ఆదివారం 17 జనవరి 2021
Warangal-city - Nov 24, 2020 , 02:30:59

రొయ్య పిల్లల పంపిణీకి రంగం సిద్ధం

రొయ్య పిల్లల పంపిణీకి రంగం సిద్ధం

  • మూడు చెరువుల్లో 4.22 లక్షలు పోసేందుకు చర్యలు
  • నేటి నుంచి పంపిణీ ప్రారంభం 
  • రూ.25 లక్షల ఆదాయం  అంచనా

హన్మకొండ చౌరస్తా : రొయ్య పిల్లల పంపిణీకి జిల్లా అధికారులు రంగం సిద్ధం చేశారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే ఉచితంగా చేప పిల్లలను అందిస్తున్నది. గత ఏడాది రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మేరకు ఈ సంవత్సరం చెరువుల్లో రొయ్య పిల్లలను పోసేందుకు చర్యలు తీసుకుంటోంది. విస్తారంగా కురిసిన వర్షాలతో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటికే చెరువుల్లో చేప పిల్లలను పోసిన మత్స్యశాఖ అధికారులు రొయ్య పిల్లల పంపిణీకి ప్రణాళికలు రూపొందించారు. మత్స్యకారుల అభ్యున్నతి, సంక్షేమం కోసం కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. కోట్లు వెచ్చించి, ఉచితంగా చేప పిల్లలతోపాటు రొయ్య పిల్లలు పంపిణీ చేస్తున్నది. గత ఏడాది నుంచే రొయ్య పిల్లలను పంపిణీ చేసిన మత్స్యశాఖ ఆశించిన ఫలితాలు రావడంతో ఈ కార్యక్రమాన్ని మళ్లీ చేపడుతోంది.

మూడు చెరువుల్లో 4.22 లక్షల రొయ్య పిల్లలు

వరంగల్‌ అర్బన్‌ జిల్లా వ్యాప్తంగా మొత్తం 561 చెరువులు ఉన్నాయి. జిల్లాలో రెండోసారి చేపట్టిన రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమానికి మొదటి విడుతగా మూడు చెరువులను ఎంపిక చేశారు.  ధర్మసాగర్‌ రిజర్వాయర్‌లో 3.14 లక్షలు, కమలాపూర్‌ పెద్ద చెరువులో 83 వేలు, పెద్ద పెండ్యాలలోని పెద్ద చెరువులో 26 వేల రొయ్య పిల్లలను వేయనున్నారు. మొత్తం 4.22 లక్షల రొయ్య పిల్లలను ఈ మూడు చెరువుల్లో పోయనున్నారు. మంగళవారం ధర్మసాగర్‌ రిజర్వాయర్‌లో జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి రొయ్య పిల్లలను పోయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆశించిన స్థాయిలో రొయ్యల సాగు జరిగితే వచ్చే ఏడాది మరిన్ని చెరువుల్లో వేసేందుకు చర్యలు చేపడుతున్నారు.

భారీ ఆదాయం అంచనా..

జిల్లాలో రెండోసారి చేపట్టిన ఉచిత రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమంతో అధిక దిగుబడి రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రూ.8లక్షలు ఖర్చు చేసి మూడు చెరువుల్లో 4.22 లక్షల రొయ్య పిల్లలను వేయనున్నారు. ఈ సారి మూడున్నర టన్నుల రాబడి ద్వారా రూ.25 లక్షల ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం రూ.4 లక్షల రొయ్య పిల్లలను చెరువుల్లో వేయగా రెండు టన్నుల రాబడితో రూ.14 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.  

రూరల్‌ జిల్లాలో 4.55 లక్షల రొయ్య పిల్లలు.. 

నేడు మైలారంలో పంపిణీ ప్రారంభం

కలెక్టరేట్‌/రాయపర్తి : వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 2020- 21 సంవత్సరానికి గాను మత్స్యకారుల కోసం 4. 55 లక్షల నీలకంఠ రొయ్యలను పంపిణీ చేయడానికి సిద్ధం చేసినట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి పీ నరేశ్‌కుమార్‌నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.  రాయపర్తి మండలంలోని మైలారం రిజర్వాయర్‌లో 2.28 లక్షలు, సంగెం మండలంలోని ఎల్గూరు రంగంపేట లార్జ్‌ ట్యాంక్‌ రిజర్వాయర్‌లో 1.13 లక్షలు,  నర్సంపేట మండలంలోని మాదన్నపేట పెద్ద చెరువులో 1.14 లక్షలు కలిపి మొత్తం 4.55 లక్షల రొయ్యలను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం మైలారం రిజర్వాయర్‌లో రొయ్య పిల్లలను వేయనున్నట్లు వివరించారు. మత్స్యకారులు,  ప్రజా ప్రతినిధులు సకాలంలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.