సోమవారం 01 మార్చి 2021
Warangal-city - Jan 04, 2021 , 01:21:15

వరంగల్‌ పత్తికి దేశంలో మంచి డిమాండ్‌

వరంగల్‌ పత్తికి దేశంలో మంచి డిమాండ్‌

  • రైతులను దెబ్బతీసేందుకే కేంద్ర వ్యవసాయ చట్టాలు
  • వాటితో వ్యాపారులకూ నష్టాలు తప్పవు
  • పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
  • వరంగల్‌ కాటన్‌ మిల్లర్స్‌ ట్రేడర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ భవనం ప్రారంభం

కాశీబుగ్గ, జనవరి 3: వరంగల్‌లో పండే పత్తికి దేశంలో మంచి డిమాండ్‌ ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం ఏనుమాములలో వరంగల్‌ కాటన్‌ మిల్లర్స్‌ ట్రేడర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా నూతన భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు బాగుంటేనే వ్యాపారులు మంచిగా ఉంటారని అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో వ్యాపారులకు కూడా సమస్యలు ఉన్నాయన్నారు. రైతులు పండించిన అన్ని రకాల నాణ్యత గల పత్తిని వ్యాపారులు కొనుగోలు చేసి రైతులకు ఎంతో మేలు చేస్తున్నారని అన్నారు. భారత ప్రభుత్వ సంస్థ అయిన సీసీఐ రిజెక్టు చేసిన పత్తిని కూడా కాటన్‌ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. దేశంలోనే మన పత్తికి నాణ్యత, దిగుబడిలో మంచి గుర్తింపు ఉందన్నారు. జిల్లాలో కాటన్‌ మిల్లుల ద్వారా సుమారు 15వేల మందికి ఉపాధి లభిస్తున్నదని, రూ.2,500 కోట్ల వ్యాపారం జరుగుతున్నట్లు తెలిపారు. మిల్లర్లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే ఇప్పించేందుకు కృషి చేస్తానని, అలాగే పరిశ్రమలకు రావాల్సిన రాయితీలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులకు నిధులు రా కుండా అడ్డుకున్నా, కేసీఆర్‌ సర్కారు ప్రత్యేకంగా నిధులు కేటాయించి ప్రాజెక్టులను పూర్తి చేసి సాగుకు నీరు అందిస్తున్నదన్నారు. రైతులను దెబ్బ తీసేందుకే కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను తీసుకొచ్చిందని, ఇక ముందు వ్యాపారులకు కూడా కష్టాలు తప్పవన్నారు. విద్యుత్‌ను ప్రైవేటీకరిస్తే రైతులకు ఇబ్బందులెదురవుతాయని, అన్ని వర్గాలు కలిసి కేంద్రానికి తెలిసేలా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, రాజ్యసభ స భ్యులు బండా ప్రకాశ్‌, ఎంపీ పసునూటి ద యాకర్‌, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్‌, గండ్ర వెంకటరమణారెడ్డి, బానోత్‌ శంకర్‌నాయక్‌, తెలంగాణ కాటన్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, కక్కిరాల రమేశ్‌, చాంబర్‌ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి, మార్కెట్‌ చైర్మన్‌ చింతం సదానందం, కార్పొరేటర్‌ తూర్పాటి సులోచన, కాటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చింతలపల్లి వీరారావు, వ్యాపారులు పాల్గొన్నారు.


VIDEOS

తాజావార్తలు


logo