గురువారం 28 జనవరి 2021
Warangal-city - Nov 03, 2020 , 02:13:02

ఓటు అత్యంత విలువైంది

ఓటు అత్యంత విలువైంది

హన్మకొండ/నయీంనగర్‌/మట్టెవాడ : ప్రజాసామ్యంలో ఓటు అత్యంత విలువైందని, ఓటు ఒక ఆయుధమని, ప్రతి పట్టభద్రుడు హక్కుగా భావించి ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఓటరు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పిలుపునిచ్చారు. సోమవారం హన్మకొండలో మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి నివాసంలో కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌, కేయూ పార్ట్‌టైం లెక్చరర్స్‌ అసోసియేషన్‌, అకుట్‌ (అసోసియేషన్‌ ఆఫ్‌ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్‌) ప్రతినిధులతో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయిన తర్వాత పార్టీలు, అభ్యర్థుల ప్రస్తావన ఉంటుందని పేర్కొన్నారు. అంతకు ముందు లాల్‌బహదూర్‌ కళాశాలలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గంలో పట్టభద్రుల ఓటరు నమోదు కోసం కార్పొరేటర్లు, కో ఆర్డినేటర్లు, డిజిజన్‌ అధ్యక్షులు, ఇన్‌చార్జిలతో హన్మకొండ రాంనగర్‌లోని నిత్య బాంక్వెట్‌ హాల్‌లోనూ బోయినపల్లి వినోద్‌కుమార్‌, కడియం శ్రీహరి సమావేశం నిర్వహించారు. ఇక్కడ బోయినపల్లి మాట్లాడుతూ ప్రతి డివిజన్‌లో రోజుకు కనీసం వంద సభ్యత్వాలు చేయాలని సూచించారు. గడువు ముగిసేలోగా 20వేల సభ్యత్వాలు కావాలన్నారు. ఇక్కడ కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అజీజ్‌ఖాన్‌, డిప్యూటీ మేయర్‌ సిరాజుద్దీన్‌ పాల్గొన్నారు. 

విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి

వరంగల్‌ ఎల్బీ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం ఇక నుంచి విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నదని, విద్యా వ్యవస్థను సమూలంగా మార్చే దిశగా సమాలోచనలు చేస్తున్నదని చెప్పా రు. అందుకే ఒకేషనల్‌ కోర్సులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, సీఎంకే కళాశాలలో ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టినట్లు తెలిపారు.ఇక్కడ టీఆర్‌ఎస్‌ యువజన నాయకుడు ఇండ్ల నాగేశ్వర్‌రావు, ఆత్మకూర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ బండి రజనీకుమా ర్‌, ఎల్బీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అరుణ డీహెచ్‌ రావు, డాక్టర్‌ సదానందం, రఘువేందర్‌ రెడ్డి, రాజేశ్వర్‌రావు, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు. 

ఖాళీల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా

సెరీకల్చర్‌ శాఖలో ఉన్న ఖాళీల విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని బోయినపల్లి చెప్పారు. హన్మకొండలోని తన నివాసంలో తనను కలిసిన సెరీకల్చర్‌ పట్టభద్రులు, డిప్లొమాదారులకు ఆయన ఈ మేరకు హామీనిచ్చారు. రాష్ట్రంలోని భూములు మల్బరీ తోటల పెంపకానికి ఎంతో అనువైనవని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మూడు వేల ఎకరాల్లో సెరీకల్చర్‌ సాగు విస్తీర్ణం ఉంటే, ప్రస్తుతం 15వేల ఎకరాలకు చేరిందన్నారు. సాగు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఖాళీలు భర్తీ చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఇక్కడ నవపట్టు నిరుద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమేశ్‌, ప్రధాన కార్యదర్శులు సుమన్‌, రవీందర్‌, ఉపాధ్యక్షుడు సందీప్‌ తదితరులున్నారు. 


logo