బుధవారం 27 జనవరి 2021
Warangal-city - Dec 22, 2020 , 00:13:40

పతకాల కూత..!

పతకాల కూత..!

  • జాతీయస్థాయిలో ఎన్నో విజయాలు
  • పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్న మాధవి
  • అంతర్జాతీయ స్థాయి పతకమే లక్ష్యమంటున్న క్రీడాకారిణి

ఖోఖోలో ఓరుగల్లు ఆణిముత్యం పతకాల కూత పెడుతున్నది. పేదరికానికి ఏదీ అడ్డుకాదంటూ వరంగల్‌ కరీమాబాద్‌కు చెందిన మాధవి క్రీడల్లో రాణిస్తున్నది. జాతీయస్థాయిలో ఎన్నో విజయాలు సాధించి పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నది. అంతర్జాతీయ స్థాయిలో పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది.     

- ఖిలావరంగల్‌

ఖోఖోలో రాణిస్తున్న ఓరుగల్లు ఆణిముత్యం

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కరీమాబాద్‌కు చెందిన రమాదేవి, సాంబమూర్తి దంపతుల కూతురు మాధవి. తల్లి బీడీ కార్మికులు కాగా, తండ్రి సైకిల్‌పై దుప్పట్లు పెట్టుకొని విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. సొంత ఇల్లు కూడా లేని నిరుపేద కుటుంబంలో జన్మించిన మాధవి తన పేదరికానికి పట్టించుకోకుండా క్రీడలపై మక్కువతో ఖోఖో క్రీడల్లో రాణిస్తోంది. వ్యాయామ ఉపాధ్యాయుల సలహాలు, సూచనలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. ప్రత్యర్థి ఎత్తులకు భిన్నంగా ముందుకువెళ్తూ అలవోకగా జట్టుకు విజయం సాధించి పెడుతున్నది. అంతర్జాతీయ పతకమే లక్ష్యంగా రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో నిత్యం ప్రాక్టీస్‌ చేస్తూనే విద్యార్థులకు ఖోఖోలో మెళకువలు నేర్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది.

అంతర్జాతీయ స్థాయిలో పతకమే లక్ష్యం

అంతర్జాతీయస్థాయిలో జరిగే ఖోఖో పోటీల్లో పాల్గొని దేశ జెండాను ఎగురవేసి ఓరుగల్లు కీర్తి ప్రతిష్టలను దశదిశలా చాటాలన్న లక్ష్యంతో సాధన చేస్తున్నా. రాష్ట్ర, జిల్లా స్థాయిలో జరిగే పోటీలకు స్నేహితులు అందిస్తున్న సహకారం ఎన్నటికీ మరిచిపోలేను. ఉన్నత విద్యను పూర్తి చేసి భవిష్యత్‌లో క్రీడా కోటలో ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా ఉంటూ క్రీడాకారులను తయారుచేస్తా.

- మాధవి, క్రీడాకారిణి

జాతీయ స్థాయిలో ప్రతిభ

2015 జనవరి 19 నుంచి 22 వరకు భోపాల్‌లో జరిగిన రాజీవ్‌గాంధీ ఖేల్‌ అభియాన్‌, డిసెంబర్‌ 16 నుంచి 20 వరకు అక్కడే అండర్‌ 19 స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చూపింది.2016 నవంబర్‌లో సంగ్లీలో జరిగిన 62వ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అండర్‌-19లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఖోఖో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. సెప్టెంబర్‌ 23 - 25 వరకు హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన 22వ జూనియర్‌ సౌత్‌ జోన్‌ పోటీల్లో రాష్ట్ర జట్టును ద్వితీయ స్థానంలో నిలిపింది.నవంబర్‌ 11 నుంచి 15 వరకు అజాంఘర్‌లో జరిగిన 36వ జూనియర్‌ నేషనల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచింది. డిసెంబర్‌ 2 నుంచి 4 వరకు గుల్బర్గా జిల్లా స్టేడియంలో జరిగిన 27వ సీనియర్‌ సౌత్‌ జోన్‌ పోటీల్లో తృతీయ బహుమతిని గెలుచుకుంది. 2017 నవంబర్‌ 11 నుంచి 16 వరకు ఆంధ్రప్రదేశ్‌ సంగులూరు ఎంఎస్‌ఆర్‌, బీఎన్‌ఎం జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో జరిగిన28వ సీనియర్‌ సౌత్‌ జోన్‌ జాతీయ పోటీల్లో పాల్గొని మొదటి బహుమతిని పొందింది. అక్టోబర్‌ 8 నుంచి 10 వరకు మైసూర్‌ యూనివర్సిటీక్యాంపస్‌లో జరిగిన కేయూ మహిళల ఖోఖో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది.డిసెంబర్‌ 8 నుంచి 10 వరకు హైదరాబాద్‌లో జరిగిన28వ ఓపెన్‌ జాతీయ స్థాయి చాంపియన్‌షిప్‌ ఫెడరేషన్‌ కప్‌ పోటీల్లో ప్రతిభ చాటింది.2018, 2019లో నల్లగొండ, వరంగల్‌ జరిగిన 52, 53 సీనియర్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ పోటీల్లో పాల్గొంది. అలాగే జూనియర్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌, స్కూల్‌ గేమ్స్‌ అండర్‌-17, అండర్‌-19లో పాల్గొని ఉత్తమ ప్రతిభను చాటింది. రాష్ట్ర స్థాయిలో 25 పోటీల్లో  పొల్గొని ఓరుగల్లు సత్తా చాటింది. అలాగే వరంగల్‌ జిల్లా జట్టును ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిపి బహుమతులు సాధించింది. మాధవి ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో నాలుగు పర్యాయాలు ఉత్తమ క్రీడాకారిణిగా అవార్డు ఇచ్చి సత్కరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జరిగే టోర్నమెంటుల్లో కోచ్‌గా, ఎంపైర్‌గా వ్యవహరిస్తున్నది.logo