ఆదివారం 07 మార్చి 2021
Warangal-city - Dec 20, 2020 , 00:09:38

విగ్గుండగ.. దిగులు దండుగ..

విగ్గుండగ.. దిగులు దండుగ..

 •  బట్టతలా.. 
 • అయితే పెట్టండి విగ్గు
 •  లోపానికి సరికొత్త మందు
 •  యూత్‌లోనూ పెరుగుతున్న క్రేజ్‌
 •  తక్కువ ధరకే లభ్యం 
 •  సహజత్వాన్ని తలపించేలా అమరిక
 • విగ్గుండగ..

‘వెంట్రుకతో సమానం’.. అని తీసిపారేసేరు..! అది రాలిపోతుంటే తెలుస్తుంది దాని గొప్పతనమేంటో..! తల మీద నిగనిగలాడుతూ.. సహజ కిరీటంలా దర్పాన్నిస్తూ ముఖ సౌందర్యాన్ని ఇనుమడింపజేసే వెంట్రుకలు, ఏదో పంతం పట్టినట్లు ఒక్కొక్కటిగా ఊడిపోతుంటే మనసులో రేగే కలవరం అంతా ఇంతా కాదు. ‘జుట్టెందుకు ఊడుతుందో..? ఊడిన చోట మళ్లీ పెరుగుతుందో? లేదో?’నని కలతచెందే ‘తలలు’ అన్నీఇన్నీ కావు. ఇలాంటి వారు ఇక దిగులు పడాల్సిన పని లేదు. సహజత్వాన్ని తలపించే విగ్గులు ఇప్పుడు విరివిగా తక్కువ ధరకే లభిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా వస్తున్న బట్టతలతో ఇబ్బంది పడేవారికి ఉపశమనం కలిగిస్తున్నాయి.

- హన్మకొండ చౌరస్తా 

సామాన్యుల నుంచి  ప్రముఖుల దాకా

బట్టతలపై వెంట్రుకలు మొలిపించడం అనేది చిట్కాలు, మందులతో సాధ్యం కాదు. కానీ, ‘బట్టతలపై వెంట్రుకలు మొలిపించబడును’ అని వచ్చే వివిధ కంపెనీల ప్రకటనలు చూసి బాధితులు ఏదో ఆశతో వాటిని ఆశ్రయిస్తారు. వారు ఇచ్చే మందులో, తైలాలో వాడి, చిట్కాలు పాటించి చివరికి జుట్టు పెరుగక నిరాశ చెందుతారు. ఇక ఈ దిగులు అక్కర లేకుండా ఇప్పుడు మార్కెట్‌కు మంచి మంచి విగ్గులు వస్తున్నాయి. తక్కువ ధరకే దొరుకుతుండడంతో సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా విగ్గులు పెట్టుకునేందుకు మక్కువ చూపుతున్నారు. సినీ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులే కాదు.. సామాన్యులు, ముఖ్యంగా యువకులు కూడా ఇప్పుడు విగ్గులకు మొగ్గుతున్నారు. నుదుటి భాగంగా ముందువైపు, తల మధ్యలో కవర్‌ చేసేలా హెయిర్‌ క్రాఫ్‌ సెట్లతో విగ్గులు అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీ, ముంబై నుంచే కాకుండా హైదరాబాద్‌ నుంచి కావాల్సిన వారికి ఆర్డర్‌పై తెప్పిస్తున్నారు. సాధారణ జుట్టు తరహాలోనే కనిపించే తీరున విగ్గులు ఉండడంతో వాటిని ధరించేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ముప్పై ఏళ్లలోపే బట్టతలతో బాధపడుతున్న వారు వీటిపై క్రేజ్‌ పెంచుకుంటున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా అందంగా కనిపించేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. చూస్తే బట్టతల ఉన్న విషయం కూడా తెలియనీయకుండా విగ్గులతో మేనేజ్‌ చేసుకుంటున్నారు. ఒకప్పుడు సినిమా నటుల వరకే పరిమితమైన విగ్గు ఇప్పుడు చాలా మందికి తప్పనిసరైంది. పలువురు ప్రజాప్రతినిధులు సైతం బట్టతలను కవర్‌ చేసుకునేందుకు విగ్గు పెట్టుకోవడం విశేషం. బట్టతలతో బాధపడే కంటే విగ్గు పెట్టుకోవడం ఉత్తమంగా ఫీలవుతున్నారు. పక్కా కొలతలతో విగ్గులను చేయించుకుంటున్నారు.  

 • బట్టతలా.. అయితే పెట్టండి విగ్గు
 • లోపానికి సరికొత్త మందు
 • యూత్‌లోనూ పెరుగుతున్న క్రేజ్‌
 • తక్కువ ధరకే లభ్యం 
 • సహజత్వాన్ని తలపించేలా అమరిక
 • చిన్నతనం నుంచే హెయిర్‌ లాస్‌

ప్రస్తుత రోజుల్లో చాలామంది మగాళ్లను బట్టతల సమస్య వేధిస్తున్నది. చిన్నతనం నుంచే జుట్టంతా ఊడిపోవడంతో వారిలో ఆందోళన నెలకొంటున్నది. నలుగురిలో తిరిగేందుకు సైతం ఇబ్బంది పడుతుంటారు. వేలకు వేలు డబ్బు పోసి హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆపరేషన్లు చేయించుకునేవారూ లేకపోలేదు. ఇలాంటి ట్రీట్‌మెంట్లతో తలపై జుట్టు పెరుగడం పక్కన బెడితే దీని కారణంగా వచ్చే సైడ్‌ ఎఫెక్ట్‌ ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడుతుందని చాలా ఘటనలు రుజువు చేస్తున్నాయి. వయస్సు ముదిరినవారిలోనే కాదు, ఇప్పుడు 30దాటక ముందే బట్టతల సమస్య పట్టి పీడిస్తున్నది. 66శాతానికి పైగా యువకుల్లో హెయిర్‌ లాస్‌ సమస్య కనిపిస్తున్నది. ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలి, పనిఒత్తిడి, మానసిక ఒత్తిడి, రోజూ దుమ్ముధూళిలో తిరుగుతుండడం ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. బట్టతల అనేది ఇన్నాళ్లూ వంశపారంపర్యంగా వచ్చే సమస్యలానే ఉండేది. ఇప్పుడు అలా కాకుండా చాలా మందిలో ఈ పరిస్థితి కనిపిస్తున్నది. సాధారణంగా మగవారికే బట్టతల వస్తుందని భావిస్తుంటారు, కానీ, ఆడవారిలోనూ ఇప్పుడు సమస్య కనిపిస్తున్నది. మగవారిలో ఆయా భాగాల్లో జుట్టు మొత్తం ఊడిపోతే.. ఆడవారిలో తల మధ్యలో వెంట్రుకలు ఊడిపోయి, జుట్టు పలుచగా అవుతుంది. తల వెనుక భాగంలోని వెంట్రుకలు బలంగా ఉంటాయి.  

వయస్సుతో సంబంధం లేకుండా ఇప్పుడు చాలా మందికి బట్ట తల వస్తున్నది. అహారపు అలవాట్లలో మార్పులు, మానసిక ఒత్తిడి మూలంగా మూడు పదుల ఈడులోనే ముసలి తనం వచ్చేస్తున్నది. ఐదారు వెంట్రుకలు రాలితేనే ఎందుకు ఊడుతున్నాయో తెలియక మనసెంతో కలవర పడుతుంది. ఇక నెత్తిపై ఎకరం, అరెకరం పోయినోళ్ల పరిస్థితి అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఇలాంటి వారికి విరివిగా వివిధ మోడళ్లలో విగ్గులు అందుబాటులోకి వచ్చాయి. యువత నుంచి నడీడు వయస్సు వచ్చిన చాలా మందిలో వీటిపై ఆసక్తి కనిపిస్తున్నది.  

- హన్మకొండ చౌరస్తా

ప్రత్యేక సెట్టింగ్‌లతో విగ్గులు 

ఈ రోజుల్లో కేవలం వయస్సు మీదపడిన వారికే కాదు.. యువకులకు కూడా బట్టతల వస్తున్నది. రూ.15 నుంచి 50 వేల వరకు వివిధ సైజ్‌లలో ఇప్పుడు విగ్గులు అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌ నుంచి ఆర్డర్లపై తెప్పిస్తున్నాం. కర్లీ, సిల్క్‌ హెయిర్స్‌ వారికి ఎలాంటి తేడా లేకుండా సైడ్‌ కట్టింగ్‌తో బట్టతలను కవర్‌ చేసేలా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటివరకు 30మందికి పైగా విగ్గులు సెట్‌ చేయగా వారిలో 20మందికి పైగా పెళ్లికొడుకులున్నారు. ప్రతి 25 రోజులకోసారి విగ్గును వాష్‌ చేయాలి. సంవత్సరం వరకు విగ్గు బాగుటుంది.  

- మిడిదొడ్డి నాగరాజు, అప్పీరియన్స్‌ మెన్స్‌ పార్లర్‌, సుబేదారి

చాలా బాధపడ్డా

నాకు 36 సంవత్సరాలు. బట్టతల ఉండడంతో చాలా బాధపడ్డ. ఇప్పుడు విగ్గులు అందుబాటులోకి రావడంతో వాటిని ధరిస్తున్నా. సంవత్సరమైంది. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. మళ్లీ 15 సంవత్సరాలు వెనక్కి వెళ్లినట్లు అనిపిస్తున్నది. నాలాంటి చాలా మంది ఇప్పుడు విగ్గులు పెట్టుకుంటున్నారు.   

- చంద్రప్రకాశ్‌, హన్మకొండ

పెళ్లికొడుకులకూ తప్పని విగ్గులు

జీవితంలో మధురఘట్టం పెళ్లి. అది ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ‘పెళ్లి కొడుక్కు బట్టతలనట’ అని కామెంట్‌ రాకుండా ‘బాధితులు’ ఇప్పుడు ముందుగానే సర్దుకుంటున్నారు. ఇటీవలి కాలంలో బట్టతల ఉన్న పెళ్లికొడుకులు విగ్గులు ధరించడం ఎక్కువగా కనిపిస్తున్నది. విగ్గుల ధారణలో 50 శాతానికిపైగా వారే ఉన్నట్లు తెలుస్తున్నది. కొందరు యువకుడిగా కనిపించేందుకు విగ్గును వాడుతుంటే మరికొందరు తమ హోదా కోసం వినియోగిస్తుండడం విశేషం.  

VIDEOS

logo