‘ఊపిరి’కి భరోసా

ఎంజీఎంలో అదనపు ఆక్సిజన్ ప్లాంట్
పీఎంఎస్ఎస్వై సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనూ ఏర్పాటు
త్వరలోనే అందుబాటులోకి..
వరంగల్ చౌరస్తా : ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా పేదలకు వైద్య సేవలందిస్తున్న వరంగల్ ఎంజీఎం దవాఖాన, రోగుల ఊపిరికి మరింత భరోసా కల్పిస్తున్నది. ఇక్కడ ఆక్సిజన్ ప్లాం టు విస్తరణ పనుల్లో ప్రధాన ఘట్టం శనివారం పూర్తయింది. అత్యవసర వైద్యసేవల సమయంలో సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ అందించడంలో అంతరాయం ఏర్పడుతున్న కారణంగా ఇక నిరంతరం ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా, ఎక్కువ మొత్తంలో నిల్వ చేసుకునే వెసులుబాటు కలిగేలా గతంలోనే ఇక్కడ ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేశారు. కొవిడ్ కారణంగా ఆక్సిజన్ వినియోగం రెండింతలు పెరగడంతో అత్యవసర వైద్యసేవలకు, కరోనా సేవలకు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలుగకుండా ప్లాంటును విస్తరించాలని అధికారులు నివేదించిన మేరకు ప్రభుత్వం అనుమతులు జారీ చేయగా, పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభమయ్యాయి.
ఇందులో భాగంగా స్టోరేజ్ ట్యాంకు బిగింపు పనులు శనివారం పూర్తయ్యాయి. గుజరాత్ నుంచి తెచ్చిన ఆరున్నర టన్నుల బరువున్న ట్యాంకును భారీ క్రేన్ల సాయంతో ప్లాట్‌ఫాంపై అమర్చారు. దీని నిలువ సామర్థ్యం 13 టన్నులు అని అధికారులు తెలిపారు. ఎంజీఎంలోని వివిధ కొత్త విభాగాలకు పైప్‌లైన్ ద్వారా అంతరాయం లేకుండా ఆక్సిజన్ అందించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు చెప్పారు. త్వరలోనే కొత్త ప్లాంటును అందుబాటులోకి తెస్తామన్నారు.
సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలో..
కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలో నిర్మించిన పీఎంఎస్ఎస్వై సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవసరాలకు సైతం 13 టన్నుల సామర్థ్యం కలిగిన స్టోరేజ్ ట్యాంకుతో ఆక్సిజన్ ప్లాంటు నిర్మిస్తున్నారు. ఇక్కడ కూడా శనివారం ట్యాంకు బిగింపు పనులు పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.12కోట్ల నిధుల నుంచి ఈ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆధునిక పరికరాలతో పాటు ఆక్సిజన్ ప్లాంటు పనులు తుదిదశకు చేకున్నాయని, త్వరలోనే అందుబాటులోకి వస్తాయని వివరించారు.
తాజావార్తలు
- పెళ్లి పీటలెక్కిన టీమిండియా ఆల్‌రౌండర్
- కేరళ బాట పట్టనున్న పుష్ప టీం
- భీవండి పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం
- ‘ఎంజీఎంలో’ కొండెంగ.. కోతుల బెడద తప్పిందంటున్న సిబ్బంది
- ఎకరంలో 20 పంటలు.. లాభాలు గడిస్తున్న యువరైతు
- బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో సుమ ఫన్ షో.. వీడియో వైరల్
- ఆక్సిజన్ పార్కును ప్రారంభించనున్న మంత్రి హరీశ్
- కార్పొరేట్ల అనుకూల బడ్జెట్టే : వ్యవసాయ మంత్రి
- ఏఆర్ రెహమాన్‌ను కలిసిన టీమిండియా యంగ్ ప్లేయర్
- దూరవిద్య పీజీ పరీక్షల తేదీల్లో మార్పు