శనివారం 06 మార్చి 2021
Warangal-city - Dec 19, 2020 , 00:27:16

యాసంగికి భరోసా

యాసంగికి భరోసా

  • పొలాలకు ఎస్సారెస్పీ నీరు
  • వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోనే 4.70 లక్షల ఎకరాల ఆయకట్టు
  • 22న రాత్రి వరకు అర్బన్‌ జిల్లాలోకి జలాలు
  • వారం విడిచి వారం నీటి విడుదల
  • మార్చిలోపు పంట చేతికొచ్చేలా ప్రణాళిక యాసంగికి భరోసా

యాసంగిలో పంటల సాగుకు సరిపడా నీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సీజన్‌ను మార్చిలోనే ముగించేలా ప్రణాళిక వేసింది. ఏప్రిల్‌ నుంచి మొదలయ్యే రాళ్లవానలు, ఇతర విపత్తులతో రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలని ఈ నిర్ణయం తీసుకున్నది. ఇందుకు అనుగుణంగా ఎస్పారెస్పీ నీటిని ఆదివారం నుంచి విడుదల చేయనుండగా, ఈనెల 22న రాత్రి వరకు అర్బన్‌ జిల్లాలోకి జలాలు రానున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం ఆయకట్టు 4.70లక్షల ఎకరాలు ఉండగా, వారం విడిచి వారం సాగునీరందనుంది.  

- వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ

యాసంగి సాగుకు సరిపడా సాగునీరు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. యాసంగి సీజన్‌ మార్చిలోనే ముగించేలా ప్రభుత్వం నీటి విడుదల చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్‌ నుంచి మొదలయ్యే రాళ్లవానలు, ఇతర విపత్తుల నుంచి రైతులకు నష్టం కలుగకుండా ఉండేలా ఈ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) అధికారులు యాసంగి సాగునీటి విడుదలకు ప్రణాళిక రూపొందించారు. ఆదివారం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయనున్నారు. ఎస్సారెస్పీ మొదటి, రెండో దశల పరిధిలో వరంగల్‌ ఉమ్మడి జిల్లా ఆయకట్టు ఉంది. ఈ నెల 22న వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోకి నీటి ప్రవాహం రానుంది. లోయర్‌ మానేరు డ్యాం నుంచి వర్ధన్నపేట మండలం ఇల్లంద వరకు మొదటి దశలో 5,05,725 ఎకరాల ఆయకట్టు ఉంది. రెండో దశ పరిధిలో ఇల్లంద తర్వాత, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వరకు 3,65,000 ఎకరాల ఆయకట్టు ఉంది. రెండు దశల్లో మొత్తం 8.70 లక్షల ఆయకట్టుకు యాసంగిలో నీటి సరఫరా చేసేలా ఏర్పాట్లు పూర్తయ్యా యి. ఆయకట్టులోని చివరి ప్రాంతంలో మొదట నాట్లు వేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. దీని వల్ల నాట్ల నుంచి కోతల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 

చెరువులు, రిజర్వాయర్లు...

ఎస్సారెస్పీ రెండు దశల్లోని పంటల సాగు అవసరాలతోపాటు చెరువులు, రిజర్వాయర్లకు నీటి సరఫరా జరగనుంది. వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, నల్లగొండ పాత జిల్లాల పరిధిలో ఎస్సారెస్పీ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు పూర్తి స్థాయిలో రబీలో సాగునీరు అందనుంది. ఈ ప్రాంతంలోని సాగు అవసరాల కోసం దాదాపు 40 టీఎంసీల వరకు నీటిని విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించారు. వరంగల్‌ పాత జిల్లాలోని ఎస్సారెస్పీ రెండు దశల్లో కలిపి 4,72,287 ఎకరాల ఆయకట్టు ఉంది. ఎస్సారెస్పీ హన్మకొండ సర్కిల్‌ పరిధిలోని హుజూరాబాద్‌, హన్మకొండ, మహబూబాబాద్‌ డివిజన్లలోని ఈ ఆయకట్టు ఉంటుంది. ఈ ప్రాంతంలోని ఆయకట్టు కోసం ఏర్పాటు చేసిన 31 డిస్ట్రిబ్యూటరీలను నీటి విడుదలకు అనుగుణంగా సిద్ధం చేశారు. ఏడు రోజుల విడుదల, ఏడు రోజుల నిలిపేత పద్ధతిలో సరఫరా చేయనున్నారు. ఎనిమిది విడుతలలో విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించారు. 


VIDEOS

logo