శనివారం 23 జనవరి 2021
Warangal-city - Dec 05, 2020 , 02:02:24

భారీగా ‘ట్రేడ్‌' బకాయిలు

భారీగా ‘ట్రేడ్‌' బకాయిలు

  • రెండు నెలల్లో రూ.మూడు కోట్ల లక్ష్యం
  • క్షేత్రస్థాయిలో ట్రేడర్ల లెక్క తేల్చిన అధికారులు

 వరంగల్‌, డిసెంబర్‌ 4 : బల్దియాలో భారీగా ‘ట్రేడ్‌' బకాయిలు పెరిగిపోతున్నాయి. బకాయిలు కొండంత.. వసూలు గోరంత అన్నట్లుగా ఉంది. మరో రెండు నెలల్లో కోట్లలో ట్రేడ్‌ లైసెన్స్‌ బకాయిలు వసూలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఏటా ఫిబ్రవరి నుంచి కొత్త ట్రేడ్‌ లైసెన్స్‌ సంవత్సరం మొదలవుతుంది. అయితే, ఇప్పటి వరకు గ్రేటర్‌ అధికారులు కేవలం  46 శాతం ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజులు వసూలు చేశారు. ఫీజు వసూలు చేయడంలో అధికారులకు సరైన కార్యాచరణ లేకపోవడంతో వసూళ్లు నత్తనడకన సాగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఆస్తి పన్ను, నీటి పన్ను వసూళ్లపై దృష్టి సారిస్తున్న బల్దియా అధికారులు ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజుల వసూళ్లపై పక్కా ప్రణాళిక లేకపోవడంతో బకాయిలు ఏటా రెట్టింపు అవుతున్నాయి. రోజురోజుకు విస్తరిస్తున్న నగరంలో అదే స్థాయిలో ట్రేడింగ్‌లు పెరుగుతున్నాయి. కానీ, ఆ స్థాయిలో పన్ను వసూళ్లు మాత్రం పెరుగడం లేదు. సొంత ఆదాయం పెంచుకోవాలన్న సంకల్పంతో అడుగులు వేస్తున్న బల్దియా పాలకవర్గం, అధికార యంత్రాంగం ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజుల వసూళ్లపై  మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పక్కా ప్రణాళికతో ముందుకు పోతే వసూళ్ల లక్ష్యాన్ని వంద శాతం చేరుకోవచ్చు. అయితే, ప్రతి ఏడాది నగరంలో ట్రేడింగ్‌లపై సర్వే చేయించాల్సిన అవసరం ఉంది.  గ్రేటర్‌ పరిధిలోని ట్రేడింగ్‌లపై సమగ్ర సర్వే చేసి, క్షేత్రస్థాయిలో ఉన్న ట్రెడింగ్‌ల అసలు లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది.

రూ.2.66 కోట్లు వసూలు

బల్దియా పరిధిలో రూ.5.69 కోట్ల ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజుల డిమాండ్‌ ఉండగా ఇప్పటి వరకు రూ.2.66 కోట్లు మాత్రమే వసూలు చేశారు. నగర పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం 23,398 ట్రేడింగ్‌లు ఉన్నాయి.   కాశీబుగ్గ పరిధిలో 11,7688 ట్రేడర్లు ఉండగా కాజీపేట సర్కిల్‌ పరిధిలో 11,630 ఉన్నాయి. అయితే, కాశీబుగ్గ సర్కిల్‌ పరిధిలో రూ.2.72 కోట్లు ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు వసూలు చేయాల్సి ఉండగా అధికారులు రూ.1.33కోట్లు మాత్రమే వసూలు చేశారు. కాజీపేట సర్కిల్‌ పరిధిలో రూ. 2.93 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా రూ.1.32కోట్లు మాత్రమే వసూలు చేశారు. దీంతో ట్రేడ్‌ లైసెన్స్‌ల బకాయిలు భారీగా పెరిగి పోతున్నాయి. మరో రెండు నెలల్లో 2019-20 సంవత్సరం  ట్రెడ్‌ లైసెన్స్‌ల గడువు ముగుస్తున్నందున బకాయిలు రూ.3.03 కోట్లు ఉండడం బల్దియా అధికారుల పనితీరుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ప్రతి ఆర్థిక సంవత్సరం చివరలో పన్నుల వసూళ్లపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించే అధికారులు ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజుల వసూళ్లపై మాత్రం అంతగా దృష్టి సారించడం లేదు. 

అసలు కంటే అపరాధ రుసుమే ఎక్కువ

ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజుల్లో వింత పరిస్థితి నెలకొంది. అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్లుగా ట్రేడ్‌ ఫీజు కంటే అపరాధ రుసుం ఎక్కువ ఉండడంతో వసూళ్లకు అడ్డంకిగా మారింది. పెనాల్టీలతో ట్రేడ్‌ ఫీజులు చెల్లిస్తేనే తీసుకుంటామని అధికారులు చెప్పుతుండడంతో పన్నుల చెల్లింపులు అంతగా కావడం లేదన్న వాదనలు ఉన్నాయి. రూ.5.69 కోట్ల బకాయి ట్రెడ్‌ ఫీజుల్లో రూ.1.55 కోట్లు అపరాధ రుసుములే ఉన్నాయి. ఏళ్ల తరబడి ట్రేడ్‌ ఫీజులు చెల్లించక పోవడంతో భారీగా పెనాల్టీలు ఉండడం ట్రేడ్‌ పన్నుల చెల్లింపుల్లో ఇబ్బందిగా మారింది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం మరో రెండు నెల్లో ముగుస్తున్న నేపథ్యంలో బల్దియాకు భారీ ఆదాయాన్ని సమకూర్చే ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజుల వసూళ్లపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉంది.

నోటీసులతో సరి

ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు  వసూళ్లలో అధికారులు కఠినంగా వ్యవహరించకపోవడంతో భారీగా బకాయిలు పెరిగిపోతున్నాయి.    ట్రేడర్లు బల్దియా జారీ చేసిన నోటీసులను పట్టించుకోవడం లేదు. దీనికి తోడు లైసెన్స్‌ ఫీజుల కోసం ప్రత్యేకమైన వ్యవస్థ లేక పోవడంతో వసూళ్లు అంతంతమాత్రంగా అవుతున్నాయి.  బల్దియా లెక్కలకు క్షేత్రస్థాయిలో ట్రేడర్ల లెక్కలకు పొంతన కుదరడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఇటీవల కౌన్సిల్‌ ఆమోదంలో క్షేత్రస్థాయిలో లేని సుమారు 5 వేల ట్రేడర్లను తొలగించారు. గతంలో ఉన్న 28 వేల పైచిలుకు ట్రేడర్లకు గాను 23,398 ఉన్నట్లు లెక్క తేల్చారు.  లక్షల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు సైతం ట్రేడ్‌ లైసెన్స్‌ల ఫీజుల చెల్లింపులపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. బల్దియాకు ఆదాయం వచ్చే ట్రేడ్‌ లెసెన్స్‌ ఫీజుల వసూళ్లకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. 


logo