశాలలో చదువుకున్నాడు. అక్కడే టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి, ప్రభుత్వం కల్పించిన వికలాంగుల బ్యాక్లాగ్ కోటాలో సర్కార్ ఉద్యోగం పొందాడు. వరంగల్‌లోని ప్రభుత్వ వాణిజ్య పన్నుల శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా జాబ్ వచ్చింది. ఆ తర్వాత పైసా కట్నం తీసుకోకుండా బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. అయితే పుట్టిన ఇద్దరిలో కుమార్తె కీర్తన చూపు కూడా సరిగా లేకపోవడంతో తొలుత కుంగిపోయాడు. భార్య కల్యాణి ఇచ్చిన ధైర్యంతో ముందడుగు వేసి, బిడ్డను ప్రేమగా చూసుకుంటూ ముందుకుసాగాడు. ఈ నేపథ్యంలో తనతోపాటు బిడ్డ కూడా అంధురాలు కావడంతో తోటి విద్యార్థులకు సేవ చేయాలనే లక్ష్యాన్ని పెంచుకున్నారు.
అంధుల పాఠశాలకు శ్రీకారం..
అటు ఉద్యోగం చేస్తూనే 2010లో అంధ విద్యార్థుల కోసం శివనగర్‌లో లూయీస్ ఆదర్శ అంధుల పాఠశాలను స్థాపించాడు. అక్కడ కొంతకాలం నడిపిన తర్వాత పోచమ్మమైదాన్ దేశాయిపేట రోడ్డుకు మార్చాడు. మిత్రుల సహకారంతో ఐదుగురు విద్యార్థులతో ప్రారంభించిన పాఠశాల ప్రస్తుం 35మందికి చేరింది. తన వేతనంలో సగం కేటాయించి వారికి చేదోడువాదోడుగా, పాఠశాల దాతల సహకారంతో నడిపించాడు. విద్యార్థులకు బ్రెయిలీ లిపితో ఉచిత విద్యాబోధనతో పాటు నివాస వసతి కల్పించాడు. అలాగే విద్యార్థులకు సాహిత్య, క్రీడా సాంస్కృతిక రంగాల్లో కూడా తగిన తర్ఫీదును అందించి, కొంతమంది విద్యార్థులకు జాతీయస్థాయికి తీసుకువెళ్లాడు.
క్రీడా, సాంస్కృతిక పోటీల్లో విద్యార్థులు..
బ్రెయిలీ లిపి విద్యతోపాటు అంధ విద్యార్థులు ఇతర రంగాల్లో పాల్గొంటూ ప్రతిభ చూపుతున్నారు. క్రీడలతో పాటు సాంస్కృతిక రంగాల్లో సత్తా చాటుతున్నారు. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో అనేక బహుమతులు గెలుచుకున్నారు. 2015 గోవాలో జరిగిన జాతీయస్థాయి జూడో పోటీల్లో ముగ్గురు విద్యార్థులు మహేశ్, వేణు, నరేశ్ పతకాలు సాధించారు. 2016లో దేవా అనే విద్యార్థి ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఆల్ ఇండియా జూడో పోటీల్లో సబ్ జూనియర్‌గా పాల్గొని మెడల్ పొందాడు. 2017 హర్యానాలో జరిగిన జాతీయస్థాయి క్రీడా పోటీల్లో జే సాయికృష్ణ జాతీయస్థాయి జూడో పోటీల్లో పాల్గొని కాంస్య పతకం సాధించాడు. 2019లో హైదరాబాద్‌లో ఆల్ ఇండియా జూడో పోటీల్లో సాయికృష్ణ రెండోసారి కాంస్య పతకం పొంది పాఠశాల పేరును నిలబెట్టాడు.
పదో తరగతిలో ప్రతిభ
గతేడాది మార్చిలో పదో తరగతి విద్యార్థులు 80శాతం పైనే మార్కులు సాధించడం విశేషం. మహేశ్ 85శాతం, వేణు 83 శాతం, రహమాన్ 85శాతం, సాయికుమార్ 77శాతం, కీర్తన (కుమారస్వామి కుమార్తె) 73శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి, ప్రస్తుతం వారు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. కాగా ప్రస్తుతం కరోనా నేపథ్యంలో పాఠశాలకు విద్యార్థులు చాలా తక్కువగా వస్తున్నారు. మిగిలిన వారికి ఆన్లైన్ ద్వారా మానస అనే టీచర్ సైన్స్, ఇంగ్లిష్ బోధిస్తున్నారు.
ఆటోనగర్‌లో పాఠశాలకు సొంత భవనం..
అద్దె భవనంలో నడుస్తున్న పాఠశాలను సొంత భవనంలోకి మార్చాలనే లక్ష్యంతో కుమారస్వామి పట్టుదల పెంచుకున్నాడు. ఇందులో భాగంగా కొత్తవాడ, ఆటోనగర్‌లోని కమ్యూనిటీ హాల్లో ఉన్న స్థలంలో సొంత భవనం ఏర్పాటుకు ప్రభుత్వంతో పాటు దాతలు సహకారం అందించారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో రెండేళ్ల క్రితం సొంత పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. అలాగే భవనం ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం కోసం వరంగల్ ఇన్నర్‌వీల్ క్లబ్ సహకారంతో ఎన్ఆర్ఐ ఫోరం లండన్(యూకే)తో పాటు స్థానిక దాతలు సహకారం వల్ల పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం భవనం మొదటి అంతస్తు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
సండే షికారు! ‘లక్నవరం ఫెస్ట్'లో పర్యాటకుల సందడి
గోవిందరావుపేట, జనవరి3: లక్నవరం ఫెస్టివల్లో భాగంగా ఆదివారం పర్యాటకులు షికారు చేశారు. నైట్ క్యాంపెయినింగ్లో పాల్గొని, అడవుల్లో ట్రెక్కింగ్ చేస్తూ, బోట్లలో షికారుకు వెళ్లి ఉల్లాసంగా గడిపా రు. జిప్ సైక్లింగ్ చేస్తూ ఎంజాయ్ చేశారు. వేలాడే వంతెనలపై నడుస్తూ లక్నవరం అందాలను తిలకించి ఫిదా అయ్యారు.
తాజావార్తలు
- గోవధ ఘటనపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
- చిరంజీవి అభిమానికి బాలకృష్ణ అభిమాని సాయం
- మార్చి 8 నుంచి 16 వరకు శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి జాతర
- అక్రమ దందాలకు పాల్పడుతున్న విలేకర్ల అరెస్టు
- డిక్కీ నేతృత్వంలో డా. ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఘన సన్మానం
- 'విజయ్ 65' వర్కవుట్ అవ్వాలని ఆశిస్తున్నా: పూజాహెగ్డే
- దేశీయ విమానయానం ఇక చౌక.. ఎలాగంటే!
- పక్కాగా మహా శివరాత్రి జాతర ఏర్పాట్లు
- బ్రాహ్మణ పక్షపాతి సీఎం కేసీఆర్ : ఎమ్మెల్సీ కవిత
- 1.37 కోట్లు దాటిన కరోనా టీకా లబ్ధిదారులు