శనివారం 28 నవంబర్ 2020
Warangal-city - Nov 21, 2020 , 01:36:27

వేతన సంబురం

వేతన సంబురం

  • ఆర్టీసీ కార్మికుల్లో వెల్లివిరిసిన ఆనందం
  • 12 రోజుల సమ్మె, లాక్‌డౌన్‌ వేతనాలు విడుదల 
  • వరంగల్‌ రీజియన్‌లో 4190 మంది సిబ్బంది

హన్మకొండ చౌరస్తా : ఆర్టీసీ కార్మికుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. 12 రోజుల సమ్మె పెండింగ్‌ వేతనాలు, కొవిడ్‌ సగం వేతనాలు ప్రభుత్వం విడుదల చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని కష్టాలకోర్చయినా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటామని చెప్పిన సీఎం కేసీఆర్‌ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆర్టీసీ సంస్థను లాభాలబాటలోకి తెచ్చేందుకు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. వరంగల్‌ రీజియన్‌ పరిధిలోని 9 డిపోల్లో హన్మకొండ, వరంగల్‌-1, వరంగల్‌-2, జనగామ, పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, మహబూబాబాద్‌, తొర్రూరు ఆర్‌ఎం ఆఫీసుల్లో మొత్తం 4,190 మంది విధులు నిర్వహిస్తున్నా రు. పెండింగ్‌ వేతనాలు విడుదల చేయడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

12 రోజుల సమ్మె పెండింగ్‌ వేతనాలు 

అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని గత ఏడా ది ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. 55 రోజుల పాటు సమ్మె చేశారు. ఇందులో మిగిలిపోయిన 12 రోజుల వేతనాలకు సంబంధించి రూ.4.50కోట్లను శుక్రవారం విడుదల చేసింది. సోమవారం కార్మికుల బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ కానున్నాయి. 

కొవిడ్‌ కోత వేతనాలు రూ.21కోట్లు 

కరోనా నేపథ్యంలో ఆర్టీసీ సంస్థ కుదేలైంది. లాక్‌డౌన్‌ కారణంగా మార్చి నుంచి బస్సులను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులకు మూడు నెలల వేతనాల్లో 50 శాతం కోత విధించారు. ప్రస్తుతం అన్‌లాక్‌ ప్రక్రియ మొదలై జనజీవనం యథాస్థితికి చేరడంతో ఆర్టీసీని బతికించుకునేందుకు ప్రభు త్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. ఇటీవల హైదరాబాద్‌లో ఆర్టీసీపై జరిగిన సమీక్షలో సీఎం కేసీఆర్‌ కొవి డ్‌ కారణంగా కోత విధించిన మొత్తాన్ని విడుదల చే యాలని నిర్ణయించారు. మార్చి, ఏప్రిల్‌, మే నెలల పెం డింగ్‌ వేతనాల కోసం రూ.21 కోట్లు విడుదల చేశారు. సోమవారం అకౌంట్లలో జమకానున్నాయి.

సీసీఎస్‌ రూ.120 కోట్లు విడుదల 

కొంత కాలంగా సీసీఎస్‌ నిధులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం తీపి కబురు చెప్పింది. నిలిచిపోయిన కార్మికుల సీసీఎస్‌ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. పొదుపునకు సంబంధించిన సీసీఎస్‌(క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ) డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రోడ్డు, రవాణా సంస్థ సీసీఎస్‌ ఖాతాలో జమ చేసింది. వరంగల్‌ రీజియన్‌లో పనిచేస్తున్న 4190 మంది కార్మికుల సీసీఎస్‌ నిధులు రూ.120 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని రీజినల్‌ మేనేజర్‌ అంచూరి శ్రీధర్‌ తెలిపారు. గతంలో విడుదల చేసిన రూ.80 కోట్లతో కలిపి మొత్తం రూ.200 కోట్లు వరంగల్‌ రీజియన్‌కు వచ్చినట్లు తెలిపారు.