శుక్రవారం 05 మార్చి 2021
Warangal-city - Jan 04, 2021 , 01:21:29

ముమ్మరంగా ఉపాధి పనులు

ముమ్మరంగా ఉపాధి పనులు

  • 62 శాతం కూలీలకు పని కల్పన
  • జిల్లాలో శాయంపేటకు మూడో స్థానం

శాయంపేట, జనవరి 3: గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులు మండలంలో ఊపందుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మండలంలో 62 శాతం కూలీలకు పని కల్పించి జిల్లాలో మూడో స్థానంలో నిలిచినట్లు అధికారులు వెల్లడించారు. కొద్ది రోజులుగా ఉపాధి పనులు వేగవంతం కావడంతో కూలీలు పనుల్లోకి వస్తున్నారు. గత ఏప్రిల్‌ 31 నుంచి వచ్చే మార్చి వరకు ఉపాధి పనులకు ప్రభుత్వం రూ. 3.82 కోట్ల నిధులు కేటాయించింది. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదురైనా కూలీలకు ఉపాధి పని లభిస్తున్నది. ప్రభుత్వం ఒక కూలీకి రోజుకు రూ. 237  చెల్లించేలా నిర్దేశించింది. మట్టి రోడ్లు, చెరువుల్లో పూడికతీత, ఫీడర్‌, ఫీల్డ్‌ చానళ్ల నిర్మాణం, హార్టికల్చర్‌, హరితహారంలో ఎవెన్యూ, కమ్యూనిటీ ప్లాంటేషన్‌, పార్కులు, నర్సరీలు.. ఇలా అనేక పనులు కల్పించారు. ప్రధానంగా గ్రామాల్లో కూలీలతో కచ్చా డ్రైనేజీ పనులు చేయిస్తున్నారు. అలాగే, ఫాంపాండ్స్‌తో పాటు గుట్టల నీళ్లు మళ్లించేందుకు ట్రెంచ్‌ల నిర్మాణాలు చేపడుతున్నారు. 25 గ్రామాల పరిధిలో 9,573 జాబ్‌కార్డులు మంజూరు చేయగా, 21,444 మందికి వ్యక్తిగత జాబ్‌కార్డులు ఉన్నాయి. 11,407 మంది కూలీలు పనులకు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 62 శాతం కూలీలకు పని కల్పించినట్లు ఈజీఎస్‌ అధికారులు తెలిపారు. జిల్లాలో శాయంపేట మూడో స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంకా 38 శాతం పని కల్పించాల్సి ఉన్నట్లు చెప్పారు.

319 కుటుంబాలకు వంద రోజుల పని

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మండలంలో 6129 కుటుంబాలకు 319 కుటుంబాలు వంద రోజుల పనులు పూర్తి చేసుకున్నాయి. కార్యదర్శులకు టార్గెట్లు విధించడంతో ఆ దశలో పనులను వేగవంతం చేసినట్లు ఓ కార్యదర్శి తెలిపారు. జనాభా ప్రాతిపదికన కూలీలకు పనులు కల్పించేలా నిర్దేశించారు. ఉదాహరణకు 1300 జనాభా ఉన్న గ్రామంలో రోజుకు 80 మంది కూలీలకు పని కల్పించాలని టార్గెట్‌ పెట్టారు. అయితే, మొన్నటి వరకు వ్యవసాయ పనులు ఉండగా ప్రస్తుతం ఆ పనులు మందగించాయి. దీంతో మహిళలతో పాటు యువకులు, వృద్ధులు కూడా ఉపాధిహామీ పనుల్లోకి వస్తున్నారు. మండల పరిధిలో సగటున రోజుకు 450 మంది కూలీలు పనుల్లోకి వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. విలేజ్‌ పార్కుల్లో పిటింగ్‌, ప్లాటింగ్‌ను కూలీలతో చేయిస్తున్నారు. నర్సరీల్లో బ్యాగ్‌ ఫిల్లింగ్‌ పనులు చేయించారు. కచ్చా డ్రైనేజీ అయితే నాలుగు మీటరు పొడవు, అరమీటరు లోతు, మీటరు వెడల్పు తీస్తే నిర్దేశించిన విధంగా రూ. 237 వేతనం పొందవచ్చు. కానీ, ఇంత స్థాయిలో కూలీలు పనులు చేయడం లేదని కార్యదర్శులు చెబుతున్నారు. వ్యవసాయ పనులు లేకపోడంతో కూలీలు ఉపాధి పథకంలో పనులు చేసేందుకు వస్తుండడంతో మండలంలో పనులు జోరందుకున్నాయి.

VIDEOS

logo