ఎంజీఎం వైద్యుల సేవలు అద్భుతం

- రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ చంద్రయ్య కితాబు
- రోగులతో మాట్లాడి వైద్యసేవల వివరాల సేకరణ
- మరింత అభివృద్ధికి ప్రభుత్వానికి సిఫారసు
- సెంట్రల్‌జైలును సందర్శించిఖైదీల సంక్షేమంపై ఆరా
- రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ చంద్రయ్య
- వివిధ విభాగాధిపతులతో సమీక్ష
వరంగల్ చౌరస్తా: కదిలే దేవుళ్లు వైద్యులు.. వారి సేవలకు వెలకట్టలేం. ఎంజీఎం దవాఖానలో రోగులకు అందుతున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జీ చంద్రయ్య అన్నారు. ఆదివారం ఆయన రాష్ట్ర కమిషన్ సభ్యులు ఎన్ ఆనందరావు, మహ్మద్ ఇర్ఫాన్ మొయినొద్దీన్‌తో కలిసి ఎంజీఎం దవాఖానను సందర్శించారు. సూపరింటెండెంట్ డాక్టర్ నాగార్జునరెడ్డి, వివిధ విభాగాధిపతులతో ఎంజీఎం అభివృద్ధి, న్యాయపరమైన అంశాలు, సమస్యల పరిష్కారం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఎంజీఎంలో అందుతున్న వైద్యసేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు, నియామకాల విషయంపై విభాగాల వారీగా వైద్యులతో చర్చించారు. ఏఎంసీ వార్డులో రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. క్యాజువాలిటీ విభాగంలోని ఓపీ కౌంటర్‌ను ప్రత్యక్షంగా పరిశీలించారు. పరిశీలనలో భాగంగా ఎంజీఎం సూపరింటెండెంట్‌తో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. అనంతరం చంద్రయ్య విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ దవాఖానలను సందర్శించి, వాటి విధానాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే వరంగల్ ఎంజీఎం దవాఖానకు వచ్చామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులు, మందులు, యంత్ర పరికరాలతో వైద్యులు అందిస్తున్న సేవలు చాలా బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. రోగులు గానీ, వైద్యులుగానీ సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకొస్తే తక్కువ సమయంలో పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ఎంజీఎంకు కావాల్సిన యంత్రపరికరాల విషయంలో నిబంధనలను అమలు పరచడంతోపాటు సంబంధిత జిల్లా, శాఖల మంత్రులు ఇచ్చిన హామీలు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎం వివిధ విభాగాధిపతులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
సెంట్రల్ జైలు సందర్శన
మట్టెవాడ : రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జీ చంద్రయ్య ఆదివారం వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ములాఖత్ గదిని పరిశీలించి ఖైదీలకు అందుతునన్న సేవలను అడిగి తెలుసుకున్నారు. జైలులోని అన్ని బ్యారక్‌లను తిరిగి సంతృప్తి వ్యక్తం చేశారు.