సోమవారం 18 జనవరి 2021
Warangal-city - Dec 01, 2020 , 02:04:03

ఎంజీఎం ఉద్యోగుల తీరుపై కలెక్టర్‌ ఆగ్రహం

ఎంజీఎం ఉద్యోగుల తీరుపై కలెక్టర్‌ ఆగ్రహం

  • అధికారులు, సిబ్బంది అక్రమాలపై కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆరా
  • ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన

వరంగల్‌ చౌరస్తా, నవంబర్‌ 30 : ఎంజీఎం విభాగాల్లో విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న పలువురు ఉద్యోగులపై కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ‘ఎంజీఎం.. పాలన అస్తవ్యస్తం’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఆయన అవినీతి నివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు.  ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగార్జునరెడ్డితో కలెక్టర్‌ ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కొవిడ్‌ కాలం నుంచి ఎంజీఎం దవాఖాన అందిస్తున్న సేవలు బాగున్నాయని, కానీ, ద్వితీయ శ్రేణి కార్యాలయ సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. విభాగాల వారీగా వైద్య సేవలు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, పరిపాలనా విధుల్లో అధికారులు నిర్లక్ష్యం వహించడం, అక్రమాలకు పాల్పడడం సరికాదన్నారు. వారిపై శాఖాపరమైన చర్యలకు కార్యాచరణ చేపట్టాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. విభాగాల వారీగా నిర్వహిస్తున్న విధులు, అదనపు బాధ్యతలతో కూడిన నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో సూపరింటెండెంట్‌ నివేదిక రూపొందిస్తున్నట్లు తెలియడంతో అక్రమార్కుల్లో గుబులు మొదలైనట్లు తెలిసింది. కొందరు అధికారులు అక్రమాలకు సంబంధించిన ఫైళ్లను టేబుల్స్‌ నుంచి తొలగించినట్లు సమాచారం. పది నెలల కాలంలో అధికారులు, సిబ్బంది ఏసీబీకి పట్టుబడడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఘటనపై పూర్తిస్థాయి నివేదికను అందించనున్నట్లు ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగార్జునరెడ్డి తెలిపారు.